రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లాంఛనమే..

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-09-26 02:59:54

img

వరంగల్, సెప్టెంబర్ 26: ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్పలో రెండో రోజూ యునెస్కో బృందం పర్యటన కొనసాగింది. బృందం సభ్యులు గురువారం ఉదయం 10 గంటలకు రామప్పకు చేరుకున్నారు. మొదట యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యనందనతో పాటు అధికారుల బృందం ప్రధాన ఆలయంతో పాటు పరివార ఆలయాలను రెండో రోజు అణువణువూ పరిశీలించి వీడియోలు, ఫొటోలు చిత్రీకరించారు. మొదటి రోజు పరిశీలించిన ఆలయాలను మరోసారి తీక్షణంగా పరిశీలించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆలయాల పరిశీలన పూర్తయిన వెంటనే మధ్యాహ్న భోజనం అనంతరం సరస్సు పరిశీలనకు వెళ్లి కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్‌లతో కలిసి యునెస్కో బృందం సరస్సులో బోటింగ్ చేశారు. సుమారు నాలుగు గంటలకు పైగా యునెస్కో బృందం రామప్పలో వివరాలను సేకరించారు. తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. బుధ, గురువారం ఆలయాన్ని సందర్శించిన యునెస్కో బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు యునెస్కో గుర్తింపునకు రామప్ప చేరువలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. రామప్ప యునెస్కోకు ఎంపిక కావడం లాంఛనమేననే సంకేతాలు కూడా వెలువడ్డాయి. మొదటి రోజే వాసు పోశ్చనందన రామప్ప శిల్ప సంపదను ప్రశంసించడమే కాక కాకతీయుల అద్భుత కట్టడాలకు మంచి రోజులు వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు వినికిడి. ఇప్పటికే దేశం నుండి కేవలం రామప్ప దేవాలయాన్ని మాత్రమే యునెస్కో ఎంట్రీకి వెళ్లగా కచ్చితంగా రామప్పకు అరుదైన గౌరవం దక్కుతుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేశారు. యునెస్కో బృందం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. యునెస్కో ప్రతినిధి పోశ్యనందన వెంట ఏడీజీ జాన్ విచ్‌శర్మ, రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ దినకర్‌బాబు, మిలన్ కుకుడ్‌చావలే, డీడీ నారాయణ, స్మితాకుమారి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, చూడామణి నందగోపాల్, డీటీవో శివాజీ, ములుగు డీఎస్పీ విజయసారథి, స్థానిక సర్పంచ్ డోలి రజిత శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

*చిత్రాలు.. సరస్సుపై ఫొటోలు తీస్తున్న యునెస్కో ప్రతినిధులు
* ఆలయ శిల్పసంపద వివరాలు తెలుసుకుంటున్న దృశ్యం

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD