మళ్లీ బాదేసిన రోహిత్

Mana Telangana

Mana Telangana

Author 2019-10-20 02:58:09

img

రాణించిన రహానె, భారత్ 224/3, సౌతాఫ్రికాతో చివరి టెస్టు

రాంచీ : దక్షిణాఫ్రికాతో శనివారం ప్రారంభమైన మూడో, చివరి టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. వెలుతురు లేని కారణంగా మొదటి రోజు 58 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. కాగా, ఓపెనర్ రోహిత్ శర్మ 117 (నాటౌట్) అజేయ శతకంతో భారత్‌ను ఆదుకున్నాడు. వైస్ కెప్టెన్ అజింక్య రహానె 83(బ్యాటింగ్) అతనికి అండగా నిలిచాడు. ఇద్దరూ నాలుగో వికెట్‌కు అబేధ్యంగా 185 పరుగులు జోడించారు. తొలి రోజు ప్రతికూల వాతావరణం వల్ల 32 ఓవర్ల ఆట తుడిచి పెట్టుకు పోయింది.

ఒకవేళ పూర్తి ఓవర్లపాటు ఆట సాగివుంటే టీమిండియా స్కోరు 350 పరుగులు దాటేది. కానీ, దూకుడు మీదున్న భారత బ్యాట్స్‌మెన్‌కు బ్యాడ్‌లైట్ ప్రతికూలంగా తయారైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఊహించినట్టే బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక, సౌతాఫ్రికా కెప్టెన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. టాస్ గెలవాలనే అతని కల ఈసారి కూడా నెరవేరలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 20తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో విరాట్ సేన ఉంది. ఇప్పటికే మెరుగైన స్థితికి చేరుకున్న టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది.

ఆరంభంలోనే
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ప్రారంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. తొలి రెండు టెస్టుల్లో సెంచరీలతో చెలరేగిన యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఈసారి ఆ సంప్రదాయాన్ని కొనసాగించలేక పోయాడు. రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన మయాంక్ పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. రబడా అద్భుత బంతితో మయాంక్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టించాడు. తర్వాత వచ్చిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు.

రబడా వేసిన చక్కటి బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు. పుజారా కనీసం ఖాతా కూడా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా నిరాశ పరిచాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ విరాట్ కోహ్లి 12 పరుగులు మాత్రమే చేసి నోర్జే వేసిన బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

సమన్వయంతో
ఒకవైపు వికెట్లు పడుతున్నా రోహిత్ పోరాటం కొనసాగించాడు. అతనికి వైస్ కెప్టెన్ అజింక్య రహానె అండగా నిలిచాడు. ఇద్దరు దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగారు. భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 71 పరుగులకు చేరింది.

లంచ్ తర్వాత రహానె, రోహిత్‌లు దూకుడును పెంచారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలింలేదు. మరోవైపు రోహిత్ శర్మ 8ఫోర్లు, ఒక సిక్స్‌తో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అంతేగాక నాలుగో వికెట్‌కు వంద పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను కూడా నమోదు చేశాడు. కొద్ది సేపటికే రహానె కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ధాటిగా ఆడిన రహానె ఏడు ఫోర్లతో దీన్ని సాధించాడు.

రోహిత్ జోరు..
అర్ధ సెంచరీ తర్వాత రోహిత్ అనూహ్యంగా చెలరేగి పోయాడు. అప్పటి వరకు సమన్వయంతో ఆడిన రోహిత్ తర్వాత జోరును పెంచాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. రోహిత్‌ను కట్టడి చేసేందుకు సౌతాఫ్రికా బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరుస ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అతని జోరుతో స్కోరు వేగంగా పరిగెత్తింది. అప్పటి వరకు నెమ్మదిగా సాగిన స్కోరు వేగం పుంజుకుంది. చెలరేగి ఆడిన రోహిత్ 130 బంతుల్లోనే 4 భారీ సిక్సర్లు, మరో 13 ఫోర్లతో సెంచరీని పూర్తి చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఇదే క్రమంలో ఒకే సిరీస్‌లో మూడు సెంచరీలు కొట్టిన భారత ఓపెనర్‌గా గవాస్కర్ సరసన నిలిచాడు.

అంతేగా ఒక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా కొత్త ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే క్రమంలో వెస్టిండీస్ ఆటగాడు హెట్‌మెయిర్ పేరిట ఉన్న 15 సిక్సర్ల రికార్డును రోహిత్ తిరగరాశాడు. 16 సిక్సర్లతో అరుదైన రికార్డును నెలకొల్పాడు. మరోవైపు రహానె కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రహానె 135 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌తో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మరోవైపు చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 164 బంతుల్లో 4 సిక్సర్లు, మరో 14 ఫోర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఇక, సౌతాఫ్రికా బౌలర్లలో రబడా రెండు, అన్రిచ్ నోర్జే ఒక వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ స్కోరు 58 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు ఉన్నప్పుడూ వెలుతురు మందగించడంతో ఆటను నిలిపి వేయాల్సి వచ్చింది. వాతావరణంలో మార్పు కనిపించక పోవడంతో ఆట ముందుకు సాగలేదు.

స్కోరు బోర్డు:
భారత్ మొదటి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) ఎల్గర్ (బి) రబడా 10, రోహిత్ శర్మ (బ్యాటింగ్) 117, చటేశ్వర్ పుజారా ఎల్బీబి రబడా 0, విరాట్ కోహ్లి ఎల్బీబి అన్రిచ్ నోర్జే 12, అజింక్య రహానె (బ్యాటింగ్) 83, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం 58 ఓవర్లలో 224/3.

బౌలింగ్: కగిసో రబడా 145542, ఎంగిడి 114360, అన్రిచ్ నోర్జే 163501, జార్జ్ లిండే 111400, డేన్ పిడ్ట్ 60430.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD