వ్యవసాయ రంగానికి పెద్దపీట

Andhra Bhoomi

Andhra Bhoomi

Author 2019-10-20 07:44:22

img

విజయనగరం, అక్టోబర్ 19: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవసాయరంగానికి పెద్దపీట వేశారని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. శనివారం గాజులరేగ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘ఆరోగ్య జీవనానికి పోషక ధాన్యాల సాగు-రైతుల ఆదాయం రెట్టింపు’ అనే అంశంపై కిసాన్ మేళా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించి అధిక ఆదాయం పొందాలని పిలుపునిచ్చారు. తమ పొలాలకు భూసార పరీక్షలు చేయించుకొని భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా ఎరువులు వినియోగించి భూసారాన్ని పెంచుకోవాలన్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉందని, వాటిపై రైతులు దృష్టి సారించాలన్నారు. మరో అతిథి, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.దామోదరనాయుడు మాట్లాడుతూ పోషక ధాన్యాల సాగు ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు, అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చేలా చేయవచ్చన్నారు. ఇందుకు పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. పోషక ధాన్యాలను ముడి సరకుగా విక్రయించడం వల్ల రైతులు అధిక ఆదాయం పొందలేకపోతున్నారన్నారు. వాటిని శుద్ధిచేసి, విలువలు జోడించి విలువ ఆధారిత ఉత్పత్తులుగా విక్రయించడం ద్వారా మూడింతలు ఆదాయం పొందవచ్చన్నారు. అందుకోసమే రైతులకు పద్ధతులు పరిచయం చేసేందుకు కిసాన్‌మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోషక ధాన్యాల శుద్ధికి అవసరమైన యంత్ర పరికరాలను వ్యవసాయదారులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వ్యవసాయ కూలీల కొరత ఉన్న ప్రాంతాల్లో కోత యంత్రాలు వంటి వాటిని వినియోగించుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పంటలపై డ్రోన్‌ల ద్వారా పురుగుమందులు చల్లడంపై పరిశోధనలు జరుపుతున్నట్టు వైస్ ఛాన్సలర్ తెలిపారు. రెండు, మూడేళ్లలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే అవకాఉం ఉందన్నారు. రాష్ట్రంలో 25 రకాల పంటలపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ వ్యవసాయానికి, పంటల సాగుకు సంబంధించి నూతన విషయాలు తెలుసుకునేందుకు ఇదొక మంచి వేదిక అని అభిప్రాయపడ్డారు. తనది కూడా వ్యవసాయ కుటుంబమేనమని గుర్తు చేశారు. తన తండ్రి 82 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. మిల్లెట్ మిషన్‌కు జిల్లా ఎంపికైందని వ్యవసాయశాఖ జెడి ఆశాదేవి తెలిపారు. రైతులు నూతనంగా రూపొందించిన యంత్ర పరికరాలను అతిథులు తిలకించారు.
*చిత్రం...కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పక్కన వీసీ దామోదరనాయుడు తదితరులు

READ SOURCE

Experience triple speed

Never miss the exciting moment of the game

DOWNLOAD