విరాట్‌ ద్విశతక నాదం

Nava Telangana

Nava Telangana

Author 2019-10-12 04:30:32

- కింగ్‌ కోహ్లి ఏడో డబుల్‌ సెంచరీ
- జడేజా, రహానె అర్ధ శతకాలు
- సఫారీ టాప్‌ లేపిన సీమర్లు
- భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 601/5 డిక్లేర్డ్‌
- దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ 36/3
నవతెలంగాణ-పుణె
పరుగు యంత్రం నుంచి పుణెలో పరుగుల వరద పారింది. సూపర్‌ స్టార్‌ నుంచి సూపర్‌ ఇన్నింగ్స్‌. విరాట్‌ కోహ్లి (254 నాటౌట్‌, 336 బంతుల్లో 33 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ ద్వి శతకంతో చెలరేగాడు. కెరీర్‌లో రికార్డు ఏడో డబుల్‌ సెంచరీ కొట్టిన కెప్టెన్‌ కోహ్లి.. పుణె టెస్టులో భారత్‌ను తిరుగులేని స్థితిలో నిలిపాడు. రవీంద్ర జడేజా (91, 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ మెరుపులతో విజృంభించగా.. అజింక్య రహానె (59, 168 బంతుల్లో 8 ఫోర్లు) సమయోచిత అర్థ సెంచరీతో రాణించాడు. మయాంక్‌ అగర్వాల్‌ (108), విరాట్‌ కోహ్లి (254), రవీంద్ర జడేజా (91), అజింక్య రహానె (59) కదం తొక్కటంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ ఇండియా 601/5 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. విరాట్‌ కోహ్లి అరుదైన ట్రిపుల్‌ సెంచరీ ఘనత ముంగిట నిలిచినా.. జడేజా నిష్క్రమణతో కోహ్లి ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌ ప్రకటించాడు. చివరి సెషన్లో 15 ఓవర్ల పాటు ఆడిన దక్షిణాఫ్రికా భారత పేస్‌ ధాటికి విలవిల్లాడింది. ఉమేశ్‌ యాదవ్‌ (2/16), మహ్మద్‌ షమి (1/3) నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. డీన్‌ ఎల్గార్‌ (6), ఎడెన్‌ మార్క్‌రం (0), తెంబ బవుమా (8)లు స్వల్ప స్కోర్లకు వికెట్లు కోల్పోయారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 36/3తో పతనావస్థలో కొనసాగుతోంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు సఫారీ మరో 565 పరుగుల వెనుకంజలో ఉంది. నేడు దక్షిణాఫ్రికా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శనపై పుణె టెస్టులో సఫారీ ఆశలు ఆధారపడి ఉన్నాయి. భారత సీమర్లు, స్పిన్నర్ల జోరు కొనసాగితే పుణెలో మరోసారి కోహ్లిసేన బ్యాట్‌ పట్టాల్సిన అవసరం రాదేమో!.
విరాట్‌ విశ్వరూపం : ఓవర్‌నైట్‌ స్కోరు 63తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (254) దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. నాల్గో వికెట్‌కు అజింక్య రహానెతో కలిసి 150ప్లస్‌ భాగస్వామ్యం నమోదు చేసిన కోహ్లి.. ఉదయం సెషన్‌ నుంచీ సఫారీ బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. 16 ఫోర్లతో 100 పరుగుల మైలురాయి అందుకున్న కోహ్లి.. మరో ఏడు ఫోర్లతో 241 బంతుల్లో 150 మార్క్‌ చేరుకున్నాడు. లంచ్‌కు ముందు సెంచరీ కొట్టిన కోహ్లి.. టీ సమయానికి ద్వి శతకానికి (194) చేరువయ్యాడు. అర్థ సెంచరీ తర్వాత రహానె నిష్క్రమించినా.. రవీంద్ర జడేజా (91)తో కలిసి కోహ్లి జోరు కొనసాగించాడు. జడ్డూతోనూ ఐదో వికెట్‌కు 150 ప్లస్‌ పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. సంప్రదాయ షాట్లతో అలరించిన విరాట్‌ 28 ఫోర్లు బాది 295 బంతుల్లో కెరీర్‌ రికార్డు ఏడో డబుల్‌ సెంచరీ కొట్టాడు. విరాట్‌ కోహ్లి కొట్టిన ద్వి శతకాలు అన్నీ కెప్టెన్‌గా సాధించినవే కావటం విశేషం. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా వస్తూనే విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్‌ డిక్లరేషన్‌ సందేశంతో జడేజా ఎడాపెడా బాదాడు. 8 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన జడేజా 104 బంతుల్లో 91 పరుగులు చేశాడు. విరాట్‌ కోహ్లి 250 మార్క్‌ అందుకునేందుకు రెండు బంతులను బౌండరీ ఆవల పంపించాడు. 33 ఫోర్లు, రెండు సిక్సర్లతో కోహ్లి 250 పరుగుల మైలురాయి చేరుకు న్నాడు. శతక విహారం జోరులో రవీంద్ర జడేజా 91 పరుగుల వద్ద వికెట్‌ కోల్పోయాడు. అరుదైన ట్రిపుల్‌ సెంచరీ అవకాశం వదులుకుని.. కెప్టెన్‌ కోహ్లి భారత్‌ ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించాడు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడ (3/93), ముతుసామి (1/97), మహరాజ్‌ (1/196) వికెట్లు తీసుకున్నారు.
దక్షిణాఫ్రికా విలవిల : భారత బౌలర్లు పుణెలో విశాఖ ప్రదర్శనను పునరావృతం చేశారు. విశాఖలో రెండో రోజు ఆఖర్లో స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌ సఫారీ మూడు వికెట్లు కూల్చారు. పుణెలో ఆ పని పేసర్లు మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌ చేశారు. బంతిని వికెట్‌కు ఇరు వైపులా స్వింగ్‌ చేసిన ఉమేశ్‌ యాదవ్‌ ఓపెనర్‌ డీన్‌ ఎల్గార్‌ (6)ను బోల్తా కొట్టించాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో వచ్చిన ఉమేశ్‌ బంతిని ఆడాలా వద్దా అనే మీమాంసలో ఉన్న ఎల్గార్‌ వికెట్‌ కోల్పోయాడు. మరో ఓపెనర్‌ మార్కరంను ఇన్నింగ్స్‌ 1.2 ఓవర్లోనే ఇన్‌ స్వింగర్‌తో ఉమేశ్‌ యాదవ్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. నం.4 బ్యాట్స్‌మన్‌ తెంబ బవుమా (8) మరోసారి మహ్మద్‌ షమికి వికెట్‌ కోల్పోయాడు. 15 ఓవర్లకే దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుంది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ డీ బ్రూయిన్‌ (20 బ్యాటింగ్‌)తో కలిసి నైట్‌ వాచ్‌మన్‌ అన్రిచ్‌ (2 బ్యాటింగ్‌) రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కొనసాగుతున్నాడు.
స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : మయాంక్‌ అగర్వాల్‌ (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 108, రోహిత్‌ శర్మ (సి) డికాక్‌ (బి) రబాడ 14, పుజార (సి) డుప్లెసిస్‌ (బి) రబాడ 58, కోహ్లి నాటౌట్‌ 254, రహానె (సి) డికాక్‌ (బి) మహరాజ్‌ 59, జడేజా (సి) బ్రూయిన్‌ (బి)ముతుసామి 91, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (156.3 ఓవర్లలో 5 వికెట్లకు) 601.
వికెట్ల పతనం : 1-25, 2-163, 3-198, 4-376, 5-601.
బౌలింగ్‌ : వెర్నన్‌ ఫిలాండర్‌ 26-6-66-0, కగిసో రబాడ 30-3-93-3, అన్రిచ్‌ 25-5-100-0, మహరాజ్‌ 50-10-196-1, ముతుసామి 19.3-1-97-1, ఎల్గార్‌ 4-0-26-0, మార్క్‌రం 2-0-17-0.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : డీన్‌ ఎల్గార్‌ (బి) ఉమేశ్‌ 6, మార్క్‌రం (ఎల్బీ) ఉమేశ్‌ 0, డీ బ్రూయిన్‌ బ్యాటింగ్‌ 20, తెంబ బవుమా (సి) సాహా (బి) షమి 8, అన్రిచ్‌ బ్యాటింగ్‌ 2, ఎక్స్‌ట్రాలు : 00, మొత్తం : (15 ఓవర్లలో 3 వికెట్లకు) 36.
వికెట్ల పతనం : 1-2, 2-13, 3-33.
బౌలింగ్‌ : ఇషాంత్‌ శర్మ 4-0-17-0, ఉమేశ్‌ యాదవ్‌ 4-1-16-2, రవీంద్ర జడేజా 4-4-0-0, మహ్మద్‌ షమి 3-1-3-1.

7000: టెస్టుల్లో విరాట్‌ కోహ్లి 7000 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. 138వ ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించాడు. వాలీ హమ్మండ్‌ (131), సెహ్వాగ్‌ (134), సచిన్‌ (136) కోహ్లి కంటే వేగంగా ఏడు వేల పరుగులు సాధించాడు.
7:టెస్టుల్లో విరాట్‌ కోహ్లి ద్వి శతకాలు 7. అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించిన భారత ఆటగాడిగా సెహ్వాగ్‌ (6), సచిన్‌ (6)లను కోహ్లి దాటేశాడు. బ్రాడ్‌మన్‌ (12), సంగక్కర (11), బ్రియాన్‌ లారా (9) ముందున్నారు.
40:కోహ్లి గత 40 టెస్టుల వ్యవధిలోనే ఏడు ద్వి శతకాలు సాధించాడు. కెరీర్‌ 42వ టెస్టులో (విండీస్‌)పై 2016 జూన్‌లో కోహ్లి తొలి డబుల్‌ కొట్టాడు. జూన్‌ 2016 నుంచి మరో బ్యాట్స్‌మన్‌ రెండు కంటే ఎక్కువ డబుల్‌ కొట్టలేదు. భారత బ్యాటింగ్‌ లైనప్‌ కలిసి మూడు మాత్రమే కొట్టారు. కోహ్లి ఏడు సాధించాడు.
254: భారత కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి అత్యధిక స్కోరు సాధించాడు. దక్షిణాఫ్రికాపై సచిన్‌ (1996-97) లో 169 పరుగుల కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడాడు
6:విరాట్‌ కోహ్లి ఆరు టెస్టు జట్లపై డబుల్‌ సెంచరీలు కొట్టాడు. బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లపై ద్వి శతకాలు బాదాడు. ఆస్ట్రేలియాపై మాత్రమే కోహ్లి డబుల్‌ సెంచరీ కొట్టాల్సి ఉంది.
5: టెస్టుల్లో 250 పైచిలుకు పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌ కోహ్లి. వీవీఎస్‌ లక్ష్మణ్‌, సెహ్వాగ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, కరుణ్‌ నాయర్‌లు సైతం 250 ప్లస్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు.

img
READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD