పాక్‌ను ఆదుకున్న వర్షం

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-04 03:01:54

img

సిడ్నీ, నవంబర్ 3: ఆస్ట్రేలియాతో ఆదివారం నాటి మొదటి టీ-20 మ్యాచ్ పాకిస్తాన్‌ను వర్షం ఆదుకుంది. లేకపోతే, దారుణంగా పరాజయాన్ని ఎదుర్కొని, సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి ఉండేది. వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌ని అంపైర్లు 15 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఓపెనర్ బాబర్ ఆజమ్ 59 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, వికెట్‌కీపర్ మహమ్మద్ రియాజ్ 31 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 22 పరుగులకు రెండు, కేన్ రిచర్డ్‌సన్ 16 పరుగులకు రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఆష్టన్ అగర్‌కు ఒక వికెట్ లభించింది. కాగా, ఇటీవలే శ్రీలంకపై క్లీన్‌స్వీప్ సాధించి, మంచి ఫామ్‌లో ఉన్న ఆస్ట్రేలియా 108 పరుగుల అత్యంత సాధారణమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆటను మొదలుపెట్టి, 3.1 ఓవర్లలోనే, వికెట్ నష్టం లేకుండా 41 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్కేవలం 16 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు సాధించగా, అతనికి మద్దతుగా నిలిచిన మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేశాడు. ఈ దశలో వర్షం మళ్లీ కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆతర్వాత ఎంత సేపటికీ వర్షం తగ్గలేదు. దీనికితోడు ఔట్ ఫీల్డ్ నీటిమయమైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. మంచి ఊపుమీద ఉన్న ఆస్ట్రేలియాను మైదానంలో నిలువరించే అవకాశం లేదని గ్రహించిన పాకిస్తాన్, వర్షం ఆదుకోవడంతో ఊపిరి పీల్చుకొని, ఓటమి నుంచి బయటపడింది. కాగా, ఈ సిరీస్‌లో రెండో టీ-20 ఈనెల 5న కాన్‌బెరాలోని మనుకా ఓవల్ మైదానంలో జరుగుతుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD