ప్రభుత్వ కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-11 03:25:13

హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై గురువారం నాడు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఇరుపక్షాలు హైకోర్టులో కౌంటర్‌లను దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు, కార్మిక సంఘాల తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. సమ్మె ఎందుకుచేయాల్సి వచ్చిందనే విషయంపై కార్మిక సంఘాలు వివరణ ఇచ్చాయి. సమస్యలు
పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కార్మిక సంఘాల తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ప్రభుత్వం తరఫున సమర్పించిన కౌంటర్ అసంపూర్ణంగా ఉందని, సవరించి సమగ్ర కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించి, తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు ఇరుపక్షాలు కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించాయి. ప్రజలను ఇబ్బంది పట్టాలనే యోచన ఏదీ కార్మికులకు లేదని, తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే సమ్మెబాట పట్టారని కార్మిక సంఘాల తరఫున న్యాయవాది రచనారెడ్డి పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు నెల రోజుల నుండి ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారని, అంతేగాక, గత నెల 3, 24, 26 తేదీల్లో ఆర్టీసీకీ, ప్రభుత్వానికి కూడా ముందస్తు నోటీసులను కూడా ఇచ్చారని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఫండ్స్ 545 కోట్లతో పాటు ఇతర రాయితీలను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించలేదని అన్నారు. అందుకే కార్మికులు సమ్మెకు వెళ్లారని అన్నారు. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తే కార్మికులు వెంటనే సమ్మె విరమిస్తారని రచనారెడ్డి తమ వాదనలను వినిపించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇచ్చిన మాట నిజమేనని, అయితే, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపే సమయం కూడా ఇవ్వలేదని అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు గత నెల 29వ తేదీన ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ ఆధ్వర్యంలో కమిటీని నియమించిందని అన్నారు. కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకముందే కార్మికులు సమ్మెలోకి వెళ్లారని అన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు ఆయన కోర్టుకు తెలిపారు. సెట్విన్ బస్సు సర్వీసులను అదనంగా నడుపుతున్నారని, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేసిందని చెప్పారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN