మా సొమ్ము మాకు దక్కాల్సిందే..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-15 05:57:44

img

  • ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌పై దృష్టి
  • బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు గంగూలీ
  • ఐసీసీతో తేల్చుకుంటాం!

ముంబై: కొంతకాలం క్రితం వరకు బీసీసీఐ ప్రపంచ క్రికెట్‌లో ఐసీసీ నుంచి భారీ రెవెన్యూను దక్కించుకునేది. అయితే రెండేళ్ల క్రితం నూతన రెవెన్యూ పద్ధతి రావడంతో భారత క్రికెట్‌ బోర్డు ఆదాయంలో భారీ కోత పడింది. ఇప్పుడు ఇదే అంశంపై బీసీసీఐ కాబోయే అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దృష్టి పెట్టబోతున్నాడు. ఐసీసీ నుంచి తమకు ఎంత రావాలో అంత వచ్చి తీరాలంటున్నాడు. ‘కొన్నేళ్లుగా ఐసీసీ నుంచి బీసీసీఐకి రావాల్సినంతగా డబ్బు రావడం లేదు. ఇప్పుడొచ్చేదానికన్నా ఎక్కువగా వచ్చేందుకు మాకు అర్హతలున్నాయి. ఓవరాల్‌గా ఐసీసీకి వచ్చే ఆదాయంలో భారత్‌ నుంచే 75-80 శాతం వెళుతుంది. మరి దీనికి తగ్గట్టుగానే మాకు పంచాల్సి ఉంటుంది’ అని గంగూలీ తెలిపాడు.

‘ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌పై దృష్టి’

అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టాక తొలుత ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌పై దృష్టి సారించనున్నట్టు గంగూలీ చెప్పాడు. ‘ఇదే విషయంపై క్రికెట్‌ పాలక కమిటీ (సీఓఏ)కి నేను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. అందుకే ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల పరిస్థితిపై ముందుగా దృష్టి సారించాలనుకుంటున్నా. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాల్సి ఉంది. అలాగే రంజీ క్రికెట్‌పై మరింత ఫోకస్‌ చేయాల్సి ఉంది’ అని దాదా పేర్కొన్నాడు.

విరుద్ధ ప్రయోజనం సమస్యగా మారింది

మాజీ క్రికెటర్ల విషయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం సమస్యగా మారిందని గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు. నూతన రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు పదవులు చేపట్టరాదు. దీంతో చాలామంది ఆటగాళ్లు బోర్డు పరిపాలనా వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ‘విరుద్ధ ప్రయోజనాల అంశం సమస్యగా ఉంది. దీని కారణంగా ఉత్తమ క్రికెటర్ల సేవలను మేం పొందలేకపోతున్నాం. ఎందుకంటే వారికి ఇతర వ్యాపకాలు కూడా ఉంటాయి. కొత్త రూల్‌ ప్రకారం వారి జీవనాధారమైన పనులను వదిలేసి బోర్డు పరిపాలనా వ్యహారాల్లోకి రాలేరు’ అని సౌరవ్‌ గంగూలీ అన్నాడు.

‘కొత్త సెలెక్షన్‌ కమిటీ ఏర్పాటు

ఈనెల 23న బాధ్యతలు స్వీకరించాక నూతన సెలక్షన్‌ కమిటీపై దృష్టి సారిస్తామని దాదా చెప్పాడు. ‘కొత్త సబ్‌ కమిటీలతో పాటు జాతీయ సెలెక్షన్‌ ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. పరిపాలనను సరైన దారిలో పెట్టాలంటే కొత్తగా ఏర్పాటయ్యే మా బృందం చాలా చేయాల్సి ఉంది’ అని అన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN