మయాంక్‌ మళ్లీ శతక్కొట్టాడు

Nava Telangana

Nava Telangana

Author 2019-10-11 04:57:17

-విరాట్‌, పుజార అర్ధ సెంచరీలు
-తొలి రోజు భారత్‌ ఆధిపత్యం
-భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 273/3
-దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు తొలి రోజు
మయాంక్‌ అగర్వాల్‌ (108, 195 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) మళ్లీ మెరిశాడు. స్వదేశీ టెస్టులో వరుసగా రెండో సెంచరీ నమోదు చేశాడు. విశాఖలో కెరీర్‌ తొలి శతకాన్ని డబుల్‌గా మలిచిన కర్నాటక స్టార్‌ బ్యాట్స్‌మన్‌.. పుణెలోనూ అదే జోరు కొనసాగిం చాడు. 16 ఫోర్లు, 2 సిక్సర్లతో సఫారీ బౌలింగ్‌ బృందంపై మరోసారి విరుచుకుప డ్డాడు. వరుస సెంచరీతో రెండో టెస్టు తొలి రోజు భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు!. మయాంక్‌ అగర్వాల్‌ శతకానికి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (63 బ్యాటింగ్‌, 105 బంతుల్లో 10 ఫోర్లు), చతేశ్వర పుజార (58, 112 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 273/3తో కొనసాగుతోంది. వెలుతురు సమస్యతో మరో 4.5 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. కెప్టెన్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (18 బ్యాటింగ్‌) అజేయంగా క్రీజులో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికా సీమర్‌ కగిసో రబాడ (3/48) మూడు వికెట్లు పడగొట్టి సఫారీ శిబిరంలో ఊరట కలిగించాడు. నేడు రెండో రోజు ఆటలో భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను నిలువరించటంపై దక్షిణాఫ్రికా ఫ్రీడం సిరీస్‌ ఆశలు ఆధారపడి ఉంటాయి. స్పిన్‌ అనుకూల పుణె పిచ్‌పై 500 పైచిలుకు పరుగులు చేస్తే, సఫారీ పీకల్లోతు ఒత్తిడిలో కూరుకునే అవకాశం ఉంది. కొత్త బంతి అందుబాటులో ఉండటంతో దక్షిణాఫ్రికా నమ్మకంగా నేడు బరిలోకి దిగనుంది. కోహ్లి, రహానె, సాహా, అశ్విన్‌, జడేజాలు ఉండటంతో భారత్‌ భారీ స్కోరుపై కన్నే సింది.
సఫారీ సీమర్ల దూకుడు : టాస్‌ నెగ్గిన భారత్‌, తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఉద యం పిచ్‌పై తేమ ఉండటంతో సఫారీ సీమర్లు కొత్త బంతిని గొప్పగా వాడుకున్నారు. సీమర్లు కగిసో రబాడ, వెర్నన్‌ ఫిలాండర్‌లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బంతులు విసిరారు. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌తో ఓపెనర్లు తొలి గంట పరుగులకు ఇబ్బంది పడ్డారు. ఓపెనర్‌గా తొలి రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాల మోత మోగించిన రోహిత్‌ శర్మ.. మూడో ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. రబాడ, ఫిలాండర్‌లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టే కనిపించిన రోహిత్‌ శర్మ వికెట్ల వెనకాల క్యాచ్‌ ఇచ్చుకున్నాడు. వరుస శతకాల వీరుడి కథ 14 పరుగుల వద్దే ముగిసింది. మూడో స్థానంలో వచ్చిన చతేశ్వర పుజార (0)కు ఆరంభంలో జీవనదానం లభించింది. క్లిష్టమైన క్యాచ్‌ అయినా, పరుగుల ఖాతా తెరవక ముందే పుజారకు స్లిప్స్‌లో అవుటయ్యే ప్రమాదం తప్పింది. సఫారీ సీమర్ల దూకుడుతో తొలి సెషన్‌ను భారత్‌ 77/1తో ముగించింది. మాయంక్‌ అగర్వాల్‌ (34), పుజార (19) పరుగులతో ఉన్నారు.
శతక భాగస్వామ్యం : ఆరంభంలో ఇబ్బంది పడినా క్రీజులో కుదురుకున్న మయాంక్‌ అగర్వాల్‌, పుజార రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యంతో చెలరేగారు. పుజార, మయాంక్‌ రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించారు. అగర్వాల్‌ లంచ్‌ తర్వాత జోరు పెంచాడు. మరో ఎండ్‌లో పుజార సైతం వేగంగానే ఆడేందుకు ప్రయత్నించాడు. పది ఫోర్ల సాయంతో 112 బంతుల్లో సెంచరీ సాధించిన మయాంక్‌ అగర్వాల్‌.. మరో 50 కోసం ఎక్కువ సేపు ఆగలేదు. మరో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 183 బంతుల్లోనే కెరీర్‌ రెండో శతకాన్ని సాధించాడు. పుజార 107 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. సపారీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన పుజార.. స్లిప్స్‌లో క్యాచ్‌ను మంచి ఇన్నింగ్స్‌ను మధ్యలోనే ముగించాడు. విశాఖ శతకాన్ని డబుల్‌గా మలిచిన మయాంక్‌.. పుణెలో సెంచరీతోనే సరిపెట్టుకున్నాడు. 108 పరుగుల వద్ద స్లిప్స్‌లో క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మయాంక్‌ నిష్క్రమణ సమయానికి భారత్‌ 198/2తో నిలిచింది.
వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (18 బ్యాటింగ్‌, 70 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజులో అసౌకర్యవంతంగా కనిపించాడు. బౌలర్లు రహానెను తరచుగా ఇబ్బందికి గురి చేశారు. పరుగుల వేటలోనూ రహానె వెనుకంజ వేశాడు. ఈ సమయంలో కెప్టెన్‌ కోహ్లి జోరు పెంచాడు. పది ఫోర్లు కొట్టిన విరాట్‌ 91 బంతుల్లో కెరీర్‌ 23వ టెస్టు అర్ధ సెంచరీ బాదాడు. కోహ్లి, రహానె నాల్గో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు భారత్‌ 273/3 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానె, కోహ్లి మరో వికెట్‌ పడకుండా ఆడారు. నేడు కోహ్లి, రహానె ఇన్నింగ్స్‌లపైనే భారత్‌ భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్యాయి.

వరుస సెంచరీల పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇది మంచి భావన. పుణెలో జట్టు మంచి స్థానంలో కొనసాగుతుంది. ఓ సమయంలో పరుగులు అంత సులువుగా రాలేదు. సఫారీ సీమర్లు మంచి స్పెల్స్‌ వేశారు. టెస్టుల్లో రాణించటం ఎల్లప్పుడూ మానసిక క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుంది. పిచ్‌పై తేమతో ఫిలాండర్‌, రబాడ ఇబ్బంది పెట్టారు. చెత్త బంతుల కోసం ఎదురుచూసి ఆడాను. 450-500 స్కోరుతో దక్షిణాఫ్రికాను ఒత్తిడిలో పెట్టవచ్చు. నిజానికి ఆ స్కోరుతో భారత్‌ మరోసారి బ్యాట్‌ పట్టాల్సిన అవసరం ఉండదు'
- మయాంక్‌ అగర్వాల్‌

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 108, రోహిత్‌ శర్మ (సి) క్వింటన్‌ డికాక్‌ (బి) రబాడ 14, చతేశ్వర పుజార (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 58, విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ 63, అజింక్య రహానె బ్యాటింగ్‌ 18, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (85.1 ఓవర్లలో 3 వికెట్లకు) 273.
వికెట్ల పతనం : 1-25, 2-163, 3-198.
బౌలింగ్‌ : వెర్నన్‌ ఫిలాండర్‌ 17-5-37-0, కగిసో రబాడ 18.1-2-48-3, అష్లె 13-3-60-0, కేశవ్‌ మహరాజ్‌ 29-8-89-0, సెనురన్‌ ముతుసామి 6-1-22-0, డీన్‌ ఎల్గార్‌ 2-0-11-0.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN