రోహిత్‌ డబుల్‌ ధమాకా

Prajasakti

Prajasakti

Author 2019-10-21 12:33:43

img

- రహానే సెంచరీ
- భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 497/9 డిక్ల్లేర్డ్‌
- కష్టాల్లో సఫారీలు
రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు మూడో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆటలో రోహిత్‌ శర్మ (212) డబుల్‌ సెంచరీ, అంజిక్యా రహానే (115) శతకాలతో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద డిక్లైర్డ్‌ చేసింది. తరువాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు నష్టానికి 9 పరుగులు చేసి కష్టాల్లో ఉంది.
రోహిత్‌ తొలి డబుల్‌ సెంచరీ
3 వికెట్ల నష్టానికి 224 పరుగుల ఓవర్‌నైట్‌తో స్కోరు ఆదివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌-రహానే జోడీ కదం తొక్కించింది. అయితే జట్టు స్కోరు 300 దాటి తరువాత అంటే 306 పరుగుల వద్ద రహానే నాలుగో వికెట్‌గా అవుటయ్యాడు. 192 బంతులు ఎదుర్కొన్న రహానే సిక్స్‌, 17 ఫోర్లతో 115 పరుగులు చేశాడు. రోహిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 267 పరుగుల భాగస్వామ్యాన్ని రహానే నమోదు చేశాడు. ఈ దశలో రోహిత్‌కు రవీంద్ర జడేజా జత కలిశాడు. ఈ క్రమంలోనే రోహిత్‌ తన కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. 199 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రోహిత్‌, లంచ్‌ తర్వాత ద్విశతకం సాధించాడు. లంచ్‌ తర్వాత ఎన్‌గిడి బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి డబుల్‌ సెంచరీ అందుకున్నాడు. అయితే ఈ తరువాత జట్టు స్కోరు 370 పరుగుల వద్ద రోహిత్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. 255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 212 పరుగులు చేసిన రోహిత్‌ ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. రబడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రోహిత్‌ ఔటయ్యాడు. ఎన్‌గిడి క్యాచ్‌ పట్టడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. రోహిత్‌ అవుట్‌తో సాహా క్రీజ్‌లోకి వచ్చాడు. సాహా 24 పరుగుల చేసి 6వ వికెట్‌గా అవుటయ్యాడు. ఈ తరువాత రవీంద్ర జడేజా హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత జడేజా ఔటయ్యాడు. 119 బంతుల్లో నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసిన జడేజా జట్టు స్కోరు 450 వద్ద ఏడో వికెట్‌గా అవుటయ్యాడు. జడేజాకు ఇది టెస్టుల్లో 13వ అర్థ శతకం.
ఒకే సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు
రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీతో భారత క్రికెట్‌ జట్టు సుదీర్ఘం విరామం తర్వాత అరుదైన ఘనతను లిఖించుకుంది. ఒక్క సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనతను 64 ఏళ్ల తర్వాత భారత్‌ నమోదు చేసింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌, రెండో టెస్టులో కోహ్లి డబుల్‌ సెంచరీలు చేయగా, చివరి టెస్టులో రోహిత్‌ డబుల్‌ సెంచరీ సాధించాడు. గతంలో 1955-56లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత్‌ జట్టు మూడు డబుల్‌ సెంచరీలు సాధించింది. ఆ సిరీస్‌లో వినోద్‌ మన్కడ్‌ రెండు డబుల్‌ సెంచరీలు సాధించగా, పాలీ ఉమ్ర్‌గర్‌ ద్విశతకం చేశాడు. ఆ సిరీస్‌ తర్వాత ఒకే సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. అలాగే రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో, వన్డేల్లో డబుల్‌ సెంచరీలు సాధించిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లఓ ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. భారత్‌ నుంచి సచిన్‌, సెహ్వాగ్‌ రెండు ఫార్మాట్లలో డబుల్‌ సెంచరీ సాధించగా, వెస్టిండీస్‌ హిట్టర్‌ క్రిస్‌ గేల్‌ కూడా టెస్టు, వన్డే ఫార్మాట్‌లో డబుల్‌ సెంచరీ చేశాడు. అయితే వీరీలో వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేసిన ఘనత రోహిత్‌కు మాత్రమే ఉంది. అలాగే ఒక సిరీస్‌లో 500 పరుగులకు పైగా సాధించిన ఐదో భారత ఓపెనర్‌గా రోహిత్‌ రికార్డులకు ఎక్కాడు. వినోద్‌ మన్కడ్‌, కుందేరేన్‌, సునీల్‌ గావస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌లో గతంలో ఒక్క సిరీస్‌లో ఐదు వందలకు పైగా సాధించిన భారత ఓపెనర్లు.

కష్టాల్లో సఫారీలు
తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమాయానికి 2 వికెట్ల నష్టానికి 9 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్‌ ఎల్గర్‌, డీకాక్‌లు విఫలమయ్యారు. తొలి వికెట్‌గా ఎల్గర్‌ డకౌట్‌గా నిష్క్రమించితే, రెండో వికెట్‌గా డీకాక్‌ ఔటయ్యాడు. డీన్‌ ఎల్గర్‌ను షమీ ఔట్‌ చేస్తే, డీకాక్‌ను ఉమేశ్‌ యాదవ్‌ పెవిలియన్‌కు పంపించాడు. అయితే ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరడంలో వికెట్‌ కీపర్‌ సాహాది కీలక పాత్ర. ఎల్గర్‌ గ్లౌవ్‌ను తగిలి ఎత్తులో వచ్చిన బంతిని సాహా అద్భుతమైన రీతిలో అందుకోకున్నాడు. రెండో ఓవర్‌ చివరి బంతిని ఉమేశ్‌ లెగ్‌స్టంప్‌పై బౌన్స్‌ చేయగా అది డీకాక్‌ గ్లౌవ్‌ను తాకింది. దీంతో అమాంతం ఎగిరిన సాహా దాన్ని క్యాచ్‌గా పట్టుకున్నాడు.

ఉమేశ్‌ యాదవ్‌ ధనాధన్‌
జడేజా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌ వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. జార్జ్‌ లిండే వేసిన 112 ఓవర్‌ ఐదు, ఆరు బంతుల్ని సిక్సర్లుగా కొట్టిన ఉమేశ్‌, లిండే వేసిన 114 ఓవర్‌ తొలి బంతిని, మూడో, ఐదో బంతిని సైతం సిక్స్‌ కొట్టాడు. అయితే ఆ ఓవర్‌ చివరి బంతికి ఔటయ్యాడు. 10 బంతుల్లో ఐదు సిక్సర్లుతో 31 పరుగులు చేసిన ఉమేశ్‌(31) తొమ్మిదో వికెట్‌గా ఔటయ్యాడు. ఈ క్రమంలో మూడో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి రెండు బంతుల్నీ సిక్స్‌లుగా మలిచిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 1948లో ఫాఫీ విలియమ్సన్‌, 2013 సచిన్‌ ఈ విధంగా చేశారు. అలాగే 30 పరుగుల్ని వేగవంతంగా సాధించిన జాబితాలో ఉమేశ్‌ టాప్‌లో నిలిచాడు. గతంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆటగాడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ 30 పరుగుల్ని 10 బంతుల్లో సాధిస్తే దాన్ని ఉమేశ్‌ అధిగమించాడు. అలాగే ఆదివారం ఆటలో ఉమేశ్‌ యాదవ్‌ స్ట్రేక్‌రైట్‌ 310. టెస్టు చరిత్రలో 10కి పైగా బంతుల్లో ఇదే అత్యధిక స్ట్రైక్‌ రేట్‌. భారత్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసే సమయానికి షమీ(10 నాటౌట్‌), నదీమ్‌(1 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు.

imgimg
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD