రోహిత్ డబుల్ ధమాకా..

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-21 04:22:39

img

  • దక్షిణాఫ్రికాపై విరుచుకుపడ్డ భారత్
  • రహానె సెంచరీ
  • ఉమేశ్‌ సూపర్‌ షో .. దక్షిణాఫ్రికా 9/2
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 497/9 డిక్లేర్‌

స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ శివాలెత్తిపోతున్నాడు.. పరిమిత ఓవర్లలో ఎంత మొనగాడిగా పేరు తెచ్చుకున్నా సంప్రదాయ ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేయలేకపోయాడనే అపవాదును చెరిపేసుకుంటూ.. అందరి అంచనాలకు మించి మరీ చెలరేగుతున్నాడు. ఓపెనర్‌గా మారాక మైదానంలో పరుగుల సునామీతో విరుచుకుపడుతున్నాడు. తొలి టెస్టులో రెండు సెంచరీలు బాదిన హిట్‌మ్యాన్‌ ఈసారి కెరీర్‌లో మొదటిసారిగా డబుల్‌ సెంచరీతో వహ్వా అనిపించాడు. అంతేనా.. అతడి బ్యాట్‌ పరుగుల దాహానికి పలు రికార్డులు కూడా గల్లంతయ్యాయి. అటు అజింక్యా రహానె కూడా సెంచరీ సాధించగా భారత్‌ 500కు చేరువలో ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఇక ఆ తర్వాత మన పేసర్ల ధాటికి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయిన ప్రొటీస్‌ కష్టాల్లో పడింది.

వన్డేల్లో మూడుసార్లు డబుల్‌ సెంచరీ బాదిన రోహిత్‌కు టెస్ట్‌ల్లో ఇదే తొలి ద్విశతకం. వరుసగా మూడు టెస్టుల్లో భారత్‌ తరఫున మూడు డబుల్‌. సెంచరీలు నమోదు కావడం ఇది రెండోసారి. గతంలో ఇంగ్లండ్‌పై కోహ్లీ 235, కరుణ్‌ నాయర్‌ 303 నాటౌట్‌, కోహ్లీ 204 (బంగ్లాదేశ్‌పై) చేశారు. ఓ సిరీస్‌లో 500+కు పైగా పరుగులు సాధించిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌ రోహిత్‌. వినూ మన్కడ్‌, బుధి కుందరన్‌, గవాస్కర్‌ (5 సార్లు), సెహ్వాగ్‌ ముందున్నారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రెండుసార్లు 150+ రన్స్‌ చేసిన తొలి ఓపెనర్‌ రోహిత్‌. ఇదే జట్టుపై 500కు పైగా పరుగులు సాధించిన భారత ఆటగాడిగా అజరుద్దీన్‌ (1996/97లో 388 రన్స్‌) రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు.

రాంచీ: పాపం దక్షిణాఫ్రికా.. భారత బ్యాటింగ్‌ మెషీన్‌ రోహిత్‌ శర్మ (255 బంతుల్లో 28 ఫోర్లు, 6 సిక్సర్లతో 212) భీకర ఫామ్‌ను ఎలా అడ్డుకోవాలో తెలీక చేష్టలుడిగిపోతోంది. సిరీ్‌సలో చివరిదైన మూడో టెస్టు తొలి రోజున సాధించిన శతకాన్ని కళ్లు చెదిరే స్క్వేర్‌ కట్స్‌, పుల్‌ షాట్లతో అతడు రెండో రోజు ఆదివారం ఆటలో డబుల్‌ సెంచరీగా మలిచాడు. మరోవైపు రహానె (192 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్‌తో 115) కూడా శతకం పూర్తి చేయడంతో భారత్‌ 116.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 497 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. జడేజా (119 బంతుల్లో 4 ఫోర్లతో 51) అర్ధసెంచరీ సాధించాడు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ జార్జి లిండేకు నాలుగు, రబాడకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా వెలుతురులేమి కారణంగా బతికిపోయింది. ఆఖరి సెషన్‌లో 5 ఓవర్ల ఆట మాత్రమే సాగగా సఫారీలు రెండు వికెట్లకు 9 పరుగులు చేశారు. షమి (1/0), ఉమేశ్‌ (1/4) ధాటికి తొలి రెండు ఓవర్లలోనే ఎల్గర్‌ (0), డికాక్‌ (4) వికెట్లను కోల్పోయింది. క్రీజులో డుప్లెసి (1), హంజా (0) ఉన్నారు.

img: 224/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట సాగించిన భారత్‌ ఇన్నింగ్స్‌లో అదే దూకుడు కనిపించింది. 27 ఓవర్లపాటు సాగిన ఈ సెషన్‌లో రోహిత్‌, రహానె జోరుతో దాదాపు 5 పరుగుల రన్‌రేట్‌తో 133 పరుగులు సాధించింది. నాలుగున్నర గంటల పాటు క్రీజులో నిలిచిన ఈ ముంబై జంట నాలుగో వికెట్‌కు అత్యధికంగా 267 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచింది. 68వ ఓవర్‌లో రోహిత్‌ మూడు ఫోర్లు బాదగా తర్వాతి ఓవర్‌లోనే రహానె 169 బంతుల్లో కెరీర్‌లో 11వ సెంచరీ పూర్తి చేశాడు. అయితే 105 పరుగుల వద్ద రహానె స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్నా, కొద్దిసేపటికే జార్జి లిండే బౌలింగ్‌లో కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అటు రోహిత్‌ మాత్రం బౌండరీలతో చెలరేగుతూ లంచ్‌ విరామానికి 199 పరుగులతో నిలిచాడు.

ద్విశతకం పూర్తి: బ్రేక్‌ తర్వాత రోహిత్‌ శర్మ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయినా రవీంద్ర జడేజా అర్ధసెంచరీ, ఉమేశ్‌ యాదవ్‌ మెరుపులతో జట్టు భారీ స్కోరు చేయగలిగింది. విరామానంతరం ఎదుర్కొన్న తొలి ఓవర్‌ను రోహిత్‌ మెయిడెన్‌గా ఆడాడు. కానీ ఆ మరుసటి ఓవర్‌లో తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని మిడ్‌ వికెట్‌ వైపు భారీ సిక్సర్‌గా మలచడంతో 249 బంతుల్లో కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో మరో సిక్స్‌ బాదినా ఆ వెంటనే 89వ ఓవర్‌లో రబాడకు చిక్కడంతో సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాత జడేజా 118 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయగా సాహా (24), అశ్విన్‌ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.

యాదవ్‌ సిక్సర్ల హోరు.. విరాట్‌ చిందులు

6,6,0,1,6,0,6,0,6, w

imgరెండో రోజు భారత ఇన్నింగ్స్‌లో టెయిలెండర్‌ బ్యాట్స్‌మన్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆడిన తుఫాన్‌ ఆట తీరిది. 464/8 వద్ద తొమ్మిదో నెంబర్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన అతడు అనూహ్య ఆటతీరుతో పించ్‌ హిట్టర్‌గా మారి సిక్సర్ల వర్షం కురిపించాడు. స్పిన్నర్‌ జార్జి లిండేను లక్ష్యంగా చేసుకున్న ఉమేశ్‌ 10 బంతుల్లోనే ఐదు సిక్సర్లతో 31 పరుగులు సాధించాడు. 112వ ఓవర్‌లో జడేజాను లిండే అవుట్‌ చేయడంతో క్రీజులోకి వచ్చిన అతడు తానెదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆ తర్వాత లిండే మరుసటి ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది అతడికే దొరికిపోయాడు. నికార్సైన బ్యాట్స్‌మన్‌ తరహాలో సాగిన అతడి ఆటను కెప్టెన్‌ కోహ్లీ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి తిలకిస్తూ పులకించి పోయాడు. ఈ 10 బంతుల్లోనే ఉమేశ్‌ పలు రికార్డులను కూడా నెలకొల్పాడు.

ఉమేశ్‌ రికార్డుల మోత

టెస్టు మ్యాచ్‌లో ఉమేశ్‌ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌ బాది సచిన్‌, జహీర్‌, ధోనీ తర్వాత నిలిచాడు. ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచి సచిన్‌ సరసన ఉమేశ్‌ నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక స్ట్రయిక్‌ రేట్‌ (10 బంతుల్లో 310 స్ట్రయిక్‌ రేట్‌తో 31 పరుగులు)తో 30 ప్లస్‌ పరుగులు చేసిన ఆటగాడు కూడా ఉమేశ్‌ యాదవే.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: మయాంక్‌ అగర్వాల్‌ (సి) ఎల్గర్‌ (బి) రబాడ 10; రోహిత్‌ శర్మ (సి) ఎన్‌గిడి (బి) రబాడ 212; పుజారా (ఎల్బీ) రబాడ 0; విరాట్‌ కోహ్లీ (ఎల్బీ) నోర్టే 12; రహానె (సి) క్లాసెన్‌ (బి) లిండే 115; జడేజా (సి) క్లాసెన్‌ (బి) లిండే 51; సాహా (బి) లిండే 24; అశ్విన్‌ (స్టంప్‌) క్లాసెన్‌ (బి) పీట్‌ 14; ఉమేశ్‌ యాదవ్‌ (సి) క్లాసెన్‌ (బి) లిండే 31; నదీమ్‌ (నాటౌట్‌) 1; షమి (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: 116.3 ఓవర్లలో 497/9 డిక్లేర్‌. వికెట్ల పతనం: 1-12, 2-16, 3-39, 4-306, 5-370, 6-417, 7-450, 8-464, 9-482. బౌలింగ్‌: రబాడ 23-7-85-3; ఎన్‌గిడి 20-5-83-0; నోర్టే 24.3-5-79-1; లిండే 31-2-133-4; పీట్‌ 18-3-101-1.

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: ఎల్గర్‌ (సి) సాహా (బి) షమి 0; డికాక్‌ (సి) సాహా (బి) ఉమేశ్‌ యాదవ్‌ 4; హంజా (బ్యాటింగ్‌) 0; డుప్లెసి (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 5 ఓవర్లలో 9/2. వికెట్ల పతనం: 1-4, 2-8. బౌలింగ్‌: షమి 1-1-0-1; ఉమేశ్‌ యాదవ్‌ 1-0-4-1; షాబాజ్‌ నదీమ్‌ 2-2-0-0; జడేజా 1-0-1-0.

‘డాన్‌’ను అధిగమించి...

సొంత గడ్డపై రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ తీరు ఎదురులేకుండా సాగుతోంది. భారత్‌లో ఆడిన 18 ఇన్నింగ్స్‌ (12 టెస్టులు)లో అతను 99.84 సగటుతో 1,298 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు, ఐదు అర్ధసెంచరీలున్నాయి. దీంతో క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌నే అధిగమించాడు. ఆసీస్‌ గడ్డపై 33 టెస్టుల్లో 50 ఇన్నింగ్స్‌ ఆడిన డాన్‌ 98.22 సగటుతో 4322 పరుగులు సాధించాడు. దీంతో 10 అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ అత్యధిక సగటుతో నెంబర్‌వన్‌గా ఉన్నాడు.

ఒకే సిరీస్‌లో ముగ్గురు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీ్‌సలో పరుగుల వరద పారిస్తున్న భారత బ్యాట్స్‌మెన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఒకే సిరీ్‌సలో ముగ్గురు భారత ఆటగాళ్లు డబుల్‌ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. తొలి టెస్టులో మయాంక్‌, రెండో టెస్టులో విరాట్‌, తాజాగా రోహిత్‌ ఈ ఫీట్‌ సాధించారు. అయితే 1955/56లో కివీ్‌సతో జరిగిన సిరీ్‌సలోనూ మూడు డబుల్‌ శతకాలు నమోదయ్యాయి కాకపోతే వినూ మన్కడ్‌ ఒక్కడే 2 సార్లు డబుల్‌ సెంచరీ సాధించగా పాలీ ఉమ్రిగర్‌ మరోటి చేశాడు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD