పర్యావరణ హిత ఇంధనంపై మరిన్ని పరిశోధనలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-21 07:43:23

విశాఖపట్నం, అక్టోబర్ 20: ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పర్యావరణ కాలుష్యం నుంచి విముక్తి పొందేలా పర్యావరణ హిత ఇంధన వినియోగంపై పరిశోధనలు జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐఐఈపీ) నాలుగవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెట్రోలియం, ఇంధన రంగంలో విస్తృత పరిశోధనలకు ఐఐఈపీ వేదిక కావాలన్నారు. కేజీ బేసిన్‌లో అపార సహజ వాయువులు నిక్షిప్తమై ఉన్నాయని, వీటిని వెలికితీసే విధానంలో ఆధునిక పద్ధతులు అవసరమన్నారు. ఒకవిధంగా పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం ప్రపంచ పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని, అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వీటి వినియోగం అనివార్యం అవుతోందన్నారు. సోలార్, న్యూక్లియర్ ఇంధన వనరుల వినియోగం పెరగాల్సి ఉందన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మంజూరు చేసిన పలు జాతీయ విద్యా సంస్థల్లో ఐఐఈపీ ప్రధాన మైందని, ఇక్కడ విద్యార్థులు సరికొత్త ఆవిష్కరణలతో తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ముఖ్యంగా చమురు, సహజవాయువులు, ఇంధన రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో పరిశోధనలు జరగాలన్నారు. దీనికోసం అత్యాధునిక పరిశోధనాలయాలను సమకూర్చుకోవాలన్నారు. పర్యావరణ సమస్య మనదేశానికే కాదని, ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఔషధ మొక్కలను పెంచడం ద్వారా పర్యారణాన్ని కాపాడుకోవచ్చనన్నారు. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మహాత్మా గాంధీ శాంతి సందేశాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐఐఈపీని మంజూరు చేసిందని, అయితే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విద్యా సంస్థను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏర్పాటుచేయాలని నిర్ణయించగా, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విశాఖకు కేటాయించారన్నారు.
కార్యక్రమంలో ఐఐఈపీ డైరెక్కర్ ప్రొఫెసర్ వీఎస్‌ఆర్కే ప్రసాద్, ఐఐఎం డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ పాల్గొన్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD