రోహిత్‌ రికార్డుల హోరు

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-06 04:50:00

img

- ఓపెనర్‌గా తొలిటెస్టులో రెండు సెంచరీలతో రికార్డు నమోదు
- ఒకే టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ఘనత
- రోహిత్‌శర్మ మెరుపు సెంచరీ
- రెండో ఇన్నింగ్స్‌ 323/4 డిక్లేర్డ్‌.. సఫారీల లక్ష్యం 395.. ప్రస్తుతం 11/1శనివారం విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ రికార్డులతో హోరెత్తించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి టెస్టులోనే రెండు శతకాలు బాదిన మొదటి బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. దీనికి తోడు ఒక టెస్ట్‌లో అత్యధిక సిక్సర్లు (13) కొట్టి రికార్డు తిరగరాశాడు.

ఏమా కొట్టుడు.. ఏమా కొట్టుడు.. జట్టు యాజమాన్యం ఎలాంటి ఇన్నింగ్స్‌ కోరుకుందో అచ్చం అలాంటి ఆటతీరుతో నయా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌ డబుల్‌ సెంచరీ హీరో మయాంక్‌ త్వరగానే ఔటైనా.. పుజారాతో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అలాఇలా కాదు. వన్డేను తలపిస్తూ విధ్వంసకాండ సృష్టించిన హిట్‌మ్యాన్‌.. ఫార్మాట్‌ ఏదైనా తాను ఓపెన్‌ చేస్తే ఎంత ప్రమాదకరమో ప్రత్యర్థికి చాటిచెప్పాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్‌ కూడా తలో చేయి వేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ భారీ స్కోరు చేసింది.ఇటు 9 వికెట్లు.. అటు 384 పరుగులు.. విశాఖ టెస్టు విజయసమీకరణం ఇది. పరుగుల వరద పారుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలువాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. దక్షిణాఫ్రికా నెగ్గాలంటే ఇంకా 384 పరుగులు చేయాలి.ఉపఖండపు పిచ్‌లపై నాలుగో ఇన్నింగ్స్‌లో 200 టార్గెట్‌ ఛేదించేందుకునానా తంటాలు పడుతుంటే.. అందుకు రెండింతల లక్ష్యాన్ని ఛేజ్‌ చేయడం మామూలు విషయం కాదు. గత రెండు దశాబ్దాలుగా భారత పిచ్‌లపై 200 పైచిలుకు టార్గెట్‌ను ఏ జట్టూ ఛేదించలేదు. ఇక మిగిలిందల్లా మధ్యేమార్గం.. ఆలౌట్‌ కాకుండా రోజంతా బ్యాటింగ్‌ చేయడం. ప్రపంచ స్థాయి స్పిన్నర్లను ఎదుర్కొంటూ చివరి రోజు 90 ఓవర్ల పాటు నిలువగలిగితే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌ను ‘డ్రా’చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
img
విశాఖపట్నం: పరుగుల వరద పారుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా మెరుగైన స్థితిలో నిలిచింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓపెనర్‌ అవతారమెత్తిన రోహిత్‌ శర్మ (149 బంతుల్లో 127; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగగా.. చతేశ్వర్‌ పుజారా (81; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో భారత్‌ 67 ఓవర్లలోనే 4 వికెట్లకు 323 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. 395 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా శనివారం ఆట ముగిసే సమయానికి ఎల్గర్‌ (2) వికెట్‌ కోల్పోయి 11 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో 9 వికెట్లు ఉన్న సఫారీలో ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. మార్క్మ్‌ (3), డిబ్రుయన్‌ (5) క్రీజులో ఉన్నారు.

బ్రేక్‌ ఇచ్చిన జడ్డూ..

భారీ లక్ష్య ఛేదనకు బరిలో దిగిన దక్షిణాఫ్రికాకు.. జడేజా (1/3) గట్టిదెబ్బ కొట్టాడు. ప్రొటీస్‌ జట్టు శనివారం బ్యాటింగ్‌ చేసింది అరగంటే అయినా అందులోనే కీలకమైన ఎల్గర్‌ వికెట్‌ కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్‌లో సఫారీలు గెలువాలంటే 90 ఓవర్ల పాటు భారత బౌలింగ్‌కు ఎదురు నిలిచి అద్భుతం చేయాలి. ఈ నేపథ్యంలో ఆఖరిరోజు ఇరుజట్ల మధ్య రసవత్తర పోరు ఖాయమే. సఫారీలు విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలో దిగుతారా లేక ‘డ్రా’కోసం ప్రయత్నిస్తారా అనేది ఆసక్తికరం.
img
భారత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభమైన తీరు చూస్తే.. మ్యాచ్‌ ‘డ్రా’కావడం ఖాయమే అనిపించింది. నాలుగో రోజు తొలి గంట ప్రత్యర్థి బ్యాటింగ్‌ చేయగా.. లంచ్‌లోపు టీమ్‌ఇండియా మయాంక్‌ (7) వికెట్‌ కోల్పోయి కేవలం 35 పరుగులే చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా తన స్లో స్ట్రయిక్‌రేట్‌తో అభిమానులను విసిగించాడు. ఆరంభంలో అతడు ఎదుర్కొన్న 62 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశాడు. దీంతో భారత్‌ ‘డ్రా’కోసం ఆడుతున్నట్లే అనిపించింది. కానీ డ్రింక్స్‌ బ్రేక్‌లో కెప్టెన్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో బ్యాటింగ్‌ రూపురేఖలు మారిపోయాయి. ఎడాపెడా బౌండ్రీలు బాదిన ఈ జోడీ స్కోరుబోర్డును పరుగులు పెట్టించింది. రోహిత్‌ 72 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంటే.. పుజారా వరుస ఓవర్లలో రెండేసి ఫోర్లతో దూకుడు పెంచాడు. మరోసారి కేశవ్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన చతేశ్వర్‌.. మిడ్‌వికెట్‌ మీదుగా సిక్సర్‌ కొట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రబాడ ఓవర్‌లో ఫోర్‌తో అర్ధశతకం పూర్తిచేసుకున్న పుజారా.. అతడికి మరో రెండు బౌండ్రీలు రుచి చూపించాడు.

మరో ఎండ్‌లో రోహిత్‌ కూడా వరుస బౌండ్రీలతో విజృంభించడంతో రెండో సెషన్‌లో భారత్‌ 140 పరుగులు పిండుకుంది. టీ బ్రేక్‌ తర్వాత పుజారా ఔటవడంతో రెండో వికెట్‌కు నమోదైన 169 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 133 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ ఆ తర్వాత పీట్‌ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో మరింత వేగం పెంచాడు. మరోవైపు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కెప్టెన్‌ కోహ్లీ (31 నాటౌట్‌) కంటే ముందొచ్చిన జడేజా (32 బంతుల్లో 40; 3 సిక్సర్లు) మూడు సిక్సర్లు బాదాడు. రహానే (27 నాటౌట్‌) కూడా వేగంగా ఆడటంతో భారత్‌ ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

మరో 46 పరుగులు..

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 385/8తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 46 పరుగులు చేసి మిగిలిన 2 వికెట్లు కోల్పోయింది. ముత్తుస్వామి (33), రబాడ (15) విలువైన రన్స్‌ జత చేశారు. గంటపాటు భారత బౌలర్లను విసిగించిన వీరిద్దరూ.. చివరి వికెట్‌కు 35 పరుగులు జోడించారు. దీంతో టీమ్‌ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగుల ఆధిక్యమే దక్కింది. నాలుగో రోజు పడ్డ రెండు వికెట్లు అశ్విన్‌ (7/145) ఖాతాలోకే వెళ్లాయి.
img
దసరా పండుగ సెలవులకు పిల్లలు అమ్మమ్మ, నానమ్మ ఇండ్లకు వెళ్లి.. ఆటపాటలతో సరదాగా గడిపిన చందంగా.. సరిగ్గా పండుగ సీజన్‌లో అమ్మమ్మ ఇైల్లెన వైజాగ్‌కు వచ్చిన రోహిత్‌ శర్మ పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. సంప్రదాయ క్రికెట్‌లో ఓపెనర్‌గా నయా అవతారమెత్తిన హిట్‌మ్యాన్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో అలరించాడు. అలాంటి ఇలాంటి సెంచరీ కాదు వన్డే తరహాలో దూకుడుతో కూడిన ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయంటే రోహిత్‌ జోరు ఏ రేంజ్‌లో సాగిందో అర్థంచేసుకోవచ్చు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. ఓపెనర్‌గా బరిలో దిగిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కిన రోహిత్‌.. ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు (13) కొట్టిన ప్లేయర్‌గా.. పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ వసీమ్‌ అక్రమ్‌ (12 సిక్సర్లు, 1996లో జింబాబ్వేపై)ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో పాటు ఓపెనర్‌గా తొలి టెస్టులోనే 303 పరుగులు బాదిన హిట్‌మ్యాన్‌ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. సెంచరీ వరకు ఒక రేంజ్‌లో ఆడిన రోహిత్‌.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పీట్‌ ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లు అరుసుకున్నాడు. స్లోవర్‌ డెలివరీని లాంగ్‌ఆన్‌ మీదుగా స్టాండ్స్‌లో పడేసిన తీరైతే అమోఘం. స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం కనబర్చిన రోహిత్‌.. పదే పదే క్రీజు వదిలి బయటకు వస్తూ కచ్చితమైన టైమింగ్‌తో పరుగులు రాబట్టాడు.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 502/7 డిక్లేర్డ్‌,
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 431,
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) డుప్లెసిస్‌ (బి) కేశవ్‌ 7, రోహిత్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) కేశవ్‌ 127, పుజారా (ఎల్బీ) ఫిలాండర్‌ 81, జడేజా(బి) రబాడ 40, కోహ్లీ (నాటౌట్‌) 31, రహానే (నాటౌట్‌) 27, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 67 ఓవర్లలో 323/4 డిక్లేర్డ్‌. వికెట్ల పతనం: 1-521, 2-190, 3-239, 4-286, బౌలింగ్‌: ఫిలాండర్‌ 12-5-21-1, కేశవ్‌ 22-0-139-2, రబాడ 13-3-41-1, పీట్‌ 17-3-102-0, ముత్తుస్వామి 3-0-20-0.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్మ్‌ (నాటౌట్‌) 3, ఎల్గర్‌ (ఎల్బీ) జడేజా 2, డిబ్రుయన్‌ (నాటౌట్‌) 5, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 9 ఓవర్లలో 11/1. వికెట్ల పతనం: 1-4, బౌలింగ్‌: అశ్విన్‌ 5-2-7-0, జడేజా 4-2-3-1.

1 ఓపెనర్‌గా ఆడిన తొలి టెస్టులోనే అత్యధిక పరుగులు (303) చేసిన ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు.

1 భారత్‌ తరఫున టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా రోహిత్‌ చరిత్రకెక్కాడు. 2013లో ఆస్ట్రేలియాపై వన్డేలో 15 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్‌.. 2017లో శ్రీలంకపై టీ20 మ్యాచ్‌లో10 సిక్సర్లు కొట్టాడు.

1 ఒకే టెస్ట్‌ మ్యాచ్‌లో రెండు సార్లు స్టంపౌటైన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ చరిత్రలో ఇలా జరుగడం 22వ సారి. హిట్‌మ్యాన్‌ ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్టంపౌట్‌ కాకపోవడం విశేషం.

27 ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ కొట్టిన సిక్స్‌లు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఓ జట్టుకు ఇవే అత్యధికం. న్యూజిలాండ్‌ (22) రెండో స్థానానికి చేరింది.

1 ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌శర్మ రికార్డుల్లోకెక్కాడు.

6 ఒక టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన ఆరో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఇంతకుముందు విజయ్‌ హజారే, గవాస్కర్‌, ద్రవిడ్‌, కోహ్లీ, రహానే ఈ ఫీట్‌ నమోదు చేశారు.

13 ఈ మ్యాచ్‌లో రోహిత్‌ కొట్టిన సిక్సర్ల సంఖ్య. టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇవే అత్యధికం. పాకిస్థాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ వసీమ్‌ అక్రమ్‌ (12 సిక్సర్లు, 1996లో జింబాబ్వేపై)ను వెనక్కి నెట్టాడు.
READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN