మయాంక్ సెంచరీ: ఫస్ట్‌డే భారత్ 273/3

Newwaves

Newwaves

Author 2019-10-11 03:56:00

img

పుణె: పర్యాటక దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ మొదటిరోజు ఆటలో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్ బ్రహ్మాండమైన శతకంతో చెలరేగిపోయాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నయా వాల్ ఛటేశ్వర్ పుజారా (58) చెరో అర్థ శతకం చేశారు. రెండో టెస్టును భారత్ ఆధిపత్యం దిశగా సాగుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. దీంతో విశాఖ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టెస్టులో కూడా అదరగొట్టే ఆరంభాన్ని చేసింది. మరో పక్కన పర్యాటక జట్టు పేస్ బౌలర్ రబాడ 48 పరుగులిచ్చి 3 వికెట్లను తుత్తునియలు చేశాడు. చురకత్తుల్లాంటి బంతుల్ని లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాట్స్‌మెన్‌పై సంధిస్తూ.. టీమిండియా లైనప్‌ను ఇబ్బంది పెట్టాడు.

ఇక తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు కొట్టిన భారత్ మరో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ 35 బంతులకే తన వ్యక్తిగత స్కోరు 14 పరుగులకు ఔటైపోయాడు. రబాడా పదో ఓవర్‌ చివరిలో వేసిన పదునైన బంతి రోహిత్ వికెట్‌ను కోసేసింది. రోహిత్ డిఫెన్స్‌ను ఛేదించుకుని మరీ అతడి బ్యాట్‌కు తగిలి కీపర్ డికాక్ చేతుల్లో పడింది. దీంతో రోహిత్ పెవిలియన్ చేరుకున్నాడు.

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 91 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకి టెస్టుల్లో ఇది 23వ అర్ధసెంచరీ. తరువాత కొద్దిసేపటికి మైదానంలో తగినంత వెలుతురు లేకపోవడంతో అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోరు 273 – 3 గా ఉంది. విరాట్‌ కోహ్లీ 63 పరుగులతోనూ, రహానే 18 పరుగులతో (70 బంతులు) నైట్ వాచ్‌మెన్‌గా ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.రోహిత్‌ ఔటైన తర్వాత మయాంక్ అగర్వాల్ క్రీజు వద్ద విశ్వరూపం ప్రదర్శించాడు. 195 బంతుల్లో 16 బౌండ్రీలు, రెండు సిక్సర్లతో మొత్తం 108 పరుగులు చేశాడు. పర్యాటక యువ పేసర్ అన్రిచ్ నోర్జెను బంతుల్ని బౌండ్రీకి తరిమి కొట్టాడు. దాంతో టీమిండియా స్కోరు భోజన విరామ సమయానికి 77/1గా ఉంది. ఇక విరామం అనంతరం మయాంక్ అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో సౌతాఫ్రికా పేసర్లకు చుక్కలు చూపించాడు. డ్రింక్స్ బ్రేక్‌కు ముందు 112 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన మయాంక్ ఛటేశ్వర్ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే.. పుజారాను రబాడా ఓ అద్భుతమైన బంతితో ఔట్ చేశాడు. దీంతో టీమిండియా రెండు వికెట్లు నష్టపోయి 168 పరుగుల వద్ద టీ విరామానికి వెళ్ళింది.

ఇక చివరిలో కెప్టెన్ కోహ్లీ (63) సహకారంతో మయాంక్ 183 బంతుల్లో తన కెరీర్‌లో రెండో సెంచరీ చేశాడు. ఈ సీరీస్‌లో మయాంక్‌కు ఇది రెండో సెంచరీ. మరింత దూకుడుగా ఆడి భారీ స్కోరు కొట్టాలనుకుంటున్న మయాంక్‌ను రబాడాయే పెవిలియన్‌కు పంపించాడు. టీమిండియా స్కోరు 198 వద్ద మయాంక్ ను రబాడా పల్టీ కొట్టించాడు. భుజాలపైకి వచ్చిన బంతిని స్లిప్‌లో డుప్లెసిస్ ఒడిసిపట్టుకోవడంతో మయాంక్ పరుగుల వేటకు తెరపడింది. తర్వాత అజింక్య రహానె (18)తో కలిసి విరాట్ కోహ్లీ విజృంభించాడు. ఫిలాండర్ వేసిన 80.5వ బంతిని బౌండరీకి తరిమి 23వ హాఫ్ సెంచరీ చేశాడు. కోహ్లీ, అజింక్య వేగంగా బ్యాటింగ్ చేస్తూ.. నాలుగో వికెట్‌కు అజేయంగా 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు నష్టపోయి 273 పరుగులు చేసింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN