బంగ్లా తొలి గెలుపు

Nava Telangana

Nava Telangana

Author 2019-11-04 05:24:58

- మెరిసిన ముష్ఫీకర్‌ రహీమ్‌
- ఢిల్లీ టీ20లో భారత్‌ పరాజయం
- టీ20ల్లో భారత్‌పై బంగ్లాకిదే తొలి విజయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ
బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త విజయం. అగ్ర జట్టు భారత్‌పై బంగ్లాదేశ్‌ ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. ముష్ఫీకర్‌ రహీమ్‌ (60 నాటౌట్‌, 43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్ధ సెంచరీతో చెలరేగాడు. ముష్ఫీకర్‌ మెరుపులకు తోడు సౌమ్య సర్కార్‌ (39, 35 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించాడు. తొలి టీ20లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా 148/6 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (41), రిషబ్‌ పంత్‌ (27), శ్రేయాష్‌ అయ్యర్‌ (22) రాణించారు. సిరీస్‌లో రెండో టీ20 గురువారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.
ముష్ఫీకర్‌ మెరుపులు : 149 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (7)ను కోల్పోయింది. అయినా, ఛేదనలో బంగ్లాదేశ్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. మరో ఓపెనర్‌, అరంగ్రేట ఆటగాడు మహ్మద్‌ నయీం (26, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌తో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించాడు. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాదిన నయీం మరో ఎండ్‌లో సౌమ్య సర్కార్‌కు సహకరించాడు. ప్రమాదకరంగా మారుతున్న నయీంను మణికట్టు స్పిన్నర్‌ చాహల్‌ వెనక్కి పంపాడు. ముష్ఫీకర్‌ రహీంతో జతకట్టిన సౌమ్య సర్కార్‌ (39, 35 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) బంగ్లా ఛేదనను ముందుకు నడిపించాడు. ముష్ఫీకర్‌, సౌమ్య మూడో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. సౌమ్యను ఖలీల్‌ అహ్మద్‌ అవుట్‌ చేయటంతో భారత్‌ రేసులోకి వచ్చింది. మహ్మదుల్లా వేగంగా ఆడలేకపోయినా, ముష్ఫీకర్‌ జోరందుకున్నాడు. ఖలీల్‌ ఓవర్లో వరుస బౌండరీలతో అర్థ సెంచరీ సాధించాడు. 12 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన దశలో ఖలీల్‌ అహ్మద్‌పై ముష్ఫీకర్‌ వరుసగా నాలుగు బౌండరీలతో చెలరేగాడు. ఆరు బంతుల్లో నాలుగు పరుగులకు సమీకరణాన్ని సవరించాడు. దూబెపై సిక్సర్‌తో ముష్ఫీకర్‌ భారత్‌పై బంగ్లాదేశ్‌కు తొలి విజయాన్ని అందించాడు.
బ్యాట్‌తో తడబాటు : టాస్‌ ఓడిన టీమ్‌ ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లిని దాటేసిన రోహిత్‌ శర్మ.. అదే ఓవర్‌ ఆఖరు బంతికి అవుటయ్యాడు. షఫిల్‌కు రోహిత్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (41, 42 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో నిలిచినా ధనాధన్‌ ఆడలేకపోయాడు. 42 బంతుల్లో 41 పరుగులే చేశాడు. ధావన్‌ నెమ్మదైన స్ట్రయిక్‌రేట్‌ ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచింది. కెఎల్‌ రాహుల్‌ (15, 17 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశపరిచాడు. శ్రేయాష్‌ అయ్యర్‌ (22, 13 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) క్రీజులో ఉండగా భారత్‌ మెరుగైన స్కోరు సాధించేలా కనిపించింది. వచ్చీ రాగానే రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదిన శ్రేయాష్‌ అయ్యర్‌ స్కోరు వేగాన్ని పెంచాడు. మరో భారీ షాట్‌కు వెళ్లి క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. యువ ఆటగాడు రిషబ్‌ పంత్‌ (27, 26 బంతుల్లో 3 ఫోర్లు) స్కోరు బోర్డుపై ప్రభావం చూపిస్తాడని ఆశించినా, నిరాశ తప్పలేదు. లోకల్‌ హీరో పంత్‌ క్రీజులో స్వేచ్ఛగా కదలలేదు. మూడు ఫోర్లు బాదినా దూకుడు చూపించలేదు. 26 బంతుల్లో 27 పరుగులు చేసిన పంత్‌ బౌండరీ లైన్‌ వద్ద క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. ఆఖరు రెండు ఓవర్లలో 30 పరుగులు పిండుకున్న కృనాల్‌ పాండ్య (15 నాటౌట్‌, 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), వాషింగ్టన్‌ సుందర్‌ (14 నాటౌట్‌, 5 బంతుల్లో 2 సిక్స్‌లు) భారత్‌కు 148 పరుగుల పోరాడగలిగే స్కోరు అందించారు. వాషింగ్టన్‌ సుందర్‌ రెండు సిక్సర్లు బాదగా.. కృనాల్‌ ఓ ఫోర్‌, సిక్సర్‌తో మెరిశాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన ముంబయి ఆల్‌రౌండర్‌ శివం దూబె (1) నిరాశపరిచాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న దూబె ఒక్క పరుగే చేసి, షఫిల్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షఫిల్‌ ఇస్లాం (2/36), ఆమినుల్‌ ఇస్లాం (2/22) రాణించారు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN