రోహిత్‌ కుదురుకుంటే మోతే..

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-02 07:15:00

- హిట్‌మ్యాన్‌ను సెహ్వాగ్‌తో పోల్చిన విరాట్‌ కోహ్లీ

విశాఖపట్నం: టెస్టు ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా కుదురుకుంటే.. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలోపేతం అవుతుందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో టన్నుల కొద్ది పరుగులు చేస్తున్న రోహిత్‌ ఎర్రబంతిపైనా తన ప్రతాపం చూపగలిగితే.. మరో సెహ్వాగ్‌లా జట్టుకు అద్భుత ఆరంభాలు అందివ్వగలడని విరాట్‌ పేర్కొన్నాడు. ‘రోహిత్‌ టెస్టుల్లోనూ తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ కొనసాగిస్తే.. భారత బ్యాటింగ్‌ లైనప్‌ మరింత ప్రమాదకరంగా మారుతుంది. రోహిత్‌ ఒక్కసారి లయ అందుకుంటే ప్రపంచంలోని ఏ మైదానంలోనైనా అతడిని ఆపడం కష్టం. అంతేకాదు మొత్తం జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ స్వరూపమే మారిపోతుంది. అయితే ఇప్పటికిప్పుడు రోహిత్‌ దడదడలాడించాలని మేం కోరుకోవడం లేదు. స్వదేశంలో ఆడేటప్పుడు, విదేశీ సిరీస్‌ల్లో రెండు వేర్వేరు ప్రణాళికలుంటాయి. ఓపెనింగ్‌ చేసే ప్లేయర్‌కు అతడి ఆటపై అవగాహన వచ్చేవరకు సమయమివ్వాలని అనుకుంటున్నాం.

టెస్టుల్లో నేను ఆరోస్థానం నుంచి మొదలు పెట్టాను. ప్రస్తుతం నాలుగుకు వచ్చాను. పరిస్థితులను అలవాటు పర్చుకోవడం ప్రారంభిస్తే ఏదీ కష్టం కాదు. చక్కటి స్ట్రోక్‌ప్లేతోమ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడమే రోహిత్‌ బలం. గతంలో వీరూ భాయ్‌ (వీరేంద్ర సెహ్వాగ్‌) ఎన్నో ఏండ్లు టీమ్‌ఇండియాకు ఇదే పనిచేశాడు. సెహ్వాగ్‌కు దూకుడుగా ఆడి లంచ్‌కు ముందు సెంచరీ చేయమని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది అతడి సహజసిద్ధ శైలి. రోహిత్‌ కూడా అంతే. అతడిలోనూ అదే సామర్థ్యం ఉంది. పరీక్ష పెడుతున్న పిచ్‌పై ఆచితూచి ఆడటం కూడా రోహిత్‌కు తెలుసు. టెస్టుల్లో రోహిత్‌తో ఓపెనింగ్‌ చేయించాలని ఎప్పటినుంచో అనుకుంటే ఇప్పటికి కుదిరింది’ అని కోహ్లీ వివరించాడు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN