విచారణ విషయం మాకు తెలీదు

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-31 06:52:24

  • బంగ్లా క్రికెట్‌ బోర్డు చీఫ్‌
  • షకీబల్‌కు అభిమానుల మద్దతు

ఢాకా: ఫిక్సింగ్‌ వ్యవహారంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ను గత పది నెలల నుంచి ఐసీసీ విచారిస్తున్న విషయం తమకు తెలీదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ స్పష్టం చేశారు. గతేడాది భారత బుకీ దీపక్‌ అగర్వాల్‌ మూడుసార్లు సంప్రదించిన విషయాన్ని షకీబల్‌ ఐసీసీ ఏసీయూకు తెలపకపోవడంతో రెండేళ్ల నిషేధం పడిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచిన ఈ వ్యవహారం బీసీబీకి తెలియకుండానే సాగడంతో ఐసీసీ ఎంత గోప్యత పాటించిందో అర్థమవుతోంది. ‘జనవరి నుంచి షకీబల్‌పై ఐసీసీ చేస్తున్న విచారణ గురించి నాతోపాటు బీసీబీలోని ఏ ఒక్కరికీ తెలీదు. ఏసీయూ నేరుగా షకీబల్‌తోనే మాట్లాడింది. ఇటీవలి ఆటగాళ్ల సమ్మెపై మాతో జరిపిన చర్చల సందర్భంగానే షకీబల్‌ ఈ విచారణ గురించి చెప్పాడు’ అని నజ్ముల్‌ హసన్‌ తెలిపారు.

కఠిన శిక్ష పడాల్సింది: మాజీలు

షకీబల్‌పై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అతడికి మరింత కఠిన శిక్ష పడాల్సిందని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అన్నాడు. నిబంధనల గురించి అవగాహన ఉన్నప్పటికీ అవినీతి సమాచారాన్ని షకీబల్‌ ఏసీయూకు తెలపకపోవడం విడ్డూరంగా ఉందని ఆసీస్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ డీన్‌ జోన్స్‌ అన్నాడు. ఆట కన్నా ఎవరూ ఎక్కువ కాదని షకీబల్‌ వ్యవహారంలో తెలిసొచ్చిందని పాక్‌ మాజీ క్రికెటర్‌ రమీజ్‌ రాజా అన్నాడు.

2023 ప్రపంచక్‌పనకు అతడే సారథి: మోర్తజా

షకీబల్‌ కచ్చితంగా వచ్చే వన్డే వరల్డ్‌క్‌పలో తమను ముందుండి నడిపిస్తాడని బంగ్లాదేశ్‌ వన్డే జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ మష్రఫే మోర్తజా ధీమా వ్యక్తం చేశాడు. 18 ఏళ్లుగా షకీబల్‌తో క్రికెట్‌ ఆడుతున్నానని, అతను లేకుండా మైదానంలో అడుగుపెట్టడాన్ని ఊహించలేకపోతున్నట్టు వికెట్‌ కీపర్‌ ముఫ్ఫికర్‌ రహీమ్‌ తెలిపాడు.

అభిమానుల ర్యాలీ

షకీబల్‌పై నిషేధం విధించగానే బంగ్లాదేశ్‌లో అభిమానులు భగ్గుమన్నారు. షకీబల్‌ స్వగ్రామమైన మగురాలో 700 మంది ఫ్యాన్స్‌ వీధుల్లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. ఇదంతా కుట్రలో భాగమని, వెంటనే నిషేధం ఎత్తివేయాలంటూ డిమాండ్‌ చేశారు.

ఎంసీసీకి గుడ్‌బై

ప్రఖ్యాత మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)కు చెందిన ప్రపంచ క్రికెట్‌ కమిటీ నుంచి షకీబల్‌ తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ఎంసీసీ తెలిపింది. 2017, అక్టోబరులో షకీబల్‌ ప్రపంచ క్రికెట్‌ కమిటీలో సభ్యుడిగా చేరి సిడ్నీ, బెంగళూరులో జరిగిన సమావేశాల్లో పాల్గొన్నాడు. ఈ కమిటీలో ప్రస్తుత, మాజీ ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా ఉంటారు. క్రికెట్‌లో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు ఏటా రెండుసార్లు కమిటీ సమావేశమవుతుంది.

తమీమ్‌నూ సంప్రదించాడు

బుకీ దీపక్‌ అగర్వాల్‌ బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను కూడా సంప్రదిం చాడని ఐసీసీ పేర్కొంది. షకీబల్‌తోపాటు మరో ఆరుగురు క్రికెటర్లను ఐసీసీ ఏసీయూ విచారించింది. ఈ సందర్భంగా అగర్వాల్‌ విషయాన్ని తమీమ్‌ వారికి చెప్పాడు. అయితే అప్పట్లోనే అతడి వాట్సాప్‌ నెంబర్‌ను బ్లాక్‌ చేయడంతో పాటు బీసీబీ ఏసీయూకు కూడా తమీమ్‌ సమాచారమిచ్చాడు. దీంతో తమీమ్‌కు ఏసీయూ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. కానీ విచారణ ఎదుర్కొన్న మిగతా నలుగురు ఆటగాళ్లెవరనేది తేలాల్సి ఉంది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN