భారత్‌ ఆల్‌రౌండ్‌ షో

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-02 04:40:13

img

  • దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కైవసం
  • నాలుగో మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌సేన గెలుపు
  • రాణించిన షెఫాలి, జెమీమా

సూరత్‌: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సను భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన నిర్ణయాత్మక నాలుగో టీ20లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత్‌ 51 పరుగులతో గెలిచింది. తొలి టీ20లో భారత్‌ నెగ్గగా, రెండోది, మూడో మ్యాచ్‌ వర్షంతో రద్దయ్యాయి. కాగా, నాలుగో టీ20కి కూడా వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. తొలుత భారత్‌ నిర్ణీత 17 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఛేదనలో దక్షిణాఫ్రికా 17 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 89 పరుగులే చేసి పరాజయం పాలైంది. భారత యువ బ్యాట్స్‌వుమన్‌ షెఫాలీ వర్మ (33 బంతుల్లో 46), స్టార్‌ హిట్టర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (33) బ్యాట్‌తో మెరవగా స్పిన్నర్లు పూనమ్‌ యాదవ్‌ (3/13), రాధా యాదవ్‌ (2/16) సౌతాఫ్రికా బ్యాట్స్‌వుమెన్‌ను ముప్పుతిప్పులు పెట్టారు.

ఆకట్టుకున్న షెఫాలి: అరంగేట్రం మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచిన షెఫాలి తన రెండో మ్యాచ్‌లో ఆకట్టుకుంది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఈ 15 ఏళ్ల యువ బ్యాట్స్‌వుమన్‌ తొలి ఓవర్‌ నుంచే ఎదురుదాడికి దిగింది. మరోవైపు నిరాశపరిచిన మంధాన (13) తనకు రెండుసార్లు లైఫ్‌ లభిం చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక.. షెఫాలి అర్ధసెంచరీ దిశగా సాగుతుండగా సెఖుఖునే ఆమెను క్లీన్‌బౌల్డ్‌ చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (16) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన దీప్తి శర్మ (20).. జెమీమాకు సహకారం అందించింది.

స్పిన్నర్లు తిప్పేశారు: దక్షిణాఫ్రికా స్పిన్‌ బలహీనతను భారత స్పిన్నర్లు సొమ్ము చేసుకున్నారు. ఆఫ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/13), లెగ్‌ స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (2/16) దెబ్బకు పర్యాటక జట్టు బ్యాట్స్‌వుమెన్‌ క్రీజులో కుదురుకోవడానికి అవకాశం లభించలేదు. 23 రన్స్‌ చేసిన వన్‌డౌన్‌ బ్యాట్స్‌వుమన్‌ లారా వోల్వార్ట్‌నే టాప్‌ స్కోరర్‌. మిగిలిన వారిలో ఓపెనర్‌ బ్రిట్స్‌ (20) మినహా అందరూ సింగిల్‌ డిజిట్‌కే పెవిలియన్‌ చేరడంతో దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో పాటు సిరీ్‌సను కూడా కోల్పోయింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ పూనమ్‌కు దక్కింది. నామమాత్రమైన చివరి, ఐదో టీ20 శుక్రవారం జరగనుంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN