మంచే ప్రధాన సమస్య

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-11-01 03:29:00

-డే అండ్ నైట్ టెస్టు ఆలోచన మంచిదే
img
న్యూఢిల్లీ: డే అండ్ నైట్ టెస్టును నిర్వహించాలన్న బీసీసీఐ నిర్ణయం మంచిదేనని, దేశ క్రికెట్‌లో ఇదో ముందడుగు అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. అయితే, కోల్‌కతాలో ఈనెల 22 నుంచి బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా ఆడే తొలి డే అండ్ నైట్ మ్యాచ్‌కు మంచు సమస్యగా మారే అవకాశం ఉందని చెప్పాడు. మంచు ప్రభావాన్ని సమర్థవంతంగా తగ్గించగలిగితే తొలి డే అండ్ నైట్ టెస్టు పూర్తిగా విజయవంతమైనట్టేనని గురువారం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మంచు తీవ్ర ప్రభావం చూపనంత వరకు బాగానే ఉంటుంది. హిమం ఎక్కువగా కురిస్తే పేసర్లతో పాటు స్పిన్నర్లకు సవాల్‌గానే మారుతుంది. బంతి తడిగా మారితే వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. మంచు ప్రభావం ఎక్కువగా లేకపోతే డే అండ్ నైట్ టెస్టు మరింత సఫలీకృతమవుతుంది. మంచు ప్రభావం ఎంతుందో ముందే అంచనా వేసి ప్రకటించాలి. అప్పుడే రెండు జట్లు అందుకు తగ్గట్టు సిద్ధమవుతాయి అని మాస్టర్ బ్లాస్టర్ అభిప్రాయపడ్డాడు.

సన్నద్ధత ముఖ్యం

సంప్రదాయ ఫార్మాట్‌కు అభిమానులను రప్పించేందుకు డే అండ్ నైట్ టెస్టు ఉపకరిస్తుందని, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ నిర్ణయాన్ని సచిన్ సమర్థించాడు. పగలు పనులు పూర్తయ్యక మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులకు వీలుంటుంది. సాయంత్రాలు పోటీలకు వచ్చి ఎంజాయ్ చేస్తారు అని టెండూల్కర్ చెప్పాడు. టెస్టుల్లో వాడే ఎర్ర బంతుల్లా కాకుండా పింక్ బంతి ఎలా ప్రవర్తిస్తున్నదో గుర్తించడం ఆటగాళ్లకు ఎంతో ముఖ్యమని సూచించాడు. కొత్త గులాబీ బంతితో పాటు 20, 50, 80 ఓవర్ల పాత బంతులతోనూ ప్రాక్టీసు చేయాలి. ఏ దశలో ఎలా ప్రవర్తిస్తుందో నిశితంగా గమనించి, సన్నద్ధమవ్వాలి. దులీప్ ట్రోఫీలో పింక్‌బాల్‌తో డే అండ్ నైట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల అనుభవాలను, ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి అని టీమ్‌ఇండియాకు మాస్టర్ సూచించాడు.

పచ్చికతో స్పిన్నర్లకూ మేలు

పిచ్‌పై కనీసం 8 మిల్లీమీటర్ల పచ్చిక ఉండడం పేసర్లకే కాకుండా స్పిన్నర్లకు కూడా సహకరిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా కీలక పాత్ర పోషించాలని, పిచ్‌పై బౌలర్లకు అతడే సూచనలు చేయాలని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు. ఎస్‌జీ సంస్థ నాణ్యతతో కూడిన పింక్‌బాల్స్ తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. వచ్చే 22 నుంచి 26 మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా టీమ్‌ఇండియా తన తొలి డే అండ్ నైట్ టెస్టును బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD