పంచ్‌ పవర్‌ చూపిస్తాడా!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-16 05:48:12

img

దేశ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత క్లిష్ట సమయంలో జట్టు పగ్గాలు చేపట్టి.. ఆ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలవగలిగాడు. దూకుడుకు పర్యాయపదంగా నిలుస్తూ యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చి వారిని స్టార్లుగా మార్చాడు. ఇప్పుడు ఏకంగా భారత క్రికెట్‌కు మూలస్తంభమైన బీసీసీఐ పగ్గాలే చేపట్టబోతున్నాడు. 33 నెలలుగా అస్తవ్యస్తంగా ఉన్న బోర్డు పరిపాలనను సరైన మార్గంలో పెట్టేందుకు సౌరవ్‌ గంగూలీ ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడందరికీ ఆసక్తికరంగా మారింది.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఈనెల 23న బీసీసీఐ సరికొత్త అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను చేపట్టబోతున్నాడు. తన గురువు జగ్మోహన్‌ దాల్మియా అధిష్టించిన స్థానంలో తాను కూర్చుంటానని అసలే మాత్రం ఊహించని ఈ బెంగాలీ బాబు మరో పది నెలలపాటు ఈ అత్యున్నత పదవిలో ఉండబోతున్నాడు. సవాళ్లను చూసి ఏ మాత్రం బెదిరే అలవాటులేని గంగూలీ గతంలోనే తన సామర్థ్యమేమిటో అందరికీ చూపాడు. 2000లో సచిన్‌ సారథ్య బాధ్యతలనుంచి తప్పుకొన్నాక ఎవరి అంచనాల్లోనూ లేని గంగూలీ కెప్టెన్‌గా మారాడు. అయితే యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టును శత్రుదుర్భేద్యంగా మార్చగలిగాడు. ఇప్పు డు ముళ్లకిరీటం లాంటి బోర్డు అధ్యక్ష పదవిని కూడా సవాల్‌గా స్వీకరించేందుకు సిద్ధమవుతున్న గంగూలీకి ఎదురయ్యే సవాళ్లు..

చేయాల్సిన సంస్కరణలేమిటో ఓసారి చూద్దాం...

గ్లోబల్‌ ఈవెంట్స్‌: ఐసీసీ టోర్నమెంట్లపై గంగూలీ అమితాసక్తిని ప్రదర్శిస్తుంటాడు. అయితే ఇటీవలి వన్డే వరల్డ్‌క్‌పలో భారత ప్రదర్శనపై దాదా సంతృప్తిగా లేడు. ఈ విషయంలో కచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచక్‌పతోనే ఇది ఆరంభం కావచ్చు. అయితే ఈ మెగా ఈవెంట్‌ జరిగేనాటికి గంగూలీ పదవి నుంచి వైదొలగాల్సి ఉంటుంది.

డే అండ్‌ నైట్‌ టెస్టు: గులాబీ బంతితో ఆడే డే అండ్‌ నైట్‌ టెస్టులంటే ఇష్టపడని ఏకైక జట్టు భారతే. అయితే గంగూలీ మాత్రం ఈ తరహా ఆటకు మద్దతిస్తుంటాడు. రెండేళ్ల క్రితం కోల్‌కతాలో పింక్‌ బాల్‌ టోర్నమెంట్‌ను కూడా నిర్వహించాడు. ఓ దశలో ఈడెన్‌ గార్డెన్స్‌లోనూ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాలని కూడా చూశాడు. అయితే బీసీసీఐ నుంచి సుముఖత రాలేదు. తాజాగా పింక్‌ బాల్‌ టెస్టులపై అతడి నిర్ణయం ఎలా ఉంటుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.

అంపైరింగ్‌ ప్రమాణాలు: ఇటీవలి కాలంలో జూనియర్‌ క్రికెట్‌, రంజీ స్థాయిలో అంపైరింగ్‌ ప్రమాణాలు మరీ నాసిరకంగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. వీరి నిర్ణయాల ప్రభావం వర్థమాన ఆటగాళ్లపై పడుతోంది. మంచి జీతం, సరైన శిక్షణ కల్పిస్తే మరింత మందిని అంపైరింగ్‌ వైపు ఆకర్షించవచ్చు. లోధా సంస్కరణల కారణంగా ప్రస్తుతం అన్ని స్థాయిల్లో కలిపి 266 జట్లున్నాయి. వీరు ఆడే మ్యాచ్‌ల కారణంగా అంపైర్లు, రెఫరీలు, మైదానాలు, మైదాన సిబ్బందిపై భారం భారీగానే పడనుంది. అలాగే ఎవరూ అంతగా దృష్టి పెట్టని గ్రౌండ్స్‌మెన్‌ సంక్షేమం కోసం బీసీసీఐ పాటుపడాల్సి ఉంది.

ఎంఎస్‌ ధోనీ: విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలను ఎంతగా అభిమానించినా ఎంఎస్‌ ధోనీపై మాత్రం గంగూలీ అంత సానుకూలంగా ఏమీ కనిపించడు. నేరుగా అతడిని విమర్శించకపోయినా జట్టులో ఇప్పుడు ధోనీ స్థానంపై జరుగుతున్న చర్చను దృష్టిలో పెట్టుకుని ఈ మాజీ కెప్టెన్‌ కూల్‌తో రిటైర్మెంట్‌ విషయం చర్చించే అవకాశం లేకపోలేదు.

రవిశాస్త్రి: గంగూలీ బీసీసీఐ చీఫ్‌ అవబోతుండడంతో కోచ్‌ రవిశాస్త్రి పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ విషయమై సెటైర్లు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే వీరిద్దరి మధ్య అంత సఖ్యత ఏమీ లేదు. 2016లో రవిశాస్త్రిని కాదని అనిల్‌ కుంబ్లేకు కోచ్‌ పదవి ని కట్టబెట్టడంలో దాదాది కీలక పాత్ర. ఇదే విషయమై అటు శాస్త్రి కూడా గంగూలీపై విమర్శలు గుప్పించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరిగి శాస్త్రి కోచ్‌గా మారా డు. అయితే తాజాగా శాస్త్రి పదవీ కాలం ఇప్పటికే ఖరారైనా.. అతడి కోచింగ్‌ పద్దతులపై, జట్టు ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్ష కార్యాలయం నుంచి మాత్రం లేఖలు రావచ్చు. నిజానికి భారత జట్టు కోచ్‌ పదవిపై దాదా కూడా గతంలో ఆసక్తి చూపాడు.


వెంగ్‌సర్కార్‌: భారత జట్టులో సౌరవ్‌ గంగూలీకి చోటు అనవసరం అనే చర్చ సాగుతున్న సమయంలో 2006లో అప్పటి చీఫ్‌ సెలెక్టర్‌ వెంగ్‌సర్కార్‌ అతడికి మద్దతుగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సతో పాటు 2007 ప్రపంచక్‌పలోనూ ఆడించాడు. ఇప్పుడు దాదాకు రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అందుకే మరోసారి చీఫ్‌ సెలెక్టర్‌గా వెంగీ దాదాపు ఖాయమేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పదవీకాలం ముగుస్తుండడంతో కొత్త ప్యానెల్‌ను ఈనెల 23న జరిగే ఏజీఎంలో నియమించే అవకాశం ఉంది.

రోహిత్‌ శర్మ: భారత జట్టు వన్డే వైస్‌కెప్టెన్‌ రోహిత్‌ శర్మను గంగూలీ ఎక్కువగా అభిమానిస్తుంటాడు. అసలు టెస్టుల్లోనూ అతడి చేతే ఓపెనింగ్‌ చేయించాలని మొదట చెప్పింది దాదానే. జట్టుకు ఇద్దరు కెప్టెన్లుంటే మేలని అప్పట్లో కామెంట్స్‌ వినిపించాయి. అయితే కోహ్లీ హవా సాగుతున్న సమయంలో కనీసం పరిమిత ఓవర్ల వరకు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించే సాహసం సౌరవ్‌ చేస్తాడా? అనేది సందేహమే.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN