పుణె పటాకా ఎవరిదో..!

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-10 03:23:00

-నేటి నుంచి భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు
-జోరుమీదున్న టీమ్‌ఇండియా.. అడ్డుకోవాలని డుప్లెసిస్ సేన..
-ఉ.9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లోఓపెనర్ల విజృంభణ, మిడిలార్డర్ నిలకడ, స్పిన్నర్ల జోరు, పేసర్ల తోడుతో తొలి టెస్టు నెగ్గిన టీమ్‌ఇండియా.. పుణెలోనూ అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నది. సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారి ఓపెనింగ్ చేసిన రోహిత్ పరుగుల వరద పారించడంతో విశాఖ టెస్టులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన విరాట్ సేన.. ఒక్క సెషన్ మినహా సఫారీలను తమ కబంద హస్తాల్లో బంధించి ఉంచింది. అయితే ఇక్కడ ఆడిన చివరి టెస్టులో ఘోర పరాజయం టీమ్‌ఇండియాను కాస్త ఇబ్బంది పెడుతున్నది. ఈ మ్యాచ్‌తో దాన్ని చెరిపేయాలని భారత్ భావిస్తుంటే.. గత పర్యటన మాదిరిగా వైట్‌వాష్ కాకుండా చూసుకోవాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది.
img
పుణె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విశాఖలో చక్కటి విజయాన్నందుకున్న టీమ్‌ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో పుణె టెస్టుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కోహ్లీ సేనకు పెద్దగా సమస్యలు లేకపోయినా.. పుణె టెస్టులో ఆడిన చివరి మ్యాచ్‌లో ఘోర పరాజయం కాస్త కలవరపెడుతున్నది. స్వదేశంలో చివరిసారిగా భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా చేతులెత్తేసింది ఇక్కడే. రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమ్‌ఇండియా రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 105, 107 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఎదురులేకుండా సాగుతున్న భారత్‌కు సఫారీలు ఏ మేరకు పోటీనిస్తారో చూడాలి. విశాఖ తొలి ఇన్నింగ్స్ పోరాటమిచ్చిన స్ఫూర్తితో ఈసారి మెరుగైన ప్రదర్శన చేసి సిరీస్‌లో సజీవంగా ఉండాలని దక్షిణాఫ్రికా కృతనిశ్చయంతో ఉంది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా కొత్త అవతారమెత్తిన రోహిత్ వైజాగ్‌లో శతకాలతో మోతెక్కిస్తే.. స్పిన్నర్లు మిగిలిన పని పూర్తిచేశారు. కీలక సమయంలో షమీ తన రివర్స్ స్వింగ్ పదును చూపెట్టడంతో భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ కొట్టడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. అదే జోరు ఇక్కడ కూడా కొనసాగించి రాంచీకి ముందే భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది.

మార్పుల్లేకుండా..

చాలా కాలంగా భారత్‌ను వేధిస్తున్న ఓపెనింగ్ సమస్యకు విశాఖపట్నంలో విరుగుడు లభించినైట్లెంది. కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో అదరగొడితే.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరుస శతకాలతో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు. జిడ్డు ఆటగాడిగా గుర్తింపు పొందిన చతేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో ధాటైన బ్యాటింగ్‌తో తనలోనూ విధ్వంసకారి ఉన్నాడని నిరూపించాడు. రోహిత్, రహానే, విహారి వైజాగ్‌లో పెద్దగా రాణించకున్నా.. అవసరమైనప్పుడు సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. సాహా, అశ్విన్, జడేజా రూపంలో చివరి వరుసలోనూ బ్యాటింగ్ చేయగలవారుండటం టీమ్‌ఇండియాకు అదనపు బలం. బౌలింగ్‌లో మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. టెస్టు ఫార్మాట్‌లో టీమ్ మేనేజ్‌మెంట్ తొలి ప్రాధాన్యత స్పిన్ జోడీ అశ్విన్, జడేజా ప్రత్యర్థిని తిప్పేయడంలో ఏమాత్రం పట్టు సడలించడం లేదు. అవసరమైనప్పుడు చేంజ్ బౌలర్లుగా విహారి, రోహిత్ కూడా ఓ చేయి వేయడానికి సిద్ధంగా ఉన్నారు.

img
పచ్చికతో కూడిన పిచ్‌పై పేస్‌తో భారత్‌ను పడగొట్టాలని దక్షిణాఫ్రికా ప్రణాళికలు రచిస్తున్నది. అందుకు తగ్గట్లే మరో పేసర్ లుంగి ఎంగ్డీని తుది జట్టులోకి తీసుకోనుంది. స్పిన్నర్లు ముత్తుస్వామి, డెన్ పీట్ విశాఖపట్నంలో భారత బ్యాట్స్‌మెన్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోవడంతో.. మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అయితే వీరిద్దరిలో ఎవరిని తప్పిస్తారో చూడాలి. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీలతో ఆకట్టుకున్న డీన్ ఎల్గర్, క్వింటన్ డికాక్‌తో పాటు కెప్టెన్ డుప్లెసిస్‌పైనే మరోసారి బ్యాటింగ్ భారం పడనుంది. మార్క్మ్,్ర బవుమా, డిబ్రుయన్ స్థాయికి తగ్గట్లు రాణించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో 13 సిక్సర్లతో ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్‌ను అడ్డుకుంటే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని భావిస్తున్న ప్రొటీస్.. ఆ దిశగా పావులు కదుపుతున్నది.

ఆటాడుకున్న స్టీవ్ ఓ కీఫ్..

రెండేండ్ల క్రితం ఇక్కడ జరిగిన టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది. భారత స్పిన్నర్లు విజృంభించారనుకుంటే పొరపాటే.. ప్రత్యర్థి స్పిన్నర్ ధాటికి మనవాళ్లు విలవిల్లాడారు. 2016-17 పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు ఇదే మైదానం ఆతిథ్యమిచ్చింది. టాస్ గెలిచిన అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాట్ రెన్‌షా (68), మిషెల్ స్టార్క్ (61) అర్ధశతకాలు సాధించడంతో కంగారూలు 260 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 4, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 105 పరుగులకే కుప్పకూలింది. లోకేశ్ రాహుల్ (64) ఒక్కడే జట్టు స్కోరులో సగంకంటే ఎక్కువ పరుగులు చేయగా.. స్టీవ్ ఓ కీఫ్ (6/35) ధాటికి మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ (109) సెంచరీతో చెలరేగడంతో 285 పరుగులు చేసిన ఆసీస్.. భారత్ ముందు 441 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కొండంత టార్గెట్ ఛేజింగ్‌లో భారత్ చతికిలబడింది. ఓ కీఫ్ (6/35), లియాన్ (4/53) విజృంభించడంతో 107 పరుగులకు ఆలౌటై.. ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ రోజు ఆడిన జట్టులో ఓపెనర్లు మినహా మిగిలిన ప్రధాన ఆటగాళ్లంతా గురువారం కూడా బరిలో దిగనున్నారు.

విదేశాల్లో గెలిస్తే.. డబుల్ పాయింట్స్!

టెస్టు చాంపియన్‌షిప్‌పై కోహ్లీ
విదేశాల్లో సాధించే టెస్టు విజయాలకు రెండింతల పాయింట్లు కేటయిస్తే బాగుంటుందని టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లు కేటాయించిన ఐసీసీ.. విదేశాల్లో ఆడే టెస్టులకు అందుకు రెట్టింపు పాయింట్లు కల్పిస్తే ఇంకా మెరుగ్గా ఉంటుందని అతడు పేర్కొన్నాడు. పాయింట్లు కేటాయించే విషయంపై నన్ను సంప్రదిస్తే.. విదేశాల్లో గెలిచిన మ్యాచ్‌లకు డబుల్ పాయింట్లు ఇవ్వాలంటా. తొలి ఎడిషన్ అనంతరం ఈ అంశంపై దృష్టి సారిస్తారనుకుంటున్నా. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కారణంగా మ్యాచ్‌ల ప్రాధాన్యం పెరిగింది. గతంతో పోల్చుకుంటే డ్రాల సంఖ్య తగ్గుతున్నది. అన్ని జట్లు పాయింట్లపై దృష్టి పెడుతుండటంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇది టెస్టు క్రికెట్‌కు శుభపరిణామం అని కోహ్లీ అన్నాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆడుతున్న ప్రతి సిరీస్‌కు 120 పాయింట్ల చొప్పున కేటాయించారు. రెండు టెస్టుల సిరీస్‌కూ, ఐదు టెస్టుల సిరీస్‌కు సమానమైన పాయింట్లు కల్పించడంపై కూడా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తమవుతుండగా.. తాజాగా కోహ్లీ వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

పిచ్, వాతావరణం

పచ్చికతో కూడిన పిచ్ పేస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నది. కానీ మ్యాచ్ సాగే ఐదురోజులు పేసర్లకు సహకరించకపోవచ్చు. ఉదయం పూట విపరీతమైన ఉక్కపోత ఉండి.. సాయంత్రం సమయాల్లో వర్షం కురిసే సూచనలున్నాయి. ఈ వికెట్‌పై జరిగిన చివరి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ 12 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించాడు.

తుది జట్లు (అంచనా)

భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమీ.

దక్షిణాఫ్రికా: డుప్లెసిస్ (కెప్టెన్) మార్క్మ్,్ర ఎల్గర్, డిబ్రుయన్, బవుమా, డికాక్, ముత్తుస్వామి, ఫిలాండర్, కేశవ్, రబాడ, ఎంగ్డీ.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN