రోహిత్.. అదే జోరు
దక్షిణాఫ్రికా ఎప్పటిలాగే టాస్ ఓడింది.. ఇక మొదట బ్యాటింగ్ తీసుకున్న భారత జట్టు షరా మామూలుగానే అద్భుత ఆరంభాన్ని అందిస్తుందని అంతా భావించారు.. కానీ సఫారీ పేసర్ల ధాటికి మయాంక్, పుజారా, కోహ్లీ కేవలం 39 పరుగులకే పెవిలియన్చేరాల్సి వచ్చింది. పరిస్థితి చూస్తుంటే ఈసారి పర్యాటక జట్టు గట్టి పోటీనే ఇస్తుందని ఊహించారు. కానీ సంచలన ఫామ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఓపెనర్ రో‘హిట్’ శర్మ మరోసారి టాప్ క్లాస్ ఆట తీరును ప్రదర్శించాడు. పరుగులు తీసేందుకు క్లిష్టంగా మారిన పిచ్‌పై ఓపికను ప్రదర్శిస్తూ ఏకంగా సిరీస్‌లో మూడో శతకాన్ని అలవోకగా బాదేశాడు. అతడికి రహానె చక్కటి అర్ధసెంచరీతో సహకారం అందించగా తొలి రోజు వర్షప్రభావిత ఆటలో భారత్‌దే పైచేయి అయింది.
- మూడో శతకం బాదిన ఓపెనర్
- రహానె సూపర్ ఇన్నింగ్స్
- భారత్ తొలి ఇన్నింగ్స్ 224/3
- దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు
రాంచీ: టెస్టు ఓపెనర్‌గా రోహిత్ శర్మ (164 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 బ్యాటింగ్) నిలకడైన ఆటతో అదరగొడుతున్నాడు. టాపార్డర్ కుప్పకూలిన వేళ అసమాన ఆటతీరుతో ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్ట వేశాడు. అజింక్యా రహానె (135 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 83 బ్యాటింగ్) కూడా భారీ స్కోరు వైపు సాగుతుండగా మూడో టెస్టు తొలిరోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు సాధించింది. అయితే వెలుతురు లేమి, భారీ వర్షం కారణంగా చివరి సెషన్లో ఆరు ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రోహిత్, రహానె మధ్య నాలుగో వికెట్‌కు అజేయంగా 185 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. మరోవైపు టాస్ వేసేందుకు డుప్లెసితో పాటు బవుమా వచ్చినా వారిని అదృష్టం వరించలేదు. భారత ఉపఖండంలో వరుసగా పదోసారి టాస్ ఓడింది. ఇక దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌కు ఏకంగా ఐదు మార్పులతో బరిలోకి దిగింది.
తొలి సెషన్ సఫారీలదే..: టాస్ ఓడి నిరుత్సాహంలో ఉన్న దక్షిణాఫ్రికాకు పేసర్లు రబాడ, నోర్టే ఊపునిచ్చారు. ముఖ్యంగా రబాడ కట్టుదిట్టమైన బంతులతో స్వింగ్ రాబడుతూ ఆధిక్యం చూపాడు. దీంతో ఐదో ఓవర్లోనే మయాంక్ (10) వెనుదిరగాల్సి వచ్చింది. స్లిప్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను ఎల్గర్ లాఘవంగా అందుకున్నాడు. అయితే తొలి వికెట్‌కు వైజాగ్ టెస్టులో 324, పుణె టెస్టులో 163 రన్స్ భాగస్వామ్యం లభించగా, ఈసారి కేవలం 16 పరుగులతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇదే ఊపులో రబాడ తొమ్మిదో ఓవర్లో పుజారాను కూడా డకౌట్ చేశాడు. అయితే అంపైర్ నుంచి స్పందన లేకపోవడంతో కెప్టెన్ డుప్లెసి డీఆర్ఎస్ కోరగా బంతి మిడ్ వికెట్‌ను తాకుతున్నట్టు తేలింది. అటు 11వ ఓవర్లో రోహిత్‌ను అదృష్టం వరించింది. రబాడ అతడిని ఎల్బీగా అవుట్ చేసినా రివ్యూలో బంతి బ్యాట్‌ను తాకినట్టు తేలి బతికిపోయాడు. ఇక డ్రింక్స్ విరామం తర్వాత సౌతాఫ్రికాకు గట్టి షాక్ ఇచ్చింది. రెండో టెస్టు ఆడుతున్న పేసర్ నోర్టే వేసిన బంతికి కోహ్లీ ఎల్బీ అయ్యాడు. రోహిత్‌తో పాటు రహానె మరో వికెట్ పడకుండా 71/3తో తొలి సెషన్‌ను ముగించారు.
రోహిత్, రహానె అదుర్స్: లంచ్ విరామం తర్వాత సీన్ పూర్తిగా మారింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో అప్పటిదాకా భయపెట్టిన సఫారీ బౌలర్లు ఈ సెషన్లో పూర్తిగా తేలిపోయారు. రోహిత్, రహానె చూడముచ్చటైన కవర్ డ్రైవ్స్‌తో బౌండరీల మోత మోగించారు. ముఖ్యంగా రోహిత్‌ను మించి రహానె జోరును ప్రదర్శించాడు. రోహిత్ కూడా తన హాఫ్ సెంచరీ తర్వాత సెహ్వాగ్‌ను తలపిస్తూ బ్యాట్‌ను ఝుళిపించసాగాడు. స్పిన్నర్ డేన్ పీట్‌ను లక్ష్యంగా చేసుకున్న అతడు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 45వ ఓవర్లో రోహిత్ కొట్టిన భారీ సిక్సర్‌తో కెరీర్లో ఆరో శతకాన్ని పూర్తి చేశాడు.
వర్షంతో బ్రేక్: చివరి సెషన్లో ఆట ఆరు ఓవర్లపాటే సాగింది. 58వ ఓవర్లో నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 185 పరుగులు వచ్చాక మ్యాచ్ ఆగింది. మధ్యాహ్నం 3 గంటల వేళ వెలుతురు పూర్తిగా మందగించడంతో ఆటను నిలిపివేశారు. మరో అరగంట తర్వాత భారీ వర్షం రావడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. దీంతో మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో దాదాపు 3.45 గంటలకు మిగిలిన ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో 32 ఓవర్ల ఆట కోల్పోవాల్సి వచ్చింది.
1 దక్షిణాఫ్రికా జట్టుపై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల (185) భాగస్వామ్యం అందించిన రోహిత్-రహానె. దీంతో ఇదే సిరీస్‌లో కోహ్లీ- రహానె (178) నెలకొల్పిన రికార్డు బద్దలైంది.
2 విదేశాల్లో ఒక్క సెంచరీ చేయకముందే స్వదేశంలోనే అధిక శతకాలు (6) చేసిన రెండో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. ఈ జాబితాలో బంగ్లాదేశ్ క్రికెటర్ మోమినుల్ హక్ (8) ముందున్నాడు.
1 ఓ టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ల నుంచి ఎక్కువ సెంచరీ (5)లు రావడం ఇదే తొలిసారి. 1970/71లో విండీ్‌సపై 4 సెంచరీలు నమోదయ్యాయి.
2 స్వదేశంలో డకౌట్ కావడం పుజారాకిది రెండోసారి మాత్రమే. గతంలో ఆసీస్ (2016/17)పై అవుటయ్యాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి) ఎల్గర్ (బి) రబాడ 10; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 117; పుజారా (ఎల్బీ) రబాడ 0; విరాట్ కోహ్లీ (ఎల్బీ) నోర్టే 12; రహానె (బ్యాటింగ్) 83; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 58 ఓవర్లలో 224/3. వికెట్ల పతనం: 1-12, 2-16, 3-39. బౌలింగ్: రబాడ 14-5-54-2; ఎన్గిడి 11-4-36-0; నోర్టే 16-3-50-1; లిండే 11-1-40-0; పీట్ 6-0-43-0.