బెయిలీ స్టైలే వేరు!

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-04 03:01:55

img

హోబర్ట్, నవంబర్ 3: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ జార్జి బెయిలీ స్టైలే వేరు. మైదానంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులను వివిధ రకాలుగా వేధించే బెయిలీ తాజాగా విచిత్రమైన బ్యాటింగ్ పొజిషన్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. షీఫీల్డ్ షీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా విక్టోరియాతో ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్మానియా తరఫున ఆడుతున్న బెయిలీ 25వ ఓవర్‌లో విచిత్రమైన భంగిమ ప్రదర్శించి, ఇటు ఫీల్డర్లను, అటు ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేశాడు. క్రిస్ ట్రెమెయిన్ బౌలింగ్ చేయడానికి రనప్ ప్రారంభించిన వెంటనే, క్రీజ్‌లో అతను హఠాత్తుగా వికెట్‌కీపర్‌కు అభిముఖంగా నిల్చున్నాడు. అయితే, తల వెనక్కుపెట్టి, భుజం పైనుంచి మాత్రం బౌలర్‌ను చూస్తూ బ్యాటింగ్‌కు ఉపక్రమించాడు. దీనితో బంతిని వేయాలా? లేదా? అన్న అనుమానంతో ట్రెమెయిన్ గందరగోళానికి గురయ్యాడు. చివరికి అతను బంతిని వేసే క్షణం ముందు బెయిలీ సరైన పొజిషన్‌కు వచ్చాడు. మొత్తం మీద ఈ బ్యాటింగ్ పొజిషన్ అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. 2016 తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశాన్ని దక్కించుకోలేకపోయిన 37 ఏళ్ల బెయిలీ దేశవాళీ పోటీల్లో ఇంకా కొనసాగుతున్నాడు. కెరీర్‌లో అతను ఐదు టెస్టులు, 90 వనే్డ ఇంటర్నేషనల్స్, 30 టీ-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. వనే్డల్లో 40.58 సగటుతో 3,044 పరుగులు సాధించాడు. ఈ పార్మాట్‌లో అతని అత్యధిక స్కోరు 156 పరుగులు. ఆస్ట్రేలియా టీ-20 జట్టుకు కెప్టెన్‌గా, వనే్డ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా అతను సేవలు అందించాడు. టీ-20 ఫార్మాట్‌లో డామెరాన్ వైట్ వైదొలగిన తర్వాత, కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడిన బెయిలీ ఆసీస్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. ఈ విధంగా ఏదైనా ఒక ఫార్మాట్‌లో, తన కెరీర్ తొలి మ్యాచ్‌లోనే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అంతకు ముందు డేవ్ గ్రెగరీ కూడా ఈ ఫీట్‌ను సాధించాడు.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD