రోహిత్ దూకుడు మామూలుగా లేదుగా!
ముంబై: దక్షిణాఫ్రికాతో విశాఖపట్టణంలో జరిగిన తొలి టెస్టులో సెంచరీలతో చెలరేగిన టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో కెరియర్ బెస్ట్ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 176, రెండో ఇన్నింగ్స్లో 127 పరుగులు చేసిన రోహిత్.. ఐసీసీ తాజా టెస్టు ప్లేయర్ ర్యాంకింగ్స్లో 36 స్థానాలు ఎగబాకి 17 స్థానానికి చేరుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తొలి డబుల్ సెంచరీ సాధించి 38 స్థానాలు ఎగబాకి కెరియర్ బెస్ట్ అయిన 25వ స్థానంలో నిలిచాడు.
విశాఖ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో 20, రెండో ఇన్నింగ్స్లో 31 (నాటౌట్) పరుగులు చేసిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఈసారి పాయింట్ల పట్టికలో దిగజారాడు. జనవరి 2018 తర్వాత తొలిసారి 900 పాయింట్ల కిందికి పడిపోయాడు. ఈ జాబితాలో టాప్ ట్యాంక్లో ఉన్న ఆసీస్ స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ కంటే 38 పాయింట్లు వెనుకబడిపోయాడు. గతేడాది డిసెంబరు తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో అశ్విన్ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు సంపాదించాడు. ఆల్రౌండర్లలో టాప్-5లో చోటు దక్కించుకున్నాడు. వైజాగ్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన పేసర్ మహ్మద్ షమీ 710 ర్యాంకింగ్ పాయింట్లతో 18వ స్థానం నుంచి 14 స్థానానికి చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీసిన రవీంద్ర జడేజా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.