మీకు రెండు వారాలే గడువు

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-05 07:05:05

img

విశాఖపట్నం, నవంబర్ 4: ఇసుక సమస్యకు తెరదించి, భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు తామిచ్చిన గడువు రెండు వారాలేనని, అప్పటిలోగా పూర్తి పరిష్కారాన్ని ప్రభుత్వం చూపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. విశాఖలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అప్పటి వరకూ జనసేన కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారన్నారు. ఇసుక సమస్య అంశంలో చోటుచేసుకున్న లోపాలపై నిపుణులతో కూడిన కమిటీలో చర్చించి అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇసుక కొత్త పాలసీకి తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదు, అయితే భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసేలా సమస్యను తీవ్రతరం చేసిన తీరునే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మీ పాలనలో తప్పులు జరుగుతున్నాయి తెలుసుకోండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హఠాత్తుగా మార్చారంటే అక్రమాలు జరుగుతున్నాయని భావించినట్టేనా అని ప్రశ్నించారు. అయిదు నెలల కాలంలోనే వేలాది కార్మికులు రోడ్డెక్కి ఉద్యమించే పరిస్థితి వచ్చిందంటే మీ నిర్ణయాల్లో లోపాలున్నాయని మాత్రమే తాము ఎత్తిచూపుతున్నామని, దీనికి సమాధానం ఇవ్వాలి తప్ప, వ్యక్తిగతంగా నాపై విమర్శలు చేయడంలో అర్ధం లేదన్నారు. 151 సీట్లతో బలమైన మీ ప్రభుత్వంపై కేవలం 7.5 శాతం ఓట్లతో ఒకే ఒక స్థానం సాధించిన తాము పోరాడుతున్నామంటే కేవలం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేనని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం జగన్, వైసీపీపై తనుకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇసుక విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఇబ్బందులు ఇక్కడే ఎందుకు ఎదురయ్యాయని, మీ విధాన నిర్ణయాల్లో లోపం వల్లే పరిస్థితులు చేయిదాటాయన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ తనపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలపై పవన్ ఘాటుగానే స్పందించారు. చిరంజీవి దయతో ఎగిగానని చెపుతున్న అవంతి తన సినిమాల్లో తానే హీరోనని తెలుసుకోవాలన్నారు. రాజకీయ నాయకులకు వ్యాపారాలు ఉండకూడదన్న నిబంధన ఎక్కడా లేదని, జగన్ కూడా తన వ్యాపారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితులను ఢిల్లీ పెద్దల దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు నాందెండ్ల మనోహర్, వీవీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN