బంగ్లా క్రికెటర్ షకీబ్‌వై ఐసీసీ వేటు

Newwaves

Newwaves

Author 2019-10-30 00:24:00

img

ఢాకా: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, టెస్ట్, టీ20 కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ రెండేళ్ళ పాటు నిషేధం వేటు వేసింది. దీంతో వచ్చే ఏడాది అక్టోబర్‌ 29 వరకూ షకీబుల్‌ మైదానంలో అడుగుపెట్టడానికి వీలు లేదు. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించారు. అయితే.. ఈ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు దృష్టికి షకీబ్ తీసుకెళ్లలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన షకీబ్ అల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ అతడిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ చర్యల్లో భాగంగా షకీబ్ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. అయితే.. బుకీలు తనను సంప్రదించారనే విషయాన్ని విచారణలో సందర్భంగా అంగీకరించినందుకు ఏడాది సస్పెన్షన్‌ తర్వాత క్రికెట్‌ ఆడే వెసులుబాటును ఐసీసీ కల్పించింది.

2018 జనవరిలో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే ముక్కోణపు టోర్నీ సందర్భంగా షకీబ్‌ను బుకీలు సంప్రదించారు. ఈ విషయాన్ని ఐసీసీకి చెప్పడంలో విఫలమైనందుకు ఆర్టికల్ 2.4.4 ప్రకారం షకీబ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం రెండు అభియోగాలు నమోదు చేసింది. ఆ ఏడాది ఐపీఎల్ సందర్భంలో అదే సంవత్సరం ఏప్రిల్ 26న సన్‌రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాచ్ సందర్భంగా బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ వెల్లడించకపోవడంతో మరో అభియోగం నమోదైంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జరిపిన విచారణలో తన తప్పులను షకీబ్ ఒప్పుకున్నాడు. నిషేధం కారణంగా వచ్చే ఏడాది క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్, ఆస్ట్రీలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు షకీబ్ దూరంగా ఉండి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే.. 2020 అక్టోబర్ 20 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు మాత్రం ఐసీసీ అనుమతి ఇవ్వడం గమనార్హం.

‘నా ఒక్క చిన్న నిర్లక్ష్యం నేను ఎంతగానో ప్రేమించే క్రికెట్‌కు రెండేళ్ల పాటు దూరం చేసింది. నేను చేసింది పొరపాటే. ఆ విషయాన్ని ఐసీసీ ముందు అంగీకరించా. క్లీన్‌ క్రికెట్‌ ఉండాలని కోరుకునే వారిలో నేనూ ఒకడిని. నేను చేసిన తప్పు యువ క్రికెటర్లు చేయొద్దన్ని కోరుతున్నా’ అంటూ షకీబ్ పేర్కొన్నాడు.

షకీబ్‌పై నిషేధం పడిన నేపథ్యంలో టీమిండియా సీరీస్‌ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు మార్పులతో కూడిన జట్టును ప్రకటించే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. డిమాండ్ల సాధనకై క్రికెటర్లు సమ్మెకు దిగడంతో క్రికెట్‌ ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే.. క్రికెటర్ల డిమాండ్లకు బీసీబీ అంగీకరించడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో కీలక టీమిండియా సీరీస్‌కు సన్నద్ధం అవతున్న బంగ్లాకు షకీబ్‌పై నిషేధం ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కొంత కాలంగా బంగ్లాదేశ్‌ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. షకీబ్‌పై నిషేధం ప్రభావం యువ క్రికెటర్లపై ముఖ్యంగా ఆ దేశ క్రికెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందనేది క్రీడా విశ్లేషకులు అభిప్రాయం.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD