ఫ్లాట్ల కన్నా.. స్థలాలే మిన్న

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-18 03:34:01

img

విజయవాడ, అక్టోబర్ 17: పట్టణాల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకన్నా ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అభ్యంతరం లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. రెండు సెంట్ల స్థలం వరకూ నామమాత్రపు రుసుం వసూలు చేయాలన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్టుమెంట్లు కన్నా, ఇళ్ల స్థలాలు కేటాయించి, అందులో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు కేటాయించిన ఫ్లాట్ల నిర్వహణ సరిగా లేదని, దీనివల్ల అపరిశుభ్ర పరిస్థితులు తలెత్తుతున్నాయని, కొంత కాలానికి పాడవుతున్నాయన్నారు. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికి వస్తున్నాయన్నారు. సరైన నిర్వహణ లేనప్పుడు ఫ్లాట్లు ఇచ్చినా ఉపయోగం ఉండదన్నారు. దీనికి పరిష్కారంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాలు ఇచ్చి, అక్కడ ఇళ్లు నిర్మించాలన్నారు. ఇప్పటికే ఉంటున్న ఫ్లాట్లను బాగు చేసేందుకు ఏదైనా ఆలోచన చేయాలని సూచించారు. కాలక్రమంలో పట్టణాల్లో ఎక్కువ సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగిపోయాయన్నారు. అభ్యంతరం లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు విధివిధానాలను రూపొందించాలన్నారు. ఇలా గుర్తించిన వాటిలో రెండు సెంట్ల భూమి వరకూ నామమాత్రపు ఫీజుకే రిజిస్ట్రేషన్ చేయాలని, అంతకుమించితే క్రమబద్ధీకరణకు ఎంత ఫీజు వసూలు చేయాలన్న అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
నదీ తీరాలు, కాల్వ గట్ల వెంబడి ఇళ్లు ఉన్న కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ప్రభుత్వ స్థలాల కేటాయింపులో, ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు లేనివి, అభ్యంతరం లేని ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు. గతంలో పేదలకు స్థలం ఇచ్చినా రిజిస్టర్ చేసేవారు కాదని, తమ ప్రభుత్వం రిజిస్టర్ చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు తన అత్తగారి సొత్తు అన్నట్లుగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను లాక్కున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఒకసారి పేదలకు ఇచ్చిన తరువాత ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణాల కోసం వీలైనంత మేర ప్రభుత్వ భూములనే వినియోగించాలన్నారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటి వరకూ లబ్ధిదారుల సంఖ్య 20.47 లక్షలని తెలిపారు. ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 19,389 ఎకరాలను గుర్తించామని, మరో 8 వేల ఎకరాలు అవసరం అవుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2559 ఎకరాలు అవసరం అవుతుందని, ఇంకా 11 వేల ఎకరాలు, 12 వేల కోట్ల రూపాయల మేర అవసరం అవుతుందని ముఖ్యమంత్రికి వివరించారు.
లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇళ్ల స్థలానికి ఎందుకు అర్హత సాధించలేదన్న విషయం లబ్ధిదారులకు తెలియచేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు వచ్చేలా చర్యలు
తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల జాబితా కింద కొన్ని సూచనలు కూడా ఉంచాలన్నారు. ఎవరైనా అర్హులని భావిస్తే, ఎవరికి ఎలా దరఖాస్తు చేయాలి, ఎలా నమోదు చేయాలి, ఎవరిని సంప్రదించాలన్న వివరాలు ప్రచురించాలన్నారు. జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాటు చేసుకోవాలని, లక్ష్యం కన్నా మరో 10 శాతం ఇళ్ల స్థలాలను అందుబాటులో ఉంచుకుంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా ఇబ్బంది ఉండదన్నారు. ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, రంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... ఇళ్ల పట్టాలు, గృహనిర్మాణంపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN