బుమ్రా ఔట్... ఉమేష్ ఇన్..
న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. గాయం కారణంగా బుమ్రా జట్టుకు దూరం కాగా అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బిసిసిఐ మంగళవారం ప్రకటించింది. కాగా ఉమేశ్ యాదవ్ 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో చివరిసారిగా మైదానంలోకి దిగాడు. ఇక ఇటీవల జరిగిన టీమిండియా వెస్టిండీస్ టూర్లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండు టెస్టు మ్యాచుల్లో మొత్తంగా 13 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఈ పేసర్.. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మూడో భారతీయ బౌలర్‌గా నిలిచాడు. కాగా గురువారం నుంచి విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విసిఏ-ఎడిసిఏ స్టేడియంలో దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ మధ్య మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రాక్టీస్ మ్యాచ్ అనంతరం టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.