యాజమాన్యంతో తుది చర్చలు.. కోచ్‌గా అనిల్‌ కుంబ్లే?!!

mykhel

mykhel

Author 2019-10-02 14:43:54

img

ముంబై: టీమిండియా మాజీ కోచ్‌, దిగ్గజ ఆటగాడు అనిల్‌ కుంబ్లే మళ్లీ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదేంటి టీమిండియా జట్టుకు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నాడు కదా.. మళ్లీ కోచ్‌గా అనిల్‌ కుంబ్లే? ఏంటి అనుకుంటున్నారా. అదేంలేదు.. ఐపీఎల్‌ ప్రాంఛైజీ కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు కుంబ్లే కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. పంజాబ్‌ జట్టు యాజమాన్యంతో కుంబ్లే ప్రస్తుతం తుది చర్చలు జరుపుతున్నాడని సమాచారం తెలుస్తోంది.

img

యాజమాన్యంతో తుది చర్చలు:

బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ జట్టుకు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. పంజాబ్‌ జట్టు యాజమాన్యంతో కుంబ్లే ప్రస్తుతం తుది చర్చలు జరుపుతున్నాడు. ప్రీతి జింటాతో పాటు పంజాబ్‌ జట్టు యాజమాన్యం త్వరలో నిర్వహించే సమావేశంలో కోచ్‌ విషయంపై నిర్ణయం తీసుకొని అధికారికంగా ప్రకటించనున్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కోచ్‌గా మైక్‌ హెసెన్‌ ఇటీవలే రాజీనామా చేసిన విషం తెలిసిందే.

img

కోచ్‌గా మైకేల్ హస్సీ:

మైక్ హెసెన్‌ రాజీనామా అనంతరం కోచ్ వేటని ప్రారంభించిన పంజాబ్.. ఆండ్రీ ప్లవర్, డారెన్ లెహ్మాన్, జార్జ్ బెయిలీలతో సంప్రదింపులు జరిపింది. కానీ ఆ చర్చలు ఫలించలేదు. దీంతో తాజాగా కుంబ్లేని ఒప్పించే పనిలో పంజాబ్ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. మరోవైపు హెడ్ కోచ్‌గా మైకేల్ హస్సీని నియమించేందుకు చర్చలు జరుపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. హస్సీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.

img

భారత జట్టుకు హెడ్ కోచ్‌గా:

అనిల్ కుంబ్లే గతంలో ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లకు మెంటార్‌గా వ్యవహరించాడు. ఇక భారత జట్టుకు ఏడాది పాటు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా కుంబ్లే తన పదవికి రాజీనామా చేసాడు. కుంబ్లే నేతృత్వంలో టీమిండియా విండీస్‌ పర్యటనలో అద్భుతంగా రాణించింది. స్వదేశంలోనూ 2016-2017 సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అయితే 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో పాక్‌ చేతిలో టీమిండియా ఓడిపోయింది.

img

భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు:

టీమిండియా కోచ్‌ పదవి నుంచి వైదొలిగాక కుంబ్లే మరెక్కడా కోచ్‌గా పనిచేయలేదు. ఇప్పుడు పంజాబ్‌ జట్టు బాధ్యతలు తీసుకుని మరోసారి నిరూపించుకునేందుకు సిద్దమయ్యాడు. కుంబ్లే 132 టెస్టుల్లో 619, 271 వన్డేల్లో 337 వికెట్లు సాధించాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో, వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కుంబ్లే ఉన్నాడు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN