మిగిలింది.. 9 వికెట్ల వేట

Nava Telangana

Nava Telangana

Author 2019-10-06 05:41:08

- దక్షిణాఫ్రికా లక్ష్యం 395, ప్రస్తుతం 11/1
-విశాఖలో విజయంపై కోహ్లిసేన గురి
- ఓపెనర్‌గా రోహిత్‌ రికార్డు శతకం
- భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 323/4 డిక్లేర్డ్‌
- ఫ్రీడం సిరీస్‌ తొలి టెస్టు నాల్గో రోజు
విశాఖపట్నం నుంచి శ్రీనివాస్‌ దాస్‌ మంతటి
విశాఖ టెస్టుపై టీమ్‌ ఇండియా పట్టు బిగించింది. రోహిత్‌ శర్మ (127) హీరోయిక్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాకు 395 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. 7 ఓవర్లలో ఆటలో కీలక బ్యాట్స్‌మన్‌ డీన్‌ ఎల్గార్‌ (2)ను పెవిలియన్‌కు పంపించింది. ఫ్రీడం సిరీస్‌లో తొలి టెస్టు సొంతం చేసుకునేందుకు కోహ్లిసేన మరో 9 వికెట్ల దూరంలో నిలిచింది. నాల్గో రోజు ఓ వికెట్‌ తీసిన భారత్‌.. నేడు 9 వికెట్ల వేటను కొనసాగించనున్నారు.
ఓపెనర్‌గా రాణించగలడా అని ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ తొలి ప్రయత్నంలోనే వరుసగా రెండో సెంచరీతో చెలరేగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అరంగేట్ర ఓపెనర్‌గా శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. పుజార (81) ఆకట్టుకునే అర్ధ సెంచరీ సాధించగా.. స్పిన్నర్‌ అశ్విన్‌ (7/145) ఏడు వికెట్లతో మెరిశాడు. నేడు వికెట్ల వేటలో స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజా మాయాజాలంపైనే కోహ్లిసేన విజయం ఆధారపడి ఉంది. మాయగాళ్ల వేట ఎలా ఉంటుందో చూడాలి.
హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (127, 149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్స్‌లు) అమ్మమ్మ ఊరులో రికార్డు శతకం కొట్టాడు. కెరీర్‌ 28వ టెస్టులో ఓపెనర్‌గా నయా అవతారం దాల్చిన రోహిత్‌ శర్మ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగుల భారీ శతకం సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లతో విశ్వరూపం చూపించిన రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్‌ శర్మ వీర విహారానికి తోడు చతేశ్వర్‌ పుజార (81, 148 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. పుజార, రోహిత్‌ రెండో వికెట్‌కు 169 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రవీంద్ర జడేజా (40, 32 బంతుల్లో 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (31 నాటౌట్‌, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), అజింక్య రహానె (27 నాటౌట్‌, 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధనాధన్‌ మెరుపులతో భారత్‌ వేగంగా పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌ను 323/4 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. అంతకముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 431 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యం కోహ్లిసేన సొంతమైంది. నాల్గో రోజు చివర్లో డిక్లరేషన్‌ ఇచ్చిన కోహ్లి దక్షిణాఫ్రికాను 395 పరుగుల ఛేదనకు ఆహ్వానించాడు. కఠిన ఛేదనలో దక్షిణాఫ్రికా 7 ఓవర్లలో ఓ వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ హీరో డీన్‌ ఎల్గార్‌ (2) జడ్డూ వలలో చిక్కాడు. ఓపెనర్‌ ఎడెన్‌ మార్క్‌రం (3 బ్యాటింగ్‌), డీ బ్రూయిన్‌ (5 బ్యాటింగ్‌) అజేయంగా నిలిచారు. దక్షిణాఫ్రికా మరో 384 పరుగుల వెనుకంజలో కొనసాగుతుండగా.. టీమ్‌ ఇండియా విజయానికి మరో 9 వికెట్ల దూరంలో నిలిచింది.
తొలి సెషన్‌ : దక్షిణాఫ్రికా 431 ఆలౌట్‌
ఓవర్‌నైట్‌ స్కోరు 385/8తో నాల్గో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా విలువైన పరుగులు జోడించింది. కేశవ్‌ మహరాజ్‌ (9)ను అశ్విన్‌ను త్వరగానే వెనక్కి పంపినా పదో వికెట్‌కు సఫారీ 35 పరుగులు చేసింది. సెనురన్‌ ముతుసామి (33 నాటౌట్‌, 106 బంతుల్లో 4 ఫోర్లు), కగిసో రబాడ (15, 17 బంతుల్లో 3 ఫోర్లు) భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని వంద దిగువకు కుదించారు. ఉదయం సెషన్లో 13.2 ఓవర్లు ఆడిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు జత చేసింది. భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆశించిన భారత్‌ 71 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. సఫారీ చివరి రెండు వికెట్లనూ అశ్వినే పడగొట్టాడు. 7/145తో తిరుగులేని ప్రదర్శన చేశాడు.
మయాంక్‌ అవుట్‌, భారత్‌ 35/1
తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు భాగస్వామ్యం నమోదు చేసిన ఓపెనింగ్‌, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులకే విడిపోయింది. ఇన్నింగ్స్‌ 11వ బంతికి ఫోర్‌తో రోహిత్‌ పరుగులు ఖాతా తెరిచాడు. మహరాజ్‌ ఓవర్లో స్వీప్‌ షాట్‌తో స్క్వేర్‌ లెగ్‌లో సూపర్‌ సిక్సర్‌ బాది ఊపందుకున్నాడు. 31 బంతుల్లో 7 పరుగులే చేసిన అగర్వాల్‌ స్పిన్నర్‌ మహరాజ్‌ బంతికి స్లిప్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. మహరాజ్‌పై మరో సిక్సర్‌ బాదిన రోహిత్‌ శర్మ లంచ్‌ సమయానికి 25 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌లో పుజార (2) తోడుగా నిలిచాడు.
రెండో సెషన్‌ : భారత్‌ 175/1 : రోహిత్‌, పుజార దూకుడు
ధనాధన్‌ బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ శర్మ మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 72 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఓ వైపు రోహిత్‌ దూకుడు మీద ఉండగా.. పుజార పరుగులు చేయటంలో ఇబ్బంది పడ్డాడు. పుజార ఎదుర్కొన్న తొలి 61 బంతుల్లో 8 పరుగులే చేశాడు. కానీ డ్రింక్స్‌ విరామం తర్వాత పుజార గేర్‌ మార్చాడు. డేన్‌ పీట్‌పై వరుస బంతుల్లో బౌండరీలు బాదిన పుజార.. తర్వాతి ఓవర్లో మహరాజ్‌పైనా వరుస బంతుల్లో ఫోర్లు కొట్టాడు. అక్కడ్నుంచి పుజార వెనక్కి తగ్గలేదు. రోహిత్‌ 48 పరుగుల వద్ద ఉండగా పుజార 8 పరుగులతో ఉన్నాడు. 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో పుజార తర్వాతి 45 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. రోహిత్‌, పుజార రెండో వికెట్‌కు చేసిన 150 పరుగుల్లో పుజార చేసిన రన్స్‌ 75 కాగా, రోహిత్‌ 70 జోడించాడు. పుజార, రోహిత్‌ ధనాధన్‌ వేగంతో పరుగులు రాబట్టారు. దీంతో లంచ్‌ తర్వాత టీమ్‌ ఇండియా వికెట్‌ కోల్పోకుండా 140 పరుగులు చేసింది.
మూడో సెషన్‌ : భారత్‌ 323/4 డిక్లేర్డ్‌ : రోహిత్‌ వీరంగం
చివరి సెషన్‌లో రోహిత్‌ శర్మ ఉగ్రరూపం దాల్చాడు!. 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 133 బంతుల్లోనే రోహిత్‌ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రోహిత్‌ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. పుజార స్పిన్నర్‌ మహరాజ్‌ వరుస ఓవర్లలో నాలుగు ఫోర్లు బాది ఔరా అనిపించాడు. ఫిలాండర్‌ బంతికి పుజార ఎల్బీగా అవుటయ్యాడు. కానీ మరో ఎండ్‌లో రోహిత్‌ శర్మ విశ్వరూపం మరో స్థాయికి వెళ్లింది. శతకం తర్వాత రోహిత్‌ను ఆపటం సఫారీ తరం కాలేదు. డేన్‌ పీట్‌ ఓవర్లో హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదిన రోహిత్‌ ఇన్నింగ్స్‌కు ఊపు తీసుకొచ్చాడు. లాంగ్‌ లెగ్‌, మిడ్‌ వికెట్‌, లాంగ్‌ ఆఫ్‌లో భారీ సిక్సర్లతో సఫారీ బౌలర్లను భయపెట్టాడు. ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. మ్యాచ్‌లో 13వ సిక్సర్‌తో టెస్టుల్లో సిక్సర్లు బాదటంలో కొత్త రికార్డును నెలకొల్పాడు. ఓపెనర్‌గా తొలి టెస్టులోనే రెండు శతకాలు బాదిన రోహిత్‌.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే శైలిలో అవుటయ్యాడు. క్రీజు వదలి బయటకు వచ్చి స్టంపౌట్‌గా వికెట్‌ కోల్పోయాడు. అప్పటికే బ్యాటింగ్‌ లైనప్‌లో ముందుకొచ్చిన రవీంద్ర జడేజా ఎడాపెడా బాదటం మొదలెట్టాడు. ముతుసామిపై కార్నర్‌లో సిక్సర్‌ కొట్టిన జడేజా.. పీట్‌ ఓవర్లో రెండు సిక్సర్లు బాది దూకుడు కొనసాగించాడు. కెప్టెన్‌ కోహ్లి వస్తూనే మహరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని కొట్టాడు. అతడి వరుస ఓవర్లలో కోహ్లి రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో కదం తొక్కాడు. రబాడ ఓవర్లో జడేజా క్లీన్‌బౌల్డ్‌ కాగా.. వచ్చీ రాగానే అజింక్య రహానె (31 నాటౌట్‌) బౌండరీలపై పడ్డాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో రహనె కొత్త తరహా ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ కోహ్లి మరో ఫోర్‌ బాది ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌ ప్రకటించాడు. అప్పటికి భారత్‌ స్కోరు 323/4. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలిపి 394.
దక్షిణాఫ్రికా :
395 పరుగుల లక్ష్యంతో ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికాకు స్పిన్‌ ద్వయం అశ్విన్‌, జడేజా మాయా స్వాగతం పలికింది. అశ్విన్‌ తొలి ఓవర్లోనే ఎల్గార్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసినంత పని చేయగా.. జడేజా తన రెండో ఓవర్లో ఆ పని పూర్తి చేశాడు. లైన్‌ లండ్‌ లెంగ్త్‌ బంతితో ఎల్గార్‌ను ఎల్బీగా అవుట్‌ చేశాడు. 4 పరుగులకే దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ హీరో డీన్‌ ఎల్గార్‌ (2) కోల్పోయింది. దక్షిణాఫ్రికా చివరి సెషన్లో 13 ఓవర్ల ఆట ఆడాల్సి ఉన్నా.. వెలుతురు లేమి సమస్యతో మరో నాలుగు ఓవర్లు ఉండగానే.. 7 ఓవర్లకే ఆటను నిలిపివేశారు. నేడు ఆఖరు రోజు 98 ఓవర్ల ఆట సాగనుంది.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 502/7 డిక్లేర్డ్‌
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : ఎల్గార్‌ (సి) పుజార (బి) జడేజా 160, మార్క్‌రం (బి) అశ్విన్‌ 5, డీ బ్రూయిన్‌ (సి) సాహా (బి) అశ్విన్‌ 4, డేన్‌ పీట్‌ (బి) జడేజా 0, బవుమా (ఎల్బీ) ఇషాంత్‌ 18, డుప్లెసిస్‌ (సి) పుజార (బి) అశ్విన్‌ 55, డికాక్‌ (బి) అశ్విన్‌ 111, ముతుసామి నాటౌట్‌ 33, ఫిలాండర్‌ (బి) అశ్విన్‌ 0, మహరాజ్‌ (సి) మయాంక్‌ (బి) అశ్విన్‌ 9, రబాడ (ఎల్బీ) అశ్విన్‌ 15, ఎక్స్‌ట్రాలు : 21, మొత్తం :(131.2 ఓవర్లలో ఆలౌట్‌) 431.
వికెట్ల పతనం : 1-14, 2-31, 3-34, 4-63, 5-178, 6-342, 7-370, 8-376, 9-396, 10-431.
బౌలింగ్‌ : ఇషాంత్‌ శర్మ 16-2-54-1, మహ్మద్‌ షమి 18-4-47-0, అశ్విన్‌ 46.2-11-145-7, జడేజా 40-0-5-124-2, విహారి 9-1-38-0, రోహిత్‌ శర్మ 2-1-7-0.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) మహరాజ్‌ 7, రోహిత్‌ శర్మ (స్టంప్డ్‌)డికాక్‌ (బి) మహరాజ్‌ 127, పుజార (ఎల్బీ) ఫిలాండర్‌ 81, జడేజా (బి) రబాడ 40, కోహ్లి నాటౌట్‌ 40, రహానె నాటౌట్‌ 31, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం :(67 ఓవర్లలో 4 వికెట్లకు) 323.
వికెట్ల పతనం : 1-21, 2-190, 3-239, 4-286.
బౌలింగ్‌ : ఫిలాండర్‌ 12-5-21-1, మహరాజ్‌ 22-0-129-2, రబాడ 13-3-41-1, డేన్‌ పీట్‌ 17-3-102-0, ముతుసామి 3-0-20-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ : ఎల్గార్‌ (ఎల్బీ) జడేజా 2, ఎడెన్‌ మార్క్‌రం బ్యాటింగ్‌ 3, డీ బ్రూయిన్‌ బ్యాటింగ్‌ 5, ఎక్స్‌ట్రాలు : 01, మొత్తం : (8 ఓవర్లలో ఓ వికెట్‌) 11.
వికెట్ల పతనం : 1-4.
బౌలింగ్‌ : అశ్విన్‌ 4-1-7-0, జడేజా 4-2-3-1.

1:టెస్టు ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే రెండు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ. విశాఖ టెస్టులో రోహిత్‌ 176, 127 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు సాధించిన భారత ఓపెనర్‌గా దిగ్గజ సునీల్‌ గవాస్కర్‌ సరసన రోహిత్‌ శర్మ నిలిచాడు.
13:ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సొంతమైంది. వసీం అక్రమ్‌ (12) రికార్డును రోహిత్‌ శర్మ (13) విశాఖలో అధిగమించాడు. వన్డే, టీ20ల్లోనూ అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్‌ పేరిటే ఉన్నాయి.
308:దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ విశాఖ టెస్టులో ట్రిపుల్‌ సెంచరీ కొట్టాడు. 75.5 ఓవర్లు వేసిన కేశవ్‌ ఐదు వికెట్లు తీసినా.. ధారాళంగా (308) పరుగులిచ్చి చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN