పవర్‌ ప్లేయర్‌ వస్తున్నాడు!

Nava Telangana

Nava Telangana

Author 2019-11-05 03:33:05

- 2020 ఐపీఎల్‌కు బీసీసీఐ సరికొత్త ఆలోచన
- ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం నేడు
నవతెలంగాణ-ముంబయి
' ఆఖరు ఓవర్‌. ఆరు బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో టెయిలెండర్లు ఉన్నారు. తుది జట్టులో లేని రసెల్‌, రోహిత్‌ శర్మ వంటి ధనాధన్‌ బ్యాట్స్‌మెన్‌ డగౌట్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌ జట్టు కెప్టెన్‌ వెంటనే డగౌట్‌లోని ధనాధన్‌ బ్యాట్స్‌మన్‌ను క్రీజులోకి పంపవచ్చు'. క్రికెట్‌ సహజ సూత్రాలకు విరుద్ధంగా ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? 2020 ఐపీఎల్‌లో ఈ సరికొత్త మార్పులను అభిమానులు చూడబోతున్నారు. ఇదే తరహాలో ఆఖరు ఓవర్లో ఆరు పరుగులు కాపాడుకోవాల్సిన పరిస్థితిలో డగౌట్‌లోని జశ్‌ప్రీత్‌ బుమ్రా వంటి స్టార్‌ సీమర్‌ను ఫీల్డింగ్‌ జట్టు కెప్టెన్‌ బరిలోకి దింపవచ్చు. బీసీసీఐ ఇప్పటికే ఈ సరికొత్త ' పవర్‌ ప్లేయర్‌' ఫార్ములాకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపితే రానున్న ఐపీఎల్‌ సీజన్‌లో పవర్‌ ప్లేయర్‌ మజాను అభిమానులు ఆస్వాదించవచ్చు.
కమర్షియల్‌ ఫార్ములా : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అనగానే బీసీసీఐకి కాసులు కురిపించే కల్ప వృక్షం. కొత్తగా ఐపీఎల్‌లో చూపించాలనే తాపత్రయం, తద్వారా అభిమానులను ఆకట్టుకోవటం దండిగా సొమ్ము చేసుకోవటం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచన. పవర్‌ ప్లేయర్‌ ఫార్ములా అమల్లోకి వస్తే మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఎప్పుడైనా డగౌట్‌లో కూర్చున్న ఆటగాడిని రంగంలోకి దింపవచ్చు. వికెట్‌ పడిన సందర్భంలో, ఓవర్‌ ముగిసిన తర్వాత సహా ఏ సమయంలోనైనా పవర్‌ ప్లేయర్‌ అవకాశాన్ని ఇరు జట్ల కెప్టెన్లు వినియోగించుకోవచ్చు.
బీసీసీఐ నుంచి పవర్‌ ప్లేయర్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్టు తెలుస్తోంది. నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పవర్‌ ప్లేయర్‌ ఫార్ములా చర్చకు రానుంది. గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదం సహా ఐపీఎల్‌ ప్రాంఛైజీల అభిప్రాయం తీసుకోనున్నారు. వచ్చే ఐపీఎల్‌లోనే ఈ ప్రయోగానికి సిద్ధమైతే.. ముందుగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో పవర్‌ ప్లేయర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. దేశవాళీలో పవర్‌ ప్లేయర్‌ విజయవంతమైతే, ఐపీఎల్‌లో నేరుగా అమలు చేసేందుకు అవకాశం ఉంది.
పవర్‌ ప్లేయర్‌ ఫార్ములాతో ఐపీఎల్‌కు కొత్త కళ వస్తుందని బీసీసీఐ భావిస్తోంది. నిస్సారంగా సాగుతున్న మ్యాచుల్లో పవర్‌ ప్లేయర్‌ అవకాశం మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చనుంది. దీంతో విజయం కోసం ఇరు జట్ల మధ్య ఆఖరు బంతి వరకూ పోరాటం సాగనుంది. ఛేదనలో బ్యాటింగ్‌ లైనప్‌ను పూర్తిగా సాగనంపినా.. పవర్‌ ప్లేయర్‌ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉండనుంది. ఐపీఎల్‌ మ్యాచులకు పవర్‌ ప్లేయర్‌ కొత్త పవర్‌ తీసుకొస్తుందని బీసీసీఐ బలంగా విశ్వసిస్తోంది. దీనిపై నేడు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోనుంది.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD