వెస్టిండీస్ ప్రధాన కోచ్‌గా సిమ్మన్స్‌ ఎంపిక

Mana Telangana

Mana Telangana

Author 2019-10-16 15:35:17

img

అంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ఆ దేశ దిగ్గజ క్రికెటర్ ఇల్ సిమ్మన్స్‌ను ఎంపిక చేశారు. మూడేళ్ల క్రితం సిమ్మన్స్‌ను ఉన్న ఫళంగా కోచ్ పదవి నుంచి తప్పిస్తూ అప్పట్లో కరీబియన్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిమ్మన్స్ వంటి ప్రతిభావంతుడైన కోచ్‌ను తప్పించి విండీస్ బోర్డు భారీ మూల్యమే చెల్లించుకుంది. సిమ్మన్స్ ఉన్నప్పుడూ విండీస్ వరుస విజయాలతో ఆకట్టుకుంది. అయితే క్రికెటర్లకు, బోర్డుకు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో సిమ్మన్స్‌పై వేటు పడింది. ఆ తర్వాత విండీస్ క్రికెట్ జట్టు కష్టాలు రెట్టింపు అయ్యాయి. కాగా, తిరిగి సిమ్మన్స్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తూ విండీస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. సిమ్మన్స్ కోచ్‌గా ఉన్నప్పుడే వెస్టిండీస్ 2016లో ట్వంటీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుం ది. పొట్టి క్రికెట్‌లో విండీస్‌ను బలమైన శక్తిగా మార్చడంలో సిమ్మన్స్ ఎంతో కృషి చేశాడు.

అపార అనుభవజ్ఞుడైన సిమ్మన్స్ తిరిగి ప్రధాన కోచ్‌గా ఎంపిక కావడంతో విండీస్ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతని పర్యవేక్షణలో విండీస్ మళ్లీ పూర్వ వైభవం దిశగా సాగుతుందనే నమ్మకంతో వారున్నారు. విండీస్ బోర్డు కూడా సిమ్మన్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. జట్టులో కొత్త జోష్ నింపుతాడనే నమ్మకంతో ఉంది. సిమ్మన్స్ ఇటీవలే అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ప్రపంచకప్‌లో అఫ్గాన్ పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో సిమ్మన్స్ పదవిని పొడిగించడానికి అఫ్గాన్ బోర్డు ఆసక్తి కనబరచలేదు. దీంతో సిమ్మన్స్ విండీస్ జట్టు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. సిమ్మన్స్‌ను తమ ప్రధాన కోచ్‌గా నియమించేందుకు విండీస్ బోర్డు అంగీకరించింది. కాగా, ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌ కోసం కూడా సిమ్మన్స్ దరఖాస్తు చేసినా ఫలితం లేకుండా పోయింది. అతనిపై బిసిసిఐ పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే విండీస్ బోర్డు మాత్రం సిమ్మన్స్‌కు మరో అవకాశం ఇచ్చి పొరపాటును సరిదిద్దుకుందనే చెప్పాలి.

Simmons Selected as West Indies Head Coach

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD