ప్రైవేట్ మద్యం షాపులకు కౌంట్‌డౌన్

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-27 08:59:55

విజయవాడ, సెప్టెంబర్ 26: సారా దుకాణాలు నుంచి గత కొన్ని దశాబ్దాలుగా మద్యం దుకాణాలు నిర్వహిస్తూ వచ్చిన మద్యం వ్యాపారులు ఇక ఈ రాష్ట్రంలో శాశ్వతంగా ఆ వ్యాపారానికి దూరం కాబోతున్నారు. ప్రస్తుతానికి బార్ అండ్ రెస్టారెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా 4400 మద్యం దుకాణాలు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి కల్లా మూతబడబోతున్నాయి. అయితే వీటిల్లో తొలి ఏడాది 20 శాతం దుకాణాలు అంటే 880 దుకాణాలు శాశ్వతంగా మూతబడుతుండగా మిగిలిన 3520 దుకాణాలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవబోతున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా వచ్చే ఏడాది మరో 20 శాతం తరువాత ఏడాది మళ్లీ 20 శాతం చివరగా మిగిలిన 20 శాతం దుకాణాలు పూర్తిగా మూతబడతాయి. ఆ తర్వాత బార్ అండ్ రెస్టారెంట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ దుకాణాలు రాత్రి 9 గంటల కల్లా మూతబడుతుండగా బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం యథావిథిగా రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అధికారిక పర్మిట్ రూమ్‌లు, దొంగచాటుగా తాగించడం వంటివి ఉందవు. ప్రతి దుకాణంలోను సీసీ కెమెరాలు ఉంటాయి. వాటన్నింటికీ ఎక్సైజ్ ప్రొహిబిషన్ కార్యాలయాలతో అనుసంధానం ఉంటుంది. ఈ మద్యం దుకాణాల్లో దాదాపు 18వేల మందికి తొలి ఏడాది తాత్కాలిక ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇక కృష్ణాజిల్లాలో 344 మద్యం దుకాణాలు ఉండగా మద్యం వ్యాపారులు ముందు చూపుగా 24 దుకాణాలను కొన్ని మాసాల క్రితమే మూసి వేశారు. ఎటూ అర్ధంతరంగా మూసి వేయాల్సి వస్తుందని, పైగా ఏడాది పాటు అద్దెను ముందుగా చెల్లించాల్సి రావటంతో తమ లైసెన్స్‌లను వాపస్ చేయగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఆ 24 దుకాణాలను లాంఛనంగా నిర్వహిస్తున్నది. 20 శాతం దుకాణాలు మూతబడుతుండగా మొత్తం 270 దుకాణాలను ప్రభుత్వం నిర్వహించబోతున్నది. వీటిల్లో 24 దుకాణాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ఇలాఉంటే 30వ తేదీ అర్ధరాత్రికి మద్యం దుకాణాల్లో మిగిలిన మద్యం నిర్వలన్నింటినీ ఎక్సైజ్ శాఖ సీజ్ చేస్తుంది. అయితే వాటి ఖరీదు మాత్రం చెల్లించబోదు. రెండు మాసాల క్రితమే ఈ విషయం చెప్పామని, ఎప్పటికప్పుడు ఆచితూచి సరుకు డెలివరీ తీసుకోవాలని కూడా చెప్పామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దశాబ్దాల తరబడి మద్యం వ్యాపారంలో మునిగి తేలిన కొందరు ధీమాతో గతం మాదిరిగానే సరుకు తీసుకున్నారు. వీరిలో కొందరికి బార్ అండ్ రెస్టారెంట్లు ఉండడంతో దొంగచాటున అక్కడికి తరలించవచ్చనే ధీమాతో ఉన్నారు. అయితే అది పెద్ద నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏ వ్యక్తి వద్ద మూడు బాటిళ్లకు మించి ఉండరాదని చెబుతున్నారు. గతంలో ఆరు బాటిళ్లు వరకు అనుమతి ఉండేది. దీంతో కొందరు వ్యాపారులు ఖరీదైన బ్రాండ్‌లకు భారీగా ఆఫర్లు ప్రకటించి విక్రయిస్తున్నారు. లాభాలు వదలుకోవటమేకాదు కొంత మేర నష్టపోయి ధరను భారీగా తగ్గించి విక్రయిస్తున్నారు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD