మళ్లీ మెరిసిన మయాంక్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-11 12:55:22

img

* పుజరా, కోహ్లీ అర్ధశతకాలు
* భారత్‌ 273/3
దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండోటెస్ట్‌ తొలిరోజే భారత్‌ పట్టు బిగించింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(108) రెండో టెస్ట్‌లోనూ సెంచరీతో కదం తొక్కగా... పుజరా(58), విరాట్‌ కోహ్లీ(63నాటౌట్‌) రాణించడంతో భారతజట్టు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(14) నిరాశపర్చగా... దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడకు మూడు వికెట్లు దక్కాయి.

పూణె : దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండోటెస్ట్‌ తొలిరోజు భారత ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ శతకంతో చెలరేగగా.... పుజరా, కెప్టెన్‌ కోహ్లీ అర్ధశతకాలతో కదం తొక్కారు. మరోవైపు తొలిటెస్ట్‌ హీరో రోహిత్‌ శర్మ(14) త్వరగా ఔటై అభిమానులను నిరాశపరిచాడు. సఫారీలపై తొలిరోజే కోహ్లీసేన ఆధిపత్యం చెలాయించడంతో ఆట ముగిసే సమయానికి భారతజట్టు 3 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగల్గింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ(3/48) మాత్రమే రాణించాడు.
అంతకుముందు టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ తొలిగా బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గు చూపాడు. తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలతో కదం తొక్కిన రోహిత్‌ శర్మను రబాడ త్వరగా పెవీలియన్‌కు చేర్చగలిగాడు. అద్భుతమైన లెంగ్త్‌తో వేసిన ఆ బంతి రోహిత్‌ డిఫెన్స్‌ను ఛేదించుకొని అతడి బ్యాట్‌ అంచుకు తాకి కీపర్‌ డికాక్‌ చేతుల్లో పడింది. ఆ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌, ఛటేశ్వర పుజరా మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో భోజన విరామ సమయానికి టీమిండియా వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేయగల్గింది.

సెంచరీతో కదం తొక్కిన మయాంక్‌...
తొలి టెస్ట్‌లో డబుల్‌ సెంచరీలో చెలరేగిన మయాంక్‌ అగర్వాల్‌ రెండో టెస్ట్‌లోనూ శతకంతో ఆకట్టుకున్నాడు. అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో సఫారీ పేసర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ ధారాళంగా పరుగులు రాబట్టాడు. ఛటేశ్వర పుజరా(58)తో కలిసి రెండో వికెట్‌కు 138 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. టీ విరామానికి ముందు రబడా వేసిన ఓ గుడ్‌లెంగ్త్‌ బంతికి పుజరా కూడా పెవీలియన్‌కు చేరిపో యాడు. దీంతో భారతజట్టు రెండు వికెట్ల నష్టానికి 168 పరుగుల వద్ద టీ విరామానికి వెళ్లింది. ఆ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో జతకట్టిన మయాంక్‌ 183 బంతుల్లో కెరీర్‌లో 2వ శతకాన్ని పూర్తి చేసుకు న్నాడు. జట్టు స్కోర్‌ 198 పరుగుల వద్ద రబడా చక్కని లెంగ్త్‌ బంతితో మయాంక్‌ను బోల్తా కొట్టిం చాడు. స్లిప్‌లో భుజాలపైకి వచ్చిన బంతిని డుప్లెసిస్‌ ఒడిసిపట్టుకోవడంతో మయాంక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మయాంక్‌ 195 బంతుల్లో 16 బౌండర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత అజింక్యా రహానె(18), కోహ్లీ(63) కలిసి తొలిరోజు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి టీమిండియా గౌరవప్రద స్కోర్‌ చేసేలా చూశారు. ఫిలాండర్‌ వేసిన 80.5 బంతిని విరాట్‌ కోహ్లీ బౌండరీ బాది కెరీర్‌లో 23వ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. రహానె-కోహ్లీ కలిసి చివరి సెషన్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి 50వ టెస్టు కావడంతో విశేషం.
టీమిండియా పూణే టెస్ట్‌లో ఒక మార్పుతో బరిలోకి దిగింది. తెలుగు కుర్రాడు హనుమ విహారి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. హనుమ విహారిని పక్కకు పెట్టడానికి గల కారణాలను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలపలేదు. దక్షిణాఫ్రికా కూడా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. విశాఖ టెస్టులో ఆకట్టుకోలేని ఆఫ్‌స్పిన్నర్‌ పిడిట్‌ను పక్కనబెట్టి పేసర్‌ అన్రిచ్‌ నార్టే ను తుది జట్టులోకి తీసుకున్నారు. తొలిరోజు మరో ఐదు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.

కోహ్లీ మరో రికార్డు
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్‌ కోహ్లీ మరో రికార్డును తన పేర లిఖించుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ 49 టెస్టులకు సారథ్యం వహించగా... కోహ్లీ ఆ రికార్డును అధిగమించాడు. సఫారీలతో రెండో టెస్ట్‌కు కోహ్లీ కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌ కావడంతో గంగూలీ కెప్టెన్సీ రికార్డును దాటాడు. భారత్‌ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ చేసిన ఆటగాడు మాత్రం మహేంద్రసింగ్‌ ధోని మాత్రమే. అతడు 60 టెస్టులకు సారథ్యం వహించాడు. అత్యధిక విజయాలు 29 టెస్టుల్లో గెలుపు శాతం(58%) కోహ్లీ అందరికంటే ముందుంటే... ధోనీ 27 టెస్టుల్లో విజయాలతో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

సంక్షిప్త స్కోర్‌...
భారత్‌ : 273/3 (మయాంక్‌ 108, పుజరా 58, కోహ్లీ 63 నాటౌట్‌; రబాడ 3/48)

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN