బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ ముందున్న సవాళ్లు
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ.. తన పదవీకాలంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంది. అటు ఐసీసీతో సమస్యల పరిష్కారం, ఆర్థిక లావాదేవీలు, రాష్ట్ర సంఘాల్లో నెలకొన్న ఇబ్బందులు, లోధా నిబంధనలకు అనుగుణంగా బోర్డును నడపడం, కాన్ఫ్లిక్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ప్రస్తుతం దాదా తక్షణంగా పరిష్కారించాల్సిన సమస్యలేంటో చూద్దాం..!
1 ఐసీసీలో ఇండియా పొజిషన్: గత కొంతకాలంగా బీసీసీఐలో నెలకొన్న స్తబ్దత కారణంగా ఐసీసీలో మన వాయిస్ చాలా వరకు తగ్గిపోయింది. గ్లోబల్ బాడీలో బీసీసీఐ ప్రతినిధి లేడంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థమవుతుంది. మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ తీసుకొచ్చిన బిగ్–3 (ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) మోడల్ రెవెన్యూ షేర్ ప్రకారం ఐసీసీ నుంచి బీసీసీఐకి 570 మిలియన్ డాలర్లు రావాల్సి ఉంది. కానీ ఐసీసీ చైర్మన్ హోదాలో శశాంక్ మనోహర్ దీనికి చెక్ పెట్టాడు. దీంతో 2016–2023 వరకు బీసీసీఐకి కేవలం 293 మిలియన్ డాలర్లు చెల్లించేలా రూల్ తీసుకొచ్చాడు. కానీ గట్టిగా కొట్లాడితే కనీసం 405 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. దీనిని దాదా రాబట్టాల్సి ఉంది.
2 టాక్స్ మినహాయింపు: 2016 వరల్డ్ టీ20, భవిష్యత్‌లో జరగబోయే ఐసీసీ ఈవెంట్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి టాక్స్ మినహాయింపు ఇప్పించాలని ఐసీసీ కోరుతోంది. (బ్రాడ్కాస్టర్లు ఇంపోర్ట్ చేసుకునే టీవీ ప్రొడక్షన్ ఎక్విప్‌మెంట్‌పై కూడా ఇందులో ఉంది). టాక్స్ రిబెట్స్ ఇవ్వకపోతే బీసీసీఐకి ఇవ్వాల్సిన నిధుల్లో కోత వేస్తామని ఐసీసీ హెచ్చరిస్తోంది. అయితే ఫార్ములావన్తో పాటు ఎంటర్టైన్మెంట్కు సంబంధం ఉన్న ఏ ఈవెంట్‌కూ టాక్స్ మినహాయింపు ఇవ్వడం కుదరదని సెంట్రల్ గవర్నమెంట్ చెబుతోంది.
3 డొమెస్టిక్ క్రికెటర్లకు వేతనాలు: ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌కు మ్యాచ్‌కు 1.4 లక్షల ఫీజుతో పాటు డీఏ కింద రూ. 35 వేలు ఇస్తున్నారు. రాష్ట్రాలను బట్టి ఇందులో తేడాలున్నా.. టీవీ రైట్స్ నుంచి వచ్చే బోర్డు గ్రాస్ రెవెన్యూలో 13 శాతం కలుపుకుని సీజన్‌కు ఓ క్రికెటర్ కనీసంగా 25 లక్షలు సంపాదిస్తున్నా ఇంటర్నేషనల్ ప్లేయర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజును 2.5 లక్షలకు పెంచి.. బోర్డు గ్రాస్ రెవెన్యూ శాతాన్ని కూడా భారీగా పెంచాలని దాదా ఆలోచన.
4 డొమెస్టిక్ టోర్నీల స్ట్రక్చర్ మార్పు: దేశవాళీ క్రికెటర్లను మెరికల్లా తయారు చేసేందుకు టోర్నీల రూపు రేఖలు మార్చాలనే ఆలోచన కూడా ఉంది. దేవధర్ ట్రోఫీలాంటి టోర్నీల సంఖ్య పెంచడం, అంపైరింగ్ ప్రమాణాలు మెరుగుపర్చడం, అంపైర్ల కోసం ఎక్కువగా ఎగ్జామ్స్, ఫస్ట్‌క్లాస్ వేదికల్లో నాణ్యమైన పిచ్‌లను రూపొందించడం ద్వారా డొమెస్టిక్ టోర్నీలను మరింత కఠినం చేయాలని భావిస్తున్నారు.
5 డేనైట్ టెస్ట్‌లు: 2016 దులీప్ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా నిర్వహించినా.. పింక్ బాల్‌పై స్పిన్నర్లు చాలా ఫిర్యాదులు చేశారు. బాల్ క్వాలిటి లేదని, ఎక్కువగా స్వింగ్ అవుతుందని చెప్పారు. లేట్‌నైట్‌లో బంతి సరిగా కనబడటం లేదని బ్యాట్స్‌మెన్ ఆందోళన చేశారు. ఇక అప్పట్నించి డేనైట్ టెస్ట్‌ల వైపు బీసీసీఐ కన్నెత్తి చూడలేదు. కానీ ఇప్పుడు దాదా వీటికి అనుకూలమని ప్రకటించాడు. అయితే నాణ్యమైన ఎస్జీ పింక్ బాల్స్‌ను తయారు చేసేవారితోనే అసలు సమస్య ఎదురవుతోంది. ఈ టర్మ్‌లో గంగూలీ దీనిని అమలు చేయకపోయినా.. కనీసం రంజీల వరకైనా అప్‌గ్రేడ్ చేస్తే బాగుంటుంది.
6 కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్: ఒక వ్యక్తికి ఒకే పదవి.. ప్రస్తుతం ఇండియన్ మాజీ క్రికెటర్లను వేధిస్తున్న కాన్ఫ్లిక్ట్ సమస్యకు దాదా ఎలాంటి పరిష్కారం తీసుకొస్తాడో చూడాలి. సలహాదారుల కమిటీ, సెలెక్షన్ ప్యానెల్, ఇతరత్రా బాడీల్లో మాజీల సేవలు వినియోగించుకోవాలంటే ఈ రూల్ ఉండకూడదు.