యువ ఆటగాళ్లకు పరీక్ష

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-11-03 02:06:37

img

న్యూఢిల్లీ, నవంబర్ 2: తమను తాము నిరూపించుకోవడానికి టీమిండియాలోని యువ ఆటగాళ్లు కఠిన పరీక్షను ఎదుర్కోనున్నారు. బంగ్లాదేశ్‌తో ఆదివారం ఇక్కడి అరుణ్ జైట్లీ (్ఫరోజ్ షా కోట్లా) స్టేడియంలో జరిగే మొదటి టీ-20 కోసం టీమిండియా అన్ని విధాలా సన్నద్ధమైంది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టులో యువ ఆటగాళ్లు తమతమ స్థానాలను పదిలం చేసుకోవడానికి, సీనియర్లు తమ ఫామ్‌లోకి రావడానికి లేదా ఫామ్‌ను కొనసాగించడానికి ఈ సిరీస్‌ను వేదికంగా ఎంచుకున్నారు. అయితే, ఆటగాళ్లను ఢిల్లీ కాలుష్యం తీవ్రంగా వేధిస్తున్నది. దీపావళి అనంతరం ఢిల్లీలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు ఎవరూ ఈ విషయంపై మాట్లాడకపోయినప్పటికీ, వారు అసౌకర్యంగా ఉన్నారని అర్థమవుతున్నది. బంగ్లాదేశ్ క్రీడాకారులు ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ మాస్క్‌లు ధరించే ఉన్నారు. వారిని కాలుష్యం ఒకవైపు వేధిస్తుండగా, కీలక ఆటగాడు, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నించిన బుకీలు తనను కలిసిన విషయాన్ని గోప్యంగా ఉంచి, నిబంధనలను ధిక్కరించాడన్న ఆరోపణలు అతనిపై ఉన్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీనితో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు.
ఇరు జట్లు యుద్ధానికి పూర్తి సిద్ధంగా ఉండగా, భారత్‌ది కొంత పైచేయిగా కనిపిస్తున్నది. ముంబయి ఆల్‌రౌండర్ శివమ్ డూబే, మహారాష్ట్ర ఆటగాడు శార్దూల్ ఠాకూర్, రాజస్థాన్‌కు చెందిన దీపక్ చాహర్ ఏ విధంగా రాణిస్తారనేది చూడాలి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ-20 వరల్డ్ జరగనుంది. ఆలోగా టీమిండియా ఈ ఫార్మాట్‌లో 20 మ్యాచ్‌లు ఆడుతుంది. కాబట్టి, అటు యువ ఆటగాళ్లకు, ఇటు సీనియర్లకు ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఎంత మంది యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కల్పిస్తారన్నది ఆసక్తిరేపుతున్నది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్ శర్మ అసాధారణమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగినటెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన అతను అదే ఫామ్‌తో బంగ్లాదేశ్‌పై విరుచుకుపడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, అతనితోపాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే శిఖర్ ధావన్ ఫామ్ గురించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్‌లో జరిగిన వనే్డ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్‌లో ఆడుతున్నప్పుడు బొటనివేలికి గాయమైన కారణంగా ధావన్ కొంత కాలంగా జట్టుకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్‌లో అతను 36, 40 చొప్పున పరుగులు చేశాడు. గత వారం ముగిసిన విజయ్ ట్రోఫీ ఈవెంట్‌లోనూ అతను పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే, అతని ఫామ్‌పై అభిమానులతోపాటు, జట్టు మేనేజ్‌మెంట్‌లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, కృణాల్ పాండ్య, స్థానిక స్టార్ రిషభ్ పంత్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడడం ఖాయంగా కనిపిస్తున్నది. భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న శివమ్ డూబే అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. మనీష్ పాండే, సంజూ శాంసన్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ తదితరులు మిగతా స్థానాల కోసం పోటీపడాల్సి ఉంటుంది. మొత్తం మీద టీమిండియా ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉండడంతో, వీరి అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకోవడానికి మహమ్మదుల్లా రియాద్ నాయకత్వంలోని బంగ్లాదేశ్ ప్రయత్నించనుంది. జట్టులో తైజుల్ ఇస్లాం, మహమ్మద్ మిథున్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీం, అమీనుల్ ఇస్లాం, ముస్త్ఫాజుర్ రహ్మాన్, సైఫుల్ ఇస్లాం వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. భారత గడ్డపై టీమిండియాకు వీరు ఏ విధమైన పోటీనిస్తారో చూడాలి.

*చిత్రం... బ్యాటింగ్ కోచ్‌తో సంజూ శాంసన్

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD