మెరిసిన పూనమ్ రౌత్..ప్రతీకారం తీర్చుకున్న భారత్
తొలి వన్డేలో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకున్న ఇండియా మహిళలు.. వెస్టిండీస్‌పై వెంటనే ప్రతీకారం తీర్చుకున్నారు. సెకండ్ వన్డేలో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేశారు. పూనమ్ రౌత్ (77) హాఫ్ సెంచరీకి తోడు స్పిన్నర్లు సమష్టిగా రాణించడంతో ఇండియా టైమ్ ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ముగిసిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో మిథాలీబృందం 53 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 191 రన్స్ చేసింది. 17 పరుగులకే ఓపెనర్లు ప్రియా పునియా (5), రోడ్రిగ్స్ (0) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇన్నింగ్స్‌ను పూనమ్ చక్కదిద్దింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (40)తో మూడో వికెట్66 రన్స్ , హర్మన్‌ప్రీత్ (46)తో నాలుగో వికెట్‌కు 93 రన్స్ జతచేసి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించింది. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, అలియా అలైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియా స్పిన్నర్ల ధాటికి ఉక్కిరిబిక్కిరైన కరీబియన్ టీమ్ 47.2 ఓవర్లలో 138 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. షెమైన్ కాంప్బెల్లే (39) జట్టులో టాప్ స్కోరర్. ఆమెతో పాటు కెప్టెన్ స్టెఫానీ టేలర్ (20) మాత్రమే కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. జులన్ గోస్వామి, శిఖా పాండే చెరో వికెట్ తీశారు. పూనమ్ రౌత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.