విశాఖ టెస్ట్‌లో భారత్‌ ఘనవిజయం

Namasthe Telangana

Namasthe Telangana

Author 2019-10-07 06:28:00

-తొలిటెస్టులో 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు
-సాగర సమీరం
-విశాఖపట్నంలో టీమ్‌ఇండియా విజయఢంకా
-తొలి టెస్టులో 203 పరుగులతో దక్షిణాఫ్రికా చిత్తు.. రాణించిన షమీ, జడేజాబ్యాట్స్‌మెన్‌ విజృంభణకు బౌలర్ల కృషి తోడవడంతో.. వైజాగ్‌లో భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. సఫారీల అసమాన పోరాటంతో ఒకదశలో ఈ మ్యాచ్‌లో ఫలితం రావడం కష్టమే అనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపిన టీమ్‌ఇండియా.. ఆనక బౌలింగ్‌లోనూ అదరగొట్టి సిరీస్‌లో శుభారంభం చేసింది. షమీ రివర్స్‌స్వింగ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తే.. జడేజా ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి సఫారీల నడ్డి విరిచాడు.
img
విశాఖపట్నం: అచ్చొచ్చిన పిచ్‌పై భారత్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భళా అనిపించింది. మొదట బ్యాట్స్‌మెన్‌ దంచికొట్టి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఆ తర్వాత బౌలర్లు బాధ్యతాయుతంగా బంతులేసి మ్యాచ్‌ను ఒడిసిపట్టారు. చివరి రోజు మహమ్మద్‌ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో.. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా సాగరతీరంలో భారత్‌ 203 పరుగుల తేడాతో జయభేరి మోగించి.. 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది. దీంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగించింది. ఇప్పటికే వెస్టిండీస్‌పై రెండు మ్యాచ్‌ల సిరీస్‌ నెగ్గి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌.. ఈ విజయంతో 160 పాయింట్లు ఖాతాలో వేసుకొని టాప్‌ప్లేస్‌ను మరితం పటిష్ఠం చేసుకుంది. ఆదివారం ఉదయం దక్షిణాఫ్రికా టాపార్డర్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకున్నా.. ఆఖర్లో పీట్‌ (56; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ముత్తుస్వామి (49 నాటౌట్‌, 5 ఫోర్లు) పోరాటంతో భారత విజయం కాస్త ఆలస్యమైంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు బాదిన రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య గురువారం పుణె వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.img
ఓవర్‌నైట్‌ స్కోరు 11/1తో చివరి రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. అశ్విన్‌ తొలి ఓవర్‌లోనే డిబ్రుయన్‌ (10)ను ఔట్‌చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ వెంటనే బవుమా (0)ను వెనక్కి పంపిన షమీ ఆ సంతోషాన్ని రెట్టింపు చేశాడు. ఈ దశలో మార్క్మ్‌ (39; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ (13)ను కూడా షమీ పెవిలియన్‌ బాటపట్టించాడు. అంతసేపు ఆఫ్‌స్టంప్‌కు ఆవల బంతులేసిన షమీ.. రివర్స్‌ స్వింగ్‌తో సఫారీ సారథిని బోల్తా కొట్టించాడు. తర్వాతి ఓవర్‌లోనే డికాక్‌ (0)ను ఔట్‌ చేసిన షమీ ప్రొటీస్‌ను చావుదెబ్బ కొట్టాడు. ఈ ముగ్గురిని క్లీన్‌ బౌల్డ్‌ చేయడం.. షమీ రివర్స్‌స్వింగ్‌ రాబట్టిన తీరుకు నిదర్శనం.

img
అప్పటికే ఓటమి అంచున నిలిచిన సఫారీలను జడేజా ఒకే ఓవర్‌లో 3 వికెట్లు పడగొట్టి మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మొండిగా పోరాడుతున్న ఓపెనర్‌ మార్క్మ్‌న్రు చక్కటి రిటర్న్‌ క్యాచ్‌ ద్వారా ఔట్‌ చేసిన జడ్డూ.. రెండు బంతుల విరామం అనంతరం వరుసగా ఫిలాండర్‌ (0), కేశవ్‌ మహరాజ్‌ (0)ను వెనక్కిపంపాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా 70/8తో పరాజయానికి చేరువైంది. ఇక సఫారీల ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతోసేపు పట్టదనుకుంటే.. టెయిలెండర్లు అనూహ్యంగా పోరాడారు. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ తడబడ్డ చోట పీట్‌, ముత్తుస్వామి మొండి పట్టుదల కనబర్చారు. బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ.. ఈ జోడీ సుమారు 33 ఓవర్ల పాటు క్రీజులో నిలిచింది. తొమ్మిదో వికెట్‌కు 91 పరుగులు జోడించాక పీట్‌ను షమీ వెనక్కిపంపాడు. పీట్‌ బ్యాట్‌ అంచును తాకిన ఫుల్‌లెంగ్త్‌ బంతి వికెట్లపైకి దూసుకెళ్లింది. దీంతో వికెట్‌ విరిగి రెండు ముక్కలైంది. చివర్లో రబాడ (18)ను కూడా ఔట్‌ చేసిన షమీ.. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

1

టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్‌.. శ్రీలంక దిగ్గజం మురళీధరన్‌ (66 మ్యాచ్‌ల్లో) సరసన చేరాడు.

37

ఒక టెస్టులో నమోదైన అత్యధిక సిక్సర్ల సంఖ్య. సంప్రదాయ ఫార్మాట్‌ చరిత్రలో ఇవే అత్యధికం. 2014లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ మధ్య నమోదైన 35 సిక్సర్ల రికార్డు తెరమరుగైంది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 502/7 డిక్లేర్డ్‌, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 431, భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 323/4 డిక్లేర్డ్‌,
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్మ్‌ (సి అండ్‌ బి) జడేజా 39, ఎల్గర్‌ (ఎల్బీ) జడేజా 2, డిబ్రుయన్‌ (బి) అశ్విన్‌ 10, బవుమా (బి) షమీ 0, డుప్లెసిస్‌ (బి) షమీ 13, డికాక్‌ (బి) షమీ 0, ముత్తుస్వామి (నాటౌట్‌) 49, ఫిలాండర్‌ (ఎల్బీ) జడేజా 0, కేశవ్‌ (ఎల్బీ) జడేజా 0, పీట్‌ (బి) షమీ 56, రబాడ (సి) సాహా (బి) షమీ 18, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 63.5 ఓవర్లలో 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-4, 2-19, 3-20, 4-52, 5-60, 6-70, 7-70, 8-70, 9-161, 10-191, బౌలింగ్‌: అశ్విన్‌ 20-5-44-1, జడేజా 25-6-87-4, షమీ 10.5-2-35-5, ఇషాంత్‌ 7-2-18-0, రోహిత్‌ 1-0-3-0.

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD