బంగ్లా బోణీ కొట్టింది..

10 TV News Channel

10 TV News Channel

Author 2019-11-04 10:02:33

img

ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టీ20లో బంగ్లాదేశ్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత పర్యటనలో శుభారంభం నమోదుచేసింది. 19.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడు టీ20ల సిరీస్‌లో బోణీ కొట్టింది. షార్ట్ ఫార్మాట్‌లో భారత్‌పై బంగ్లాకు ఇదే తొలి విజయం. తొలి టీ20లో ముస్తాఫిజుర్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన బంగ్లా టీమ్‌.. ఆదిలోనే మొదటి వికెట్ కోల్పోయింది. 

తొలి ఓవర్‌లోనే లిటన్‌ దాస్‌ను దీపక్‌ చాహర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సౌమ్య సర్కార్‌తో కలిసి మహ్మద్‌ నయీమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నయీమ్‌ను చాహల్‌ బోల్తా కొట్టించడంతో వీరిద్దరి 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన ముస్తాఫిజుర్ చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. అవతల ఎండ్‌లో ఉన్న సౌమ్య సర్కార్‌ కూడా సమర్థవంతంగా భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. 

విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు అవసరమవ్వగా సౌమ్యను ఖలీల్ అహ్మద్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో భారత్‌ తిరిగి రేసులోకి వచ్చింది. 18వ ఓవర్‌ వేసిన చాహల్‌ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌ భారీ షాట్ ఆడాడు. కృనాల్‌ దాన్ని అందుకోవడంలో విఫలమయ్యాడు. 19వ ఓవర్ వేసిన ఖలీల్‌ బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. దీంతో బంగ్లాదేశ్‌ విజయం లాంఛనమైంది. దూబే బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా సిక్సర్‌ను బాది మ్యాచ్‌ను ముగించాడు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ అంతగా ఆకట్టుకోలేకపోయారు. బౌండరీతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్‌శర్మ తొలి ఓవర్‌ ఆఖరి బంతికే ఔటయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌ కేఎల్ రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో భారత్ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్‌ అయ్యర్‌... ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. శ్రేయస్‌ దూకుడుగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అమినుల్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన శ్రేయస్‌ నయీమ్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాత పంత్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్న గబ్బర్ రనౌటయ్యాడు. తొలి మ్యాచ్‌ ఆడుతున్న దూబే కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 102 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో టీమ్‌ఇండియా 148 పరుగులు చేయగలిగింది.

తొలి టీ20లో టీమిండియా ఓడిపోయినా... కెప్టెన్‌ రోహిత్‌శర్మ అకౌంట్‌లో మాత్రం మరో రికార్డ్‌ చేరింది. మాజీ కెప్టెన్‌ ధోనీ రికార్డును రోహిత్‌ బద్దలుకొట్టాడు. అత్యధిక టీ20లు ఆడిన ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. 98 టీ20లు ఆడిన ధోనీ ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... రోహిత్‌ 99 మ్యాచ్‌లు ఆడి... ఇప్పుడా రికార్డును బ్రేక్‌ చేశాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD