విశాఖలో వన్డే.. డిసెంబరు 18న భారత్‌, విండీస్ మధ్య మ్యాచ్‌

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-12 08:11:52

వేదికగా ఏసీఏ వీడీసీఏ స్టేడియం

విశాఖపట్నం : విశాఖపట్నం మరో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. పోతినమల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో డిసెంబరు 18న భారత్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. డిసెంబరులో భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్‌ జట్టు మూడు టీ 20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. డిసెంబరు ఆరు నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు ముంబై, తిరువనంతపురం, హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుండగా, డిసెంబరు 15న జరిగే తొలి వన్డేకు చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక కానుండగా, డిసెంబరు 18న జరిగే రెండో వన్డేకు ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా నిలవనుంది. చివరి వన్డే డిసెంబరు 22న కటక్‌లోని బారబతి స్టేడియంలో జరగనుంది.

ఇటీవల భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన విశాఖ...మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ వన్డేకు సిద్ధం కావడం క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొల్పింది. టెస్టు మ్యాచ్‌కు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు హాజరు కాకపోవడంతో గ్యాలరీలు బోసిపోయాయి. అయితే ఇప్పటివరకు ఇక్కడ జరిగిన వన్డే, టీ20 మ్యాచ్‌లకు క్రీడాభిమానుల నుంచి విశేష స్పందన వచ్చి గ్యాలరీలు కిటకిటలాడేవి. ఈ నేపథ్యంలో డిసెంబరు 18న భారత్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాలు భావిస్తున్నాయి

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN