భారత్‌తో సిరీస్ బంగ్లాకు సవాలే!

Mana Telangana

Mana Telangana

Author 2019-10-31 03:06:57

img

క్రీడా విభాగం : సౌతాఫ్రికా, వెస్టిండీస్ వంటి పెద్ద జట్లే భారత్‌కు కనీస పోటీ ఇవ్వడంలో విఫలమైన నేపథ్యంలో టీమిండియాతో త్వరలో జరిగే ట్వంటీ20, టెస్టు సిరీస్ బంగ్లాదేశ్‌కు సవాలు వంటిదేనని చెప్పాలి. అంతేగాక సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్‌కు కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. ఐసిసి నిషేధం విధించడంతో స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ షకిబ్ అల్ హసన్ భారత పర్యటనకు దూరమయ్యాడు. ఈ లోటును పూడ్చడం బంగ్లాకు శక్తికి మించిన పనిగా చెప్పక తప్పదు. ప్రపంచంలోనే షకిబ్ అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ అనడంలో సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా ఫలితాన్ని తారుమారు చేసే సత్తా షకిబ్ సొంతం. అటువంటి స్టార్ ఆటగాడి సేవలు కోల్పోవడం బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్‌గా తయారైంది.

అంతేగాక కొంతకాలంగా బంగ్లాదేశ్ పేలవమైన ఆటతో సతమతమవుతోంది. వరుస ఓటములతో జట్టు ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. దీనికి తోడు ఇటీవలే సమస్యల సాధన కోసం జట్టు సభ్యులు సమ్మెకు దిగారు. దీంతో ఇటు బోర్డుకు, అటు ఆటగాళ్లకు మధ్య సయోధ్య కొరవడింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత పర్యటనలో ఆటగాళ్లు ఎలా ఆడుతారో అంతుబట్టకుండా మారింది. గతంతో పోల్చితే ప్రస్తుతం బంగ్లాదేశ్ బలహీనంగా కనిపిస్తోంది. పసికూనగా పరిగణించే అఫ్గానిస్థాన్ కంటే కూడా బంగ్లాదేశ్ ఆట తీసికట్టుగా తయారైంది.

జట్టులో ఆత్మవిశ్వాసం లోపించినట్టు కనిపిస్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. బోర్డుకానీ, ప్రధాన కోచ్‌గానీ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడం లేదనే చెప్పొచ్చు. ఒకప్పుడూ ఎంతటి పెద్ద జట్టుకైనా ముచ్చెమటలు పట్టించిన ఘనత బంగ్లా సొంతం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరికల్లాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ ఆట మరి అధ్వాన్నంగా తయారైంది. సొంత గడ్డపై సయితం రాణించలేక పోతోంది.

img

అంత సులువుకాదు
ఇక, భారత్ వంటి అగ్రశ్రేణి జట్టుతో సమరం బంగ్లాదేశ్‌కు అగ్ని పరీక్షగా మారిందని చెప్పాలి. గతంతో పోల్చితే ప్రస్తుతం బంగ్లాదేశ్ బలహీనంగా కనిపిస్తోంది. మరోవైపు టీమిండియా వరుస విజయాలతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. సిరీస్ ఏదైనా విజయం సాధిస్తూ తన ఆధిపత్యాన్ని చాటుతోంది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో క్లీన్‌స్వీప్ సాధించింది. అంతేగాక వెస్టిండీస్‌ను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించింది. వరుస విజయాలు కోహ్లి సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఫార్మాట్ ఏదైనా భారత్‌కు విజయం నల్లేరుపై నడకగా మారింది.

మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో కూడా భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి టి20 సిరీస్‌కు దూరమైనా భారత్‌కు వచ్చే నష్టమేమి లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో జరిగే సిరీస్ బంగ్లాదేశ్‌కు సవాలుగా తయారైంది. కనీస పోటీ కూడా ఇస్తుందా లేదా అనేది సందేహమే. దీనికి తోడు దిగ్గజ ఆల్‌రౌండర్ షకిబ్ దూరం కావడం బంగ్లాను మరింత బలహీనంగా మార్చింది. దీంతో ఈ సిరీస్ ఏకపక్షంగా సాగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD