నో బాల్‌ అంపైర్‌

Nava Telangana

Nava Telangana

Author 2019-11-06 03:00:21

- నో బాల్స్‌ కోసం ప్రత్యేకంగా టీవీ అంపైర్‌
- ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం
- పవర్‌ ప్లేయర్‌ ఫార్ములాకు దక్కని ఆమోదం
నవతెలంగాణ-ముంబయి
2019 ఐపీఎల్‌ సీజన్‌ ధనాధన్‌ విన్యాసాలకు ఎంత మేరకు గుర్తుంటుందో తెలియదు, కానీ అంపైరింగ్‌ తప్పిదాలకు నెలవుగా మాత్రం చిరకాలం గుర్తుండిపోతుంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌లో ఫలితాన్ని శాసించిన ' నో బాల్‌ నిర్ణయం తప్పిదం' కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఆగ్రహాన్ని తెప్పించింది. ' మనం ఆడుతున్నది ఐపీఎల్‌ స్థాయిలోనా? క్లబ్‌ క్రికెట్‌లోనా? అంపైర్లు కండ్లు తెరిచి చూడాలి' అని కోహ్లి ఘాటు విమర్శలు చేశాడు. ముంబయితో మ్యాచ్‌లో చివరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా, బెంగళూర్‌ ఒక్క పరుగే చేసింది. కానీ ఆ బంతిని మలింగ నో బాల్‌గా వేశాడు. అంపైర్‌ దాన్ని గమనించలేదు. మ్యాచ్‌ అనంతరం నో బాల్‌ను పెద్ద తెరపై చూపించారు. రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌లోనూ నో బాల్‌ విషయంలోనే గందరగోళం. ప్రధాన అంపైర్‌ ఎత్తు కారణంగా నో బాల్‌గా ఇచ్చాడు. కానీ లెగ్‌ అంపైర్‌ ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చాడు. బాల్‌ సరైనదేనని చెప్పాడు. ఈ గందరగోళంతో చెన్నై సారథి ఎం.ఎస్‌ ధోని ఆవేశంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. మైదానంలోకి బ్యాటింగ్‌ జట్టు కెప్టెన్‌ రావటం క్రికెట్‌ చరిత్రలోనే అరుదు. ఈ రెండు సంఘటనలకు ప్రధాన కారణం ' నో బాల్‌' నిర్ణయంలో ఫీల్డ్‌ అంపైర్ల తప్పిదాలు. 2020 ఐపీఎల్‌లో అంపైరింగ్‌ తప్పిదాలు పునరావృతం కాకుండా, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. వచ్చే సీజన్‌ నుంచి నో బాల్‌ చూసేందుకు ప్రత్యేక టీవీ అంపైర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
దేశవాళీలో ప్రయోగం : నో బాల్స్‌ పరిశీలించే టీవీ అంపైర్‌కు థర్డ్‌, ఫోర్త్‌ అంపైర్‌తో ఎటువంటి సంబంధం ఉండదు. ప్రతి బంతినీ నో బాల్‌ కోణంలో పరిశీలించే టీవీ అంపైర్‌, సమాచారాన్ని ఫీల్డ్‌ అంపైర్‌తో పంచుకుంటాడు. నో బాల్‌గా తేలితే వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఐపీఎల్‌లో విపరీత అంపైరింగ్‌ తప్పిదాలతోనే 2018లో లీగ్‌లో డీఆర్‌ఎస్‌ (అంపైర్‌ నిర్ణయ సమీక్ష)ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నో బాల్స్‌ విషయంలో వివాదం చెలరేగటంతో ప్రత్యేకించి టీవీ అంపైర్‌ను నియమించనున్నారు. నో బాల్‌ టీవీ అంపైర్‌ను తొలుత దేశవాళీ క్రికెట్‌లో ప్రయోగించనున్నారు. ఐపీఎల్‌ వేలానికి ముందు జరిగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో నో బాల్‌ టీవీ అంపైర్‌ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని ఐపీఎల్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచనున్నారు. ఈ మేరకు బ్రిజేశ్‌ పటేల్‌ సారథ్యంలోని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మంగళవారం నిర్ణయం తీసుకుంది. టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్‌ బ్రిజేశ్‌ పటేల్‌ ఇటీవలే ఐపీఎల్‌ చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.
పవర్‌ ప్లేయర్‌ పక్కకు? : మంగళవారం జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి ముందు అంతటా 'పవర్‌ ప్లేయర్‌' గురించే చర్చ సాగింది. ఏ సమయంలోనైనా తుది జట్టులో లేని ఆటగాడిని రంగంలోకి దించే వెసులుబాటు పవర్‌ ప్లేయర్‌తో ఇరు జట్లకు దక్కనుంది. బీసీసీఐ ఆమోదం తెలిపిన ఈ నిబంధన 2020 ఐపీఎల్‌లో చూడటం లాంఛనమే అనే అభిప్రాయం వినిపించింది. విచిత్రంగా మంగళవారం నాటి ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పవర్‌ ప్లేయర్‌ ఫార్ములాను పక్కనపెట్టారు. క్రికెట్‌ సహజ స్ఫూర్తికి ఈ నిబంధన ఆటంకం కలిగిస్తున్న మాట వాస్తవం. కానీ పూర్తిగా కాసుల కోణంలోనే ఆలోచించే బీసీసీఐ, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లు కచ్చితంగా పవర్‌ ప్లేయర్‌ను అమల్లోకి తీసుకువస్తారనే అంచనా నెలకొంది. బ్రిజేశ్‌ పటేల్‌ సారథ్యంలో జరిగిన సమావేశంలో ప్రస్తుతానికి పవర్‌ ప్లేయర్‌ను పక్కనపెడదామనే అభిప్రాయం ఏర్పడినట్టు సమాచారం. పవర్‌ ప్లేయర్‌కు ఆమోదం దక్కకపోయినా, రానున్న సీజన్లలో పవర్‌ ప్లేయర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD