మేరీకోమ్‌ మెడల్‌ నం.8

Nava Telangana

Nava Telangana

Author 2019-10-11 04:57:18

-దిగ్గజ బాక్సర్‌కు రికార్డు ఎనిమిదో పతకం ఖాయం
-సెమీఫైనల్లోకి ప్రవేశించిన బాక్సింగ్‌ లెజెండ్‌
-లావ్లినా, జమున, మంజులకు పతకాలు ఖాయం
-ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌
ఉలాన్‌ ఉదె (రష్యా)
ప్రపంచ బాక్సింగ్‌ దిగ్గజం పంచ్‌కు మరో రికార్డు సలాం చేసింది. 37 ఏండ్ల వయసులో
యువ తరంతో రింగ్‌లో పోటీపడుతున్న 'అమ్మల ప్రతినిధి' ఎంసీ మేరీకోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ చరిత్రలో ఎనిమిది పతకాలు సాధించిన ఏకైక బాక్సర్‌గా మేరీకోమ్‌ అనితర సాధ్యమైన రికార్డును అందుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో తొలిసారి 51 కేజీల విభాగంలో పోటీపడుతున్న మేరీకోమ్‌ సెమీఫైనల్స్‌ ప్రవేశంతో పతకం ఖాయం చేసుకుంది. మరో ముగ్గురు భారత బాక్సర్లు సైతం సెమీస్‌లోకి చేరుకుని, టీమ్‌ ఇండియాకు నాలుగు పతకాలు ఖాయం చేశారు.
2018, నవంబర్‌ 24. న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్‌ స్టేడియం. కేడీ జాదవ్‌ బాక్సింగ్‌ హాల్‌ అభిమానులతో కిక్కిరిసి పోయింది. భారత్‌లో ఓ బాక్సింగ్‌ ఈవెంట్‌కు ఆ స్థాయిలో అభిమానులు హాజరు కావటం అదే తొలిసారి. సొంత అభిమానుల మద్దతు నడుమ మేరీకోమ్‌ రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌ బాక్సర్‌ హనా ఒహౌటను చిత్తు చేసి మహిళల 48 కేజీల విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో సాధించిన ఈ పసిడి మేరీకోమ్‌కు వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో ఆరో స్వర్ణం. ఆ పసిడితో ఐర్లాండ్‌ బాక్సర్‌ సారా టేలర్‌ (ఐదు స్వర్ణాలు, ఓ రజతం) రికార్డును అధగమించిన మేరీకోమ్‌..ఆరు స్వర్ణాలు సాధించిన క్యూబా బాక్సర్‌ ఫెలిక్స్‌ సావన్‌ సరసన నిలిచింది. విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మేరీకోమ్‌ సాధించిన విజయం అసమానం. ప్రపంచ బాక్సింగ్‌ రికార్డు పుస్తకాల్లో మేరీకోమ్‌ పేరు చిరస్థాయిలో లిఖించేందుకు ఆ రికార్డు సరిపోతుంది. అలుపెరుగుని పోరాట యోధురాలు మేరీకోమ్‌ అక్కడితో ఆగిపోలేదు. ఏడాదిలో ఎంపిక చేసుకున్న టోర్నీల్లో పాల్గొని, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంది. కఠోర శిక్షణ, నిరంతర సాధనతో 2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు 2020 ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతోంది. లక్ష్యం టోక్యో ఒలింపిక్స్‌ దారిలో మేరీకోమ్‌ తొలి అడుగు గట్టిగా వేసింది. రష్యాలోని ఉలాన్‌ ఉదెలో జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో చరిత్ర తిరగరాసింది. ప్రపంచ బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన బాక్సర్‌గా రికార్డు నెలకొల్పింది. నిరుడు అత్యధిక స్వర్ణాలు సాధించిన బాక్సర్‌గా ఫెలిక్స్‌ సావన్‌ సరసన నిలిచిన మేరీకోమ్‌.. తాజాగా ఎనిమిదో పతకం ఖాయం చేసుకుని ఫెలిక్స్‌ను వెనక్కి నెట్టేసింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లలో పసిడి పతకాలు సాధించిన మేరీకోమ్‌, 2001లో రతజం పతకం అందుకుంది. తాజాగా 2019లో సెమీఫైనల్లోకి ప్రవేశించి రికార్డు ఎనిమిదో పతకం ఖాయం చేసుకుంది.
ఎదురులేని మేరీకోమ్‌ : మేరీకోమ్‌ ప్రపంచ బాక్సింగ్‌ చరిత్రలో దిగ్గజంగా నిలిచిపోయినా.. 51 కేజీల విభాగంలో ఆమె సాధించాల్సింది మిగిలే ఉంది. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ ఈ విభాగంలోనే పోటీపడనుంది. అందుకే తొలి మెట్టుగా వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో మేరీకోమ్‌ సత్తాకు స్వీయ పరీక్ష నిర్దేశించుకుంది. తొలి రౌండ్‌లో బై లభించగా క్టార్టర్స్‌ దారిలో మేరీకోమ్‌ చెమట చిందించలేదు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో మేరీకోమ్‌ 5-0తో ఏకపక్ష విజయం నమోదు చేసింది. పోరాట స్ఫూర్తి కనబరిచిన కొలంబియా బాక్సర్‌ వెలెన్సియ విక్టోరియపై మేరీకోమ్‌ ఐదుగురు న్యాయనిర్ణేతల ఏకగ్రీవ విజేతగా అవతరించింది. విక్టోరియాపై పదునైన పంచ్‌లు సంధించిన మేరీకోమ్‌.. ప్రత్యర్థి పంచ్‌ నుంచి తిరుగులేని డిఫెన్స్‌తో తప్పించుకుంది. సెమీఫైనల్స్‌ దారిలో మేరీకోమ్‌కు ఎటువంటి ఆటంకం కలుగలేదు. 51 కేజీల విభాగంలో తొలిసారి సెమీఫైనల్లోకి ప్రవేశించిన మేరీకోమ్‌ ఓ పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం సెమీఫైనల్లో టర్కీ బాక్సర్‌, రెండో సీడ్‌ బుసెనాజ్‌తో మేరీకోమ్‌ పోటీపడనుంది. ' క్వార్టర్‌ఫైనల్స్‌ విజయంతో సంతోషంగా ఉంది. భారత్‌కు అత్యున్నత పతకం సాధించేందుకు ప్రయత్నిస్తాను. పసిడి పోరుకు చేరుకునేందుకు సెమీస్‌లో నా శక్తి వంచన లేకుండా పోరాడతాను' అని మేరీకోమ్‌ తెలిపింది.
మరో మూడు ఖాయం : మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో టీమ్‌ ఇండియా మరో మూడు పతకాలు ఖాయం చేసుకుంది. 21 ఏండ్ల యువ బాక్సర్‌ మంజు రాణి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో అద్భుత విజయం నమోదు చేసింది. క్వార్టర్‌ఫైనల్లో మంజు రాణి కండ్లుచెదిరే విజయం సాధించింది. టాప్‌ సీడ్‌, వరల్డ్‌ నం.1 బాక్సర్‌ హయాన్‌ మి కిమ్‌ (దక్షిణ కొరియా)పై మంజు రాణి పదునైన పంచ్‌ విసిరింది. గురువారం నాటి క్వార్టర్‌ఫైనల్లో మెరిసిన మంజు రాణి 4-1తో కొరియా బాక్సర్‌ను చిత్తు చేసింది. 48 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 69 కేజీల విభాగంలో లావ్లినా సైతం సెమీఫైనల్లోకి చేరుకుంది. పొలాండ్‌ బాక్సర్‌ కరొలినాపై 4-1తో గెలుపొంది కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. 54 కేజీల విభాగంలో అరంగ్రేట బాక్సర్‌ జమున దుమ్మురేపింది. జర్మనీ బాక్సర్‌ను 4-1తో చిత్తు చేసి సెమీఫైనల్లోకి చేరుకుంది.

img
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN