బాగా ఆడుతుంటే.. యో-యోతో పనేంటి ?
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తిపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ మరోసారి పరోక్షంగా విమర్శనాస్ర్తాలు సంధించాడు. క్రికెటర్‌గా బాగా రాణిస్తుంటే యో-యో టెస్ట్‌తో పనేమిటని ప్రశ్నించాడు. టీమిండియాకు ఎంపికలో యో-యో టెస్ట్‌ను ప్రామాణికం చేయడం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్ర్తి హయాంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేన్సర్ బారినుంచి బయటపడ్డాక క్రికెట్లో పునరాగమనం చేసిన యువరాజ్‌ను యో-యో టెస్ట్ పాస్కాలేదంటూ పలుమార్లు జట్టుకు దూరం పెట్టారు. 2017లో వెస్టిండీస్ టూర్ నుంచి వచ్చాక ఇదే కారణంతో యువీని జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సమయమొచ్చినప్పుడల్లా యో-యో టెస్ట్‌పై అతడు అంసతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాడు. తనను జట్టునుంచి తొలగించిన సమయంలో బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని యువీ వ్యాఖ్యానించాడు.