ముంబైలో 23న బీసీసీఐ వార్షిక సర్వసభ్యసమావేశం

Teluguglobal

Teluguglobal

Author 2019-10-14 10:18:29

img

  • ఐదు క్రికెట్ సంఘాలకు అనుమతి నిరాకరణ
  • బోర్డు కొత్త కార్యవర్గం ఏర్పాటుతో సీఈవో రద్దు

ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి ఈనెల 23న తెరలేవనుంది. సరికొత్త రాజ్యాంగం ప్రకారం…సుప్రీంకోర్టు నియమించిన పాలకమండలి పర్యవేక్షణలో సరికొత్త కార్యవర్గం ఏర్పాటుకు రంగం సిద్ధమయ్యింది.

ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాలతో దారితప్పిన భారత క్రికెట్ ను గాడిలో పెట్టడానికి సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకొని.. జస్టిస్ లోథా కమిటీని ఏర్పాటు చేసింది.

జస్టిస్ లోథా సంస్కరణలు…

img

భారత క్రికెట్ బోర్డు వ్యవహారాలలో పారదర్శకత, జవాబుదారీతనం, హుందాతనం తీసుకువచ్చేలా జస్టిస్ లోథా విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు.

బోర్డు కార్యవర్గంలో బిజినెస్ మాగ్నెట్లు, రాజకీయప్రముఖులు పాతుకుపోయి…తమ కుటుంబ సొత్తులా భావించడాన్ని నివారించడానికి జస్టిస్ లోథా పలు రకాల చర్యలు తీసుకొన్నారు.

సంస్కరణలు కఠినంగా అమలు చేయటం కోసం వినోద్ రాయ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల పాలకమండలిని ఏర్పాటు చేసింది.

గత కొద్ది సంవత్సరాలుగా.. బీసీసీఐ, దాని అనుబంధ సంఘాలను పాలకమండలి మాత్రమే నియంత్రిస్తూ వచ్చింది. కఠినమైన ఆంక్షలు విధిస్తూ చాలావరకూ దారికి తెచ్చింది.

దారితప్పిన భారత క్రికెట్ బోర్డును గాడిలో పెట్టడానికి…సుప్రీంకోర్టు ఆదేశాలతో జస్టిస్ లోథాకమిటీ సూచనలు, ప్రతిపాదనలు సత్ఫలితాలనివ్వడం ప్రారంభమయ్యింది.

img

క్రీడాసంఘాలను ఏళ్లతరబడి జలగల్లా పట్టిపీడిస్తున్న క్రీడాసంఘాలను రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్ల నుంచి విముక్తం చేయడం, 70 ఏళ్ల పైబడినవారికి క్రీడాసంఘాలలో స్థానం లేకుండా చేయటం, క్రీడాసంఘాలను మాజీ క్రీడాకారులే నడుపుకొనేలా మార్గం సుగమం చేయటం, మూడు విడతలకు మించి కార్యవర్గాలకు ఎంపిక కానివ్వకుండా నిరోధించడం, ఒక రాష్ట్రానికి ఒక ఓటు మాత్రమే ఉండేలా నిబంధనలు రూపొందించడం ద్వారా.. మత్తగజంలాంటి బీసీసీఐ మెడలు వంచడంలో సుప్రీంకోర్టు కమ్ జస్టిస్ లోథా కమిటీ సఫలమయ్యింది. ఎదురుతిరిగిన బీసీసీఐ కార్యవర్గాన్ని ఒక్క వేటుతో రద్దు చేయడం ద్వారా…బీసీసీఐ అనుబంధం సంఘాలలో ప్రకంపనలు రేపింది.

img

సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశాల మేరకు …సరికొత్త నిబంధనలతో బీసీసీఐ అనుబంధం సంఘాలకు ఎన్నికల నిర్వహణ పూర్తయ్యింది.

బీసీసీఐకి సైతం అక్టోబర్ 22న ఎన్నికలు నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అయితే…హర్యానా, మహారాష్ట్ర్ర శాసనసభ ఎన్నికలు అక్టోబర్ 21న జరుగనుండడంతో…బీసీసీఐ ఎన్నికలను ఒక్కరోజు ఆలస్యంగా అక్టోబర్ 23న నిర్వహించనున్నట్లు పాలకమండలి చైర్మన్ వినోద్ రాయ్ ప్రకటించారు.

బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం క్రికెట్ సంఘాలలో పూర్తిస్థాయి హోదా కలిగిన 24 క్రికెట్ సంఘాలు కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకొన్నాయి.

ఇండియన్ రైల్వేస్, సర్వీసెస్, ఇండియన్ యూనివర్శిటీస్ క్రికెట్ సంఘాలు మాత్రం తమతమ ప్రతినిధులను బీసీసీఐకి పంపుతాయి.

ఐదు క్రికెట్ సంఘాలపై నిషేధం..

img

ఈ నెల 23న ముంబైలో జరిగే బోర్డు వార్షిక కార్యవర్గ సమావేశంలో పాల్గొనకుండా తమిళనాడు, మహారాష్ట్ర్ర, హర్యానా, మణిపూర్, ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘాలపై పాలకమండలి నిషేధం విధించింది.

సంస్కరణలను నూటికి నూరుశాతం అమలు చేయనికారణంగానే ఈ చర్య తీసుకొన్నారు.

23 తర్వాత పాలకమండలి తెరమరుగు…

img

బీసీసీఐకి ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఏర్పాటు కావడంతోనే సుప్రీంకోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల పాలకమండలి విధుల నుంచి

ఉపసంహరించుకోనుంది. 2017 నుంచి వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలకమండలి పర్యవేక్షణలోనే బీసీసీఐ పని చేస్తూ వస్తోంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN