ప్రతి ఇంటికీ, పరిశ్రమకూ ఇంధన భద్రత

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-27 08:59:34

img

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో సుస్థిర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు, ఇంధన భద్రత పెంపు దిశగా ముందడుగు పడింది. జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యు బ్యాంక్, టెరి అంతర్జాతీయ సంస్థలతో కలిసి రాష్ట్రంలోని పారిశ్రామిక, వ్యవసాయ భవనాల్లో ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తక్కువ ధరకు ప్రజలకు విద్యుత్ అందించే దిశగా ఈ నిర్ణయం కీలకం కానుంది. ఇంధన సమర్థతపై సర్వే నిర్వహించేందుకు ఈ రెండు సంస్థలు అంగీకరించాయి. వెలగపూడి సచివాలయంలో గురువారం ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌తో టెరీ ప్రతినిధి హేమంత భట్నాగర్, కేఎఫ్‌డబ్ల్యు సంస్థ ప్రతినిధి ప్రశాంతోపాల్ భేటీ అయ్యారు. ఇంధన సామర్థ్యంపై అధ్యయనం, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఇంటికీ, ప్రతి రైతుకు, పరిశ్రమకు ఇంధన సమర్థత నుంచి లబ్ధి కలిగించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
అందుబాటులో నాణ్యమైన విద్యుత్ అంధించడంలో ఇంధన సమర్థత కీలకం అవుతుందన్నారు. అందుబాటులో ధరల్లో విద్యుత్ అనే శాశ్వత వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలిక ఇంధన భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని భావిస్తున్నామన్నారు. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పరిశ్రమలు, వ్యవసాయం, తదితర రంగాల్లో కొత్త ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో తగిన సాంకేతికత అందుబాటులో లేని కారణంగా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారన్నారు. ఇంధన ఆదాకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఇంధన పొదుపు సామర్థ్యాన్ని అంచనా వేయడం, రోడ్ మ్యాప్ తయారీ, భవిష్యత్తులో ఈ రంగంలో ఆర్థిక సహకారం అదించడంపై తగిన అధ్యయనం చేయాలని టెరీని కోరారు. విద్యుత్ సబ్‌స్టేషన్లలో ఆటోమేషన్ వ్యవస్థ ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇంధన పొదుపు, భద్రతపై టెరీ ప్రతినిధులు, అంతరాయాలు లేకుండా అందుబాటు ధరల్లో విద్యుత్ అందించడంపై పాల్ వివరించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్లో 10 నుంచి 35 శాతం వరకూ విద్యుత్ పొదుపు చేసే వీలు ఉందని టెరీ నిర్వహించిన సర్వేలో తేలిందని పాల్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...కేఎఫ్‌డబ్ల్యు, టెరీ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN