మయాంక్‌ మళ్లీ మెరిశాడు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-11 06:49:45

img

దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ తొలిరోజు భారత్‌దే పైచేయి అయింది..మొదటి టెస్ట్‌లో రెండు సెంచరీలు బాదిన రోహిత్‌ శర్మ ఆరంభంలోనే అవుటైనా, ‘విశాఖ’ డబుల్‌ సెంచరీ హీరో మయాంక్‌ అగర్వాల్‌ తన అద్భుత ఫామ్‌ కొనసాగించాడు..మరో శతకంతో మెరిశాడు..అతడికి పుజార తోడవడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ కుదురుకుంది..వీరిద్దరి నిష్క్రమణ తర్వాత కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె సౌతాఫ్రికా బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు..అయితే వెలుతురు సరిగా లేకపోవడంతో తొలి రోజు ఆటను నిర్ణీత సమయానికంటే ముందే ఆపివేశారు..

  • పుజార, కోహ్లీ హాఫ్‌ సెంచరీలు
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 273/3

పుణె: మయాంక్‌ అగర్వాల్‌ అదరహో అనిపించాడు. విశాఖపట్నంలో ద్విశతకంతో సత్తా చాటిన అతడు తనకు అచ్చొచ్చిన పుణె పిచ్‌పై రెచ్చిపోయాడు. మయాంక్‌ సూపర్‌ సెంచరీ (195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108)కి కోహ్లీ (105 బంతుల్లో 10 ఫోర్లతో 63 నాటౌట్‌), పుజార (112 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 58), అర్ధ సెంచరీలు తోడయ్యాయి. ఫలితంగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌ మొదటి రోజు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 273 పరుగులు చేసింది. రబాడ (3/48) మూడు వికెట్లు పడగొట్టాడు.

9వసారి నిరాశ..: ఆసియా ఉపఖండంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసి వరుసగా తొమ్మిదోసారి టాస్‌ కోల్పోయాడు. అయితే, విశాఖ టెస్ట్‌లో మాదిరి కాకుండా ఈసారి అతడి మోములో కాసింత సంతోషం కనిపించింది. కారణం విశాఖపట్నం పిచ్‌కంటే ఇక్కడి వికెట్‌ పొడిగా ఉండడంతోపాటు ఎక్కువగా బౌన్స్‌ కానుండడంతో టాస్‌ ఓడిపోవడం మంచిదేనని డుప్లెసి భావించడం. అందుకే ఒక స్పిన్నర్‌ను పక్కనబెట్టి మరో పేసర్‌ నోర్చ్‌కు మొదటి టెస్ట్‌ అవకాశం కల్పించింది.

నిరాశ పరిచిన రోహిత్‌..: బౌన్స్‌కు అనుకూలించిన పిచ్‌పై తొలి గంట సౌతాఫ్రికాదే అయింది. రబాడ, ఫిలాండర్‌ అద్భుతమైన బంతులతో రోహిత్‌, మయాంక్‌ను పదేపదే బీట్‌ చేశారు. దీంతో బ్యాటు అంచును తాకుతూ పలు బంతులు స్లిప్‌లలోకి వెళ్లాయి. అలాగే భారత ఓపెనర్ల హుక్‌ షాట్లు ఫీల్డర్లకు కొంచెం దూరంలో పడడంతోపాటు క్యాచ్‌లు మిస్సయ్యాయి. ఇంకా ఐదో ఓవర్లో ఫిలాండర్‌ ఎల్బీ అప్పీలు నుంచి అగర్వాల్‌ ‘అంపైర్‌ కాల్‌’తో బయటపడడంతో సౌతాఫ్రికా జట్టు తీవ్ర అసహనానికి లోనైంది. అయితే పదో ఓవర్లో రోహిత్‌ను అవుట్‌ చేయడం ద్వారా తొలి ఫలితం సాధించింది. మిడిల్‌, ఆఫ్‌ స్టంప్‌ మీదుగా రబాడ వేసిన బంతి అనూహ్యంగా లోపలకు దూసుకొచ్చి రోహిత్‌ (14) బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్‌ డికాక్‌ చేతుల్లోకి వెళ్లింది.

గేరుమార్చిన అగర్వాల్‌..: అప్పటిదాకా ఆచితూచి ఆడిన మయాంక్‌..రోహిత్‌ నిష్క్రమణ తర్వాత గేరు మార్చాడు. పేసర్‌ నోర్చ్‌, స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని వరుస ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. ముఖ్యంగా నోర్చ్‌ పదేపదే షార్ట్‌ బంతులతో భయపెట్టినా అగర్వాల్‌ వెరవకుండా అతడి 31 బంతుల్లో 39 పరుగులు చేయడం విశేషం. మరోవైపు ఆరంభంలోనే బవుమా క్యాచ్‌ వదిలేయడంతో బయటపడ్డ పుజార..13వ బంతికి కానీ ఖాతా తెరవలేకపోయాడు. లంచ్‌ విరామానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. విరామం తర్వాత అగర్వాల్‌ మరింత రెచ్చిపోయాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో 40ల్లోకి అడుగుపెట్టిన మయాంక్‌..అతడి బౌలింగ్‌లోనే చక్కటి స్క్వేర్‌ కట్‌తో బౌండరీ ద్వారా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మహరాజ్‌ బౌలింగ్‌లోనే ఫోర్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన పుజార..కొద్దిసేపటికి రబాడ బౌలింగ్‌లో క్యాచౌటయ్యాడు. దాంతో రెండో వికెట్‌ 138 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. టీ సమయానికి భారత్‌ 138/2 స్కోరు చేసింది.

మరింత దూకుడు..: టీ విరామ తర్వాత తిరిగి బ్యాట్‌ ఝళిపించిన మయాంక్‌..మహరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండుసిక్సర్లు బాది 99లోకి ప్రవేశించాడు. ఆపై ఫిలాండర్‌ బౌలింగ్‌లో ఫోర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. అయితే రబాడా మరోసారి విజృంభించి అగర్వాల్‌ను అవుట్‌ చేశాడు. ఇక ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన విరాట్‌..27 రన్స్‌ చేసేందుకు 73 బంతులు తీసుకున్నాడు. అనంతరం బ్యాట్‌కు పని చెప్పిన అతడు తర్వాత 19 బంతుల్లో 26 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 23వ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ..రహానె (18 బ్యాటింగ్‌)తో కలిసి నాలుగో వికెట్‌కు అభేద్యంగా 75 పరుగులు జత చేశాడు. అయితే వెలుతురు సరిగా లేకపోవడంతో గురువారం ఆటను 4.5 ఓవర్ల ముందే నిలిపివేశారు.

అచ్చొచ్చిన పుణె

మయాంక్‌ అగర్వాల్‌కు పుణె ఎంతో అచ్చివచ్చింది. కర్ణాటకలో జట్టులో స్థానం కోల్పోయే దశలో ఆ టీమ్‌ నాటి కెప్టెన్‌ వినయ్‌ కుమార్‌ ప్రోత్సాహంతో చోటు నిలబెట్టుకొన్న అగర్వాల్‌..మహారాష్ట్రపై రంజీ మ్యాచ్‌లో పుణెలోనే ట్రిపుల్‌ సెంచరీ (304)తో ఔరా అనిపించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడని మయాంక్‌..జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. విశాఖలో డబుల్‌ సెంచరీ (215) చేసిన అతడు.. ఇప్పుడు పుణెలో సెంచరీ సాధించడం విశేషం.

విహారికి బదులు ఉమేష్‌

ఈ టెస్ట్‌కు టీమిండియా ఒక మార్పు చేసింది. పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాతో తెలుగు ఆటగాడు హనుమ విహారికి బదులు పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ను తీసుకున్నారు. ఇక స్పిన్నర్‌ పీట్‌ స్థానంలో నోర్చ్‌కు సౌతాఫ్రికా స్థానం కల్పించింది.

బలంగా తాకిన బంతి

11వ ఓవర్లో దాదాపు 142 కి.మీ. వేగంతో దూసుకొచ్చిన నోర్చ్‌ షార్ట్‌పిచ్‌ బంతి అగర్వాల్‌ హెల్మెట్‌ను బలంగా తాకింది. దాంతో మైదానంలోని ఆటగాళ్లతోపాటు పెవిలియన్‌లోని భారత జట్టు తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే, అగర్వాల్‌కు ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రొటోకాల్‌ ప్రకారం భారత ఫిజియో వచ్చి మయాంక్‌ను పరీక్షించాడు. ‘కంకషన్‌’ అవసరమేమోనని భావించారు. కానీ ఆ అవసరం లేకపోయింది. ఆ తదుపరి బంతిని మయాంక్‌ బౌండరీగా మలిచాడు.

స్వదేశంలో వరుసగా రెండు టెస్ట్‌ల్లో సెంచరీలు సాధించిన మూడో భారత బ్యాట్స్‌మన్‌ మయాంక్‌

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (సి) డుప్లెసి (బి) రబాడ 108, రోహిత్‌ శర్మ (సి) డికాక్‌ (బి) రబాడ 14, పుజార (సి) డుప్లెసి (బి) రబాడ 58, కోహ్లీ (బ్యాటింగ్‌) 63, రహానె (బ్యాటింగ్‌) 18, ఎక్స్‌ట్రాలు 12 (మొత్తం 85.1 ఓవర్లలో) 273/3

వికెట్లపతనం : 1/25, 2/163, 3/198 బౌలింగ్‌: ఫిలాండర్‌ 17-5-37-0, రబాడ 18.1-2-48-3, నోర్చ్‌ 13-3-60-0, కేశవ్‌ మహరాజ్‌ 29-8-89-0, ముత్తుసామి 6-1-22-0, ఎల్గర్‌ 2-0-11-0

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN