పడి లేచిన కెరటం!

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-06 05:59:52

img

భారత్‌ తరఫున 17 ఏళ్ల వయస్సులోనే టీ20ల్లో అరంగేట్రం. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2016లో వన్డే జట్టులో స్థానం. కెరీర్‌ రెండో మ్యాచ్‌లోనే అర్థ సెంచరీతో సత్తా చాటిన వైనం. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 89 రన్స్‌ చేసి భవిష్యత్‌ స్టార్‌గా ప్రశంసలు అందుకొంది. ప్రతిభకు కొదవలేని ఈ ఆల్‌రౌండర్‌గా ఎంతో ఎత్తుకు ఎదగాల్సి ఉంది. అయితే అనారోగ్యం, వ్యక్తిగత సమస్యల రూపంలో దురదృష్టం ఆమెను వెంటాడింది. చివరకు ఒడిదుడుకులను అధిగమించి మహిళల ఐపీఎల్‌తో తిరిగి క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆ యువ సంచలనం దేవికా వైద్య.

దేవికా పుర్నెందు దేవిక స్వస్థలం పుణె. తండ్రి వాణిజ్య నౌకల కెప్టెన్‌. ఆమె కుంటుంబానికి క్రికెట్‌ అంటే మహా ఇష్టం. మ్యాచ్‌లున్నాయంటే కుటుంబ సభ్యులంతా టీవీలకు అతుక్కుపోతారు. దాంతో దేవికకు చిన్నతనుంచే క్రికెట్‌పట్ల ఏర్పడిన ఆసక్తి ఆ క్రీడను కెరీర్‌గా ఎంచుకొనేందుకు దారి తీసింది. ఫలితంగా ఏడో ఏట క్రికెట్‌లో ఓనమాలకు శ్రీకారం చుట్టింది.

తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌

బాల్యంలో క్రికెట్‌తో పాటు తైక్వాండో కూడా వైద్య నేర్చుకుంది. వారంలో మూడ్రోజులు క్రికెట్‌ శిక్షణకు వెళితే నాలుగు రోజులు తైక్వాండో క్లాసులకు హాజరయ్యేది. ఉదయం ఐదు గంటలకు రన్నింగ్‌తో దినచర్య ఆరంభించి..అనంతరం తైక్వాండోకు సంబంధించిన వ్యాయామాలు చేసేది. కఠోర శ్రమతో కొద్దికాలంలోనే సెకండ్‌ డిగ్రీ బ్లాక్‌బెల్ట్‌ను సొంతం చేసుకొంది. క్రికెట్‌లోనూ రాణిస్తున్న వైద్యకు మహారాష్ట్ర అండర్‌-19 జట్టు తరఫున ఆడే అవకాశం లభించింది. అప్పటికే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్న ఆమె తైక్వాండోకి గుడ్‌బై చెప్పింది. 2014-15 సీజన్‌లో టీ20 ఫార్మాట్‌లో (ఎలైట్‌ డివిజన్‌) అత్యధిక వికెట్లు తీసుకోవడంతో సౌతాఫ్రికాపై టీమిండియా తరపున పొట్టి క్రికెట్‌లో అరంగేట్రం చేసే చాన్స్‌ దక్కింది. 2016లో వెస్టిండీ్‌సపై తన తొలి వన్డే ఆడింది. 2014లో బెస్ట్‌ ఉమెన్‌ జూనియర్‌ క్రికెటర్‌ అవార్డు అందుకుంది.

అద్దంలో చూసి సాధన..

అతుల్‌ గైక్వాడ్‌ దగ్గర వైద్య క్రికెట్‌ తొలి పాఠాలు నేర్చుకొంది. అత్యంత పోటీ ఉన్న ఈ క్రీడలో ఆమె సత్తా చాటిందంటే అందుకు గైక్వాడ్‌ వేసిన బలమైన పునాదులే కారణం. వైద్యకు లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌తోపాటు, దూకుడైన బ్యాటింగ్‌ ఇష్టం. ఇది గమనించిన గైక్వాడ్‌ షేన్‌వార్న్‌, ఏబీ డివిల్లీర్స్‌ వీడియోలు చూపించి ఆమెతో ప్రాక్టీస్‌ చేయించాడు. వైద్య ఎడమచేతి వాటం క్రీడాకారిణి కావడంతో గైక్వాడ్‌ ఇచ్చిన వీడియోలను అద్దంలో చూసి..తర్వాత ఆ విధంగా సాధన చేసేది. ప్రస్తుతం నిరంజన్‌ గాడ్బోలే శిక్షణలో తన ఆటను మెరుగు పర్చుకుంటోంది. క్లబ్‌ క్రికెట్లో పురుషులతో కలిసి ఆడడం కూడా ఆడింది. దీనివల్ల అనేక కొత్త విషయాలు నేర్చుకొనే అవకాశం కలిగిందని వైద్య చెప్పింది. మహిళా క్రికెట్లర్లు మిఽథాలీ రాజ్‌, జూలన్‌ గోస్వామి వంటి సీనియర్లతో కలిసి ఆడడం తన అదృష్టమని తెలిపింది.

చిరస్మరణీయ ఇన్నింగ్స్‌

2017 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా కొలంబోలో శ్రీలంకతో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది. అయితే 120కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో క్రీజులోకి వచ్చిన వైద్య ఏమాత్రం ఒత్తిడి లేకుండా బ్యాటింగ్‌ చేసింది. తన రెండో వన్డేలోనే 89 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి జట్టు మంచి స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఇది వైద్యకు అప్పటికి రెండో వన్డేనే. అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేకున్నా ఒత్తిడి సమయంలో ఆమె ఆడిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 114 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది.

వెన్నంటిన దురదృష్టం

శ్రీలంకపై అద్భుతంగా ఆడిన తర్వాత భుజం గాయం కారణంగా కొంత కాలం క్రికెట్‌కు వైద్య దూరమైంది. గాయం నుంచి కోలుకున్నాక 2018లో ఆస్ట్రేలియాతో ఆడే అవకాశం దక్కింది. అయితే చికున్‌గున్యాతో ఆ సిరీస్‌ మిస్సయింది. అనంతరం ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటు లభించింది. వామప్‌ మ్యాచ్‌లో శతకం బాదిన వైద్య ఫామ్‌ దొరకబుచ్చుకొంది. అయితే తర్వాత ఆడిన వన్డేలో ఆ జోరు కొనసాగించలేక జట్టులో స్థానం కోల్పోయింది. కఠోర సాధనతో మళ్లీ సెలెక్టర్ల దృష్టిలో పడిన వైద్య ఉమెన్స్‌ చాలెంజర్‌ ట్రోఫీలో పాల్గొనే భారత సీనియర్‌ జట్టులో చోటు సంపాదించింది. కానీ ఈసారి డెంగ్యూ రూపంలో వైద్యను దురదృష్టం వెంటాడింది.

తల్లి హఠాన్మరణం..

గత ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌లో తలపడిన జట్టులో దేవికకు స్థానం దక్కింది. అయితే తల్లి మౌసమ్‌ వైద్య గుండెపోటుతో మరణించడంతో ఆమె జట్టునుంచి వైదొలగాల్సి వచ్చింది. నీడలా వెన్నంటి ఉండే తల్లి శాశ్వతంగా దూరమవడంతో వైద్య కుంగిపోయింది. కానీ క్రికెటర్‌గా తాను ఉన్నత స్థితికి చేరాలన్న తల్లి కలను నిజం చేయాలంటే ఆ బాధనుంచి వెంటనే బయటకు రాక తప్పదని గ్రహించింది. దుఃఖంనుంచి కోలుకొని మళ్లీ క్రికెట్‌పై దృష్టి నిలిపింది. ఏప్రిల్‌లో జరిగిన అండర్‌-23 చాలెంజర్‌ ట్రోఫీలో ఇండియా బ్లూకు సారథ్యం వహించిన వైద్య..మహిళల ఐపీఎల్‌లో వెలాసిటీ జట్టు తరఫున ఆడింది. సీనియర్‌ ప్లేయర్లు ఎక్కువమంది ఉండడంతో ఆమె లీగ్‌ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైంది.

ఊహించని రీతిలో ఫైనల్‌ మ్యాచ్‌కు జట్టులో దక్కింది గానీ బ్యాటింగ్‌ చేసే చాన్స్‌ రాలేదు. బౌలింగ్‌ చేయడానికి వచ్చిన అవకాశాన్ని మాత్రం వైద్య చక్కగా ఉపయోగించుకొంది. నాలుగు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టింది. ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీని ఇష్టమైన క్రికెటర్‌గా పేర్కొనే వైద్యకు స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధాన చిన్ననాటినుంచి స్నేహితురాలు. ఇప్పటివరకు 9 వన్డేలు, ఒక టీ20లో టీమిండియాకు ఆడిన 22 ఏళ్ల వైద్య.. మరిన్ని అవకాశాలకోసం ఎదురు చూస్తోంది.

ఎక్కువ కాలం ఆడాలి

టీమిండియాకు సుదీర్ఘంగా ఆడాలనేది లక్ష్యం. జట్టుకు ఎంపికవడం నా చేతిలో లేదు. కష్టపడితే అవకాశాలు అవే వస్తాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారమే కెరీర్‌లో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ముఖ్యంగా అమ్మనుంచి లభించిన మద్దతు చెప్పలేనిది. లక్ష్యాలను అందుకోలేక నిరాశ చెందిన సమయాల్లో ఆమె నాలో ఎంతో ప్రేరణ కల్పించింది. అలాంటి అమ్మ భౌతికంగా లేకపోవడం తీరని లోటు. ఆమె ఆశలకు అనుగుణంగా దేశం మెచ్చే క్రికెటర్‌ను అవుతా.

- దేవికా వైద్య

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN