మాతా, శిశు మరణాల నివారణకు చర్యలు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-08 08:06:24

img

విశాఖపట్నం, నవంబర్ 7: మాతా,శిశు మరణాల నివారణకు ఐటీడీఎ ప్రాజెక్టు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.జవహర్‌రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా అనంతగిరిలో గురువారం ఏపీలోని తొమ్మిది ఐటీడీఏల అధికారులు, ఆరోగ్య శాఖ అధికారులతో వైద్య పథకాల అమల తీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోనే అత్యధికంగా మాతా,శిశు మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో వాటి నివారణకు అధికారులు తగిన శ్రద్ధ వహించాలన్నారు. రాష్ట్రంలోనే హైరిస్క్ జిల్లాగా పేరొందిన విశాఖ జిల్లాతో పాటు రంపచోడవరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో అధికంగా మాతా,శిశు మరణాలు నమోదవుతున్న కారణంగా వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీడీఏల్లోని ఇమ్యూనైజేషన్, పాఠశాలల్లో విద్యార్థులకు వైద్యం, టీబీ నివారణ తదితర అంశాలపై ఐటీడీఏ అధికారులు ప్రతి నెలా విధిగా సమీక్ష నిర్వహించి, వాటి కేసుల సంఖ్య తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో అందేలా గిరిజనులకు అందే విధంగా చూడాల్సిన బాధ్యత ఐటీడీఏల పీవోలపైనే ఉందన్నారు. సీజనల్ వ్యాధులతో పాటు, అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు యాక్షన్ ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ, ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధుల నివారణకు దృష్టిసారించాలన్నారు. త్వరలోనే ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపుతో పాటు, భవనాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖ ఏజెన్సీలోని త్వరలోనే చేపట్టే వైద్య కళాశాలకు సంబంధించి తీసుకొవాల్సిన జాగ్రత్తలు, స్థల సేకరణ తదితర అంశాలపై పాడేరు, అరకు ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, అరకు ఎమ్మెల్యే శెట్టి ఫల్గుణ పలు సమస్యలపై ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రాన్ని అందించారు. ఈ సమావేశంలో నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్, ఆరోగ్యశాఖ కమిషనర్ కార్తీకేయ మిశ్రా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, ఆరోగ్యశాఖాధికారులు పాల్గొన్నారు.
----------
*చిత్రం... జవహర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యేలు

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD