రేపటి నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌

Prajasakti

Prajasakti

Author 2019-10-01 04:09:52

img

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో:
భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు రోజులు పాటు జరగనున్న తొలిటెస్టు మ్యాచ్‌కు ఎసిఎ-విడిసిఎ మైదానం సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా రెండోసారి టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహించనుండటంతో గత అనుభవంతో పిచ్‌ను తయారు చేశారు. వాతావరణం చల్లగా ఉండటం వల్ల పిచ్‌ మెత్తబడే అవకాశం ఉండటంతో బంతి వేగంగా దూసుకెళ్లే విధంగా పిచ్‌ను మార్పు చేశారు. గతంలో ఇంగ్లండ్‌తో భారత్‌ జట్టు ఈ మైదానంలోనే టెస్టు మ్యాచ్‌ ఆడి భారీ విజయం సాధించింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరగ్గా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. విశాఖ వేదికగా జరగనున్న టెస్టు మ్యాచ్‌కు ముందు విజయనగరంలో నిర్వహించిన సన్నాహాక టెస్టు మ్యాచ్‌లో కూడా ఫలితం టైగా వచ్చింది. దీంతో రెండోతేదీ నుంచి ఆరో తేదీ వరకూ ఐదు రోజులు పాటు విశాఖలో జరగనున్న టెస్టు మ్యాచ్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టెస్టు మ్యాచ్‌కు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. పిఎంపాలెంలోని గ్రౌండ్‌-బిలో ఇరుజట్ల సోమవారం క్రీడాకారులు సాధన చేశారు. విశాఖ వేదికగా తొలిసారి టెస్టు ఆడునున్న సఫారీలు విజయం సాధించాలన్న కసి గత రెండు రోజులు చేసిన నెట్‌ ప్రాక్టీసులో కనిపించింది. ఎండలో సైతం శ్రమించి సాధన చేశారు. విశాఖ వేదికగా జరిగిన గత టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్‌ జట్టు కూడా ఈ టెస్టులో తమకు కలిసొచ్చిన ఈ మైదానంలో విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ టెస్టు మ్యాచ్‌కు సంబంధించి ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాలు చేయగా గతంలో జరిగిన టెస్టు మ్యాచ్‌తో పోల్చితే ఈ టెస్టు మ్యాచ్‌లో టిక్కెట్లు ఎక్కువగానే విక్రయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల మధ్య జరిగిన టెస్టుకు 35 శాతం టిక్కెట్లు విక్రయించగా ఈసారి భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న టెస్టు మ్యాచ్‌కు 50 శాతం టిక్కెట్ల విక్రయాలు జరిగినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN