షకీబల్‌పై ఐసీసీ కొరడా

Andhrajyothy

Andhrajyothy

Author 2019-10-30 06:16:17

  • బంగ్లా ఆల్‌రౌండర్‌పై రెండేళ్ల నిషేధం
  • బుకీ విషయం చెప్పనందుకు ఫలితం

గతవారం రోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తోడు బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు మరో ఝలక్‌ తగిలింది. పలు డిమాండ్లతో ఆటగాళ్ల సమ్మెకు నేతృత్వం వహించడంతో పాటు తమ బోర్డు వ్యతిరేక కంపెనీకి అంబాసిడర్‌గా ఉంటూ వార్తల్లో నిలిచిన స్టార్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌ షకీబల్‌ హసన్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల్లో చిక్కుకున్నాడు. దాదాపు రెండేళ్ల క్రితం తనను సంప్రదించిన భారత బుకీ వివరాలను సకాలంలో తమకు అందించనందుకు అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో భారత్‌లో పర్యటించడానికి ఒక రోజు ముందే

ఆ జట్టుకు గట్టి షాక్‌ తగిలినట్టయింది.

ఢాకా/దుబాయ్‌: ఆధునిక క్రికెట్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న షకీబల్‌ హసన్‌పై ఐసీసీ కొరడా ఝుళిపించింది. బంగ్లాదేశ్‌ టెస్టు, టీ20 కెప్టెన్‌గా ఉన్న అతడిపై అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది. దీంతో త్వరలో భారత పర్యటనతో పాటు వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌, టీ20 ప్రపంచక్‌పనకు కూడా అతను దూరమైనట్టే. ఏడాదిన్నర కాలంగా ఫిక్సింగ్‌ కోసం భారత బుకీ దీపక్‌ అగర్వాల్‌ మూడు సార్లు సంప్రదించినా షకీబల్‌ ఆ విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌ (ఏసీయూ)కు చేరవేయడంలో నిర్లక్ష్యం వహించాడు. ఇందులో ఒకటి గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో సీరియస్‌ అయిన ఐసీసీ.. ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం మూడు అభియోగాలు నమోదు చేసింది. అయితే విచారణలో భాగంగా తన తప్పులను అంగీకరించడంతో రెండేళ్ల నిషేధంలో ఓ ఏడాది కాలాన్ని సస్పెన్షన్‌లో ఉంచింది. దీని ప్రకారం అతడు ఐసీసీ నిబంధనలను సరిగా పాటిస్తే 2020, అక్టోబర్‌ 29 నుంచి తిరిగి క్రికెట్‌ ఆడే వీలుంటుంది. ‘నేనెంతగానో ప్రేమిస్తున్న ఆట నుంచి నిషేధానికి గురైనందుకు చింతిస్తున్నా. అయితే బుకీ గురించి వివరాలు తెలపకపోవడం నేను చేసిన పొరపాటు. అందుకే నాపై విధించిన శిక్షను అంగీకరిస్తున్నాను. క్రికెట్‌లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో ఆటగాళ్లపై ఐసీసీ ఏసీయూ నమ్మకాన్ని ఉంచింది. కానీ ఈ విషయంలో నా బాధ్యతను విస్మరించాను. ఈ ఆట పారదర్శకంగా జరగాలని కోరుకునేవారిలో నేనూ ఒకడిని’ అని షకీబల్‌ ఓ ప్రకటనలో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తప్పును అంగీకరించిన షకీబల్‌ యువ ఆటగాళ్లకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాడని ఐసీసీ జీఎం అలెక్స్‌ మార్షల్‌ తెలిపారు. ఐసీసీ నుంచి వచ్చిన సూచనల మేరకే బంగ్లా జట్టు ప్రాక్టీస్‌ సెషన్లలో షకీబల్‌ పాల్గొనలేదు.

అసలేం జరిగింది..: నిబంధనల ప్రకారం ఏ స్థాయి క్రికెట్‌లోనైనా ఓ ఆటగాడిని ఫిక్సింగ్‌ కోసం బుకీలు సంప్రదిస్తే ఆ విషయాన్ని వెంటనే ఆయా బోర్డులు ఏసీయూకు తెలపాలి. కానీ ఇక్కడ షకీబల్‌ చూసీచూడనట్టుగా వదిలేయడం అతడి కెరీర్‌కు విఘాతమైంది. తొలిసారిగా 2018లో బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వేల మధ్య జరిగిన ముక్కోణపు ట్రోఫీలో రెండుసార్లు భారత బుకీ దీపక్‌ అగర్వాల్‌ వాట్సాప్‌ ద్వారా సందేశం పంపాడు. ఆ తర్వాత అదే ఏడాది ఐపీఎల్‌లో ఏప్రిల్‌ 26న సన్‌రైజర్స్‌, పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సమయంలోనూ అగర్వాల్‌ అతడి సహాయం కోరాడు. జట్టు తుది కూర్పు, వ్యూహాలకు సంబంధించిన వివరాలు వెల్లడించాల్సిందిగా ఈ మూడు సందర్భాల్లో షకీబల్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఇందుకు షకీబల్‌ అంగీకరించకపోయినా ఈ విషయాన్ని బంగ్లా బోర్డుకు కానీ, ఏసీయూకు కానీ చెప్పలేదు. అయితే ఆ తర్వాత ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న బీసీబీ ఏసీయూ షకీబల్‌తో పాటు సహచర ఆటగాళ్లను ప్రశ్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడే ఐసీసీ ఈ ఉదంతంపై సీరియస్‌ అయ్యింది. ఈ ఏడాది జనవరి, ఆగస్టులో షకీబల్‌ను ప్రశ్నించిన ఐసీసీ ఏసీయూ ఓ నిర్ధారణకు వచ్చి ఆర్టికల్‌ 2.4.4 ప్రకారం మూడు అభియోగాలు నమోదు చేసింది. దీని ప్రకారం ‘ఎవరైనా ఫిక్సింగ్‌ కోసం తమను సంప్రదించినప్పుడు వారి వివరాలను సదరు ఆటగాడు ఏసీయూకు తెలపకపోవడం’ నేరమవుతుంది. అదీగాకుండా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వస్తే విచారణకు విఘాతం కలిగినట్టుగా ఐసీసీ భావిస్తోంది.

బంగ్లా క్రికెట్‌కు కష్టమే..

షకీబల్‌ హసన్‌.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడే కాకుండా జట్టు విజయాల్లో అతడిదే కీలక పాత్ర. బ్యాటింగ్‌తో పాటు స్పిన్నర్‌గానూ అతడు ప్రత్యర్థి జట్లపై ఆధిక్యం ప్రదర్శిస్తుంటాడు. క్రీజులో షకీబల్‌ ఉంటే తమ విజయంపై బంగ్లా భరోసాగా ఉంటుంది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో 11,752 పరుగులు, 562 వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ల స్టార్‌ క్రికెటర్‌కు ఎన్నోసార్లు అద్భుత ఆటతీరుతో జట్టును గట్టెక్కించిన అనుభవం ఉంది. ఈ ఏడాది వన్డే వరల్డ్‌క్‌పలో అతడు 8 మ్యాచ్‌ల్లో 2 శతకాలతో 606 పరుగులు చేసి రన్స్‌ పరంగా మూడో స్థానంలో నిలిచాడు. అలాగే ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో వన్డేల్లో నెంబర్‌వన్‌గా, టీ20ల్లో నెంబర్‌ టూగా, టెస్టుల్లో నెంబర్‌ 3గా ఉన్నాడంటేనే షకీబల్‌ సత్తా ఏమిటో అర్థమవుతుంది. అయితే, తాజాగా అతడిపై వేటు పడడం బంగ్లాదేశ్‌ క్రికెట్‌కు గడ్డుకాలమనే అనుకోవచ్చు. రాబోయే భారత పర్యటనతో పాటు టీ20 ప్రపంచక్‌పలోనూ అతడి ఆటతీరుపైనే అతిగా ఆధారపడిన బంగ్లా ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఈ నేపథ్యంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ ముందుగా పటిష్ఠ టీమిండియాకు ఏమేరకు పోటీనిస్తుందో చూడాల్సిందే.

బుకీతో వాట్సాప్‌

ఏప్రిల్‌ 26, 2018న పంజాబ్‌తో ఐపీఎల్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున షకీబల్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో తను 28 పరుగులు చేయగా జట్టు 13 పరుగులతో గెలిచింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి అగర్వాల్‌ నుంచి షకీబల్‌కు వాట్సాప్‌ సందేశం వచ్చింది. ఫలానా ఆటగాడు తుది జట్టులో ఉన్నాడా? అని అడగడంతో పాటు జట్టు అంతర్గత సమాచారాన్ని కోరాడు. ఇంతటితో ఆగకుండా బిట్‌ కాయిన్స్‌, డాలర్‌ అకౌంట్స్‌ గురించి మాట్లాడాడు. అలాగే షకీబల్‌ డాలర్‌ అకౌంట్‌ వివరాలను కూడా అడిగాడు. అయితే ఇందులో చాలా మెసేజ్‌లను షకీబల్‌ తొలగించాడు. కానీ విచారణలో అవన్నీ కూడా అగర్వాల్‌తో జరిపినవేనని అంగీకరించాడు. దీంతోపాటు 2017 బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లోనూ అతన్ని సంప్రదించినట్టు సమాచారం. వాస్తవానికి షకీబల్‌ను అగర్వాల్‌ ప్రత్యక్షంగా కలుసుకోవాలనుకున్నాడని ఐసీసీ తెలిపింది. అయితే అగర్వాల్‌ తీరు చూసి షకీబల్‌ ఆందోళన చెందాడని, అలాగే అతడు అడిగే విధానంతో అగర్వాల్‌ ఓ బుకీ అని నిర్ధారించుకున్నట్టు పేర్కొంది. ఈ అభియోగాలపై వాస్తవానికి గరిష్ఠంగా ఐదేళ్లు, కనిష్ఠంగా ఆరు నెలల నిషేధం పడుతుంది. అయితే షకీబల్‌ తన నేరాన్ని అంగీకరించడంతో అప్పీల్‌ చేసుకునే వీల్లేదు.

కొత్త కెప్టెన్లు మహ్మదుల్లా, మోమినుల్‌

షకీబల్‌పై నిషే ధంతో భారత పర్యటనకు వెళ్లే టెస్టు, టీ20 జట్ల కెప్టెన్లను బంగ్లాక్రికెట్‌ బోర్డు మార్చింది. ఇంతకుముందు ఈ రెండు ఫార్మాట్లకూ షకీబల్‌ సారథిగా ఉన్నాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో టెస్టులకు మోమినుల్‌ హక్‌, టీ20లకు మహ్మ దుల్లా రియాద్‌ కెప్టెన్లుగా నియమించారు. టీ20 జట్టులో షకీబల్‌ స్థానంలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లామ్‌ జట్టులోకొచ్చాడు.

షకీబల్‌కు బంగ్లా ప్రధాని మద్దతు

ఢాకా: ఫిక్సింగ్‌ వ్యవహారంలో రెండేళ్ల నిషేధానికి గురైన స్టార్‌ క్రికెటర్‌ షకీబల్‌ హసన్‌ పొరపాటు చేశాడని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా పేర్కొన్నారు. అయితే అతడికి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మద్దతుగా ఉంటుందని భరోసానిచ్చారు. ‘బుకీ గురించి సమాచారం ఇవ్వకపోవడం షకీబల్‌ చేసిన తప్పు. అది అందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని అతడు కూడా అర్థం చేసుకున్నాడు. అయితే ఐసీసీ తీసుకున్న నిర్ణయంలో మా ప్రభుత్వం జోక్యం చేసుకోదు. కాకపోతే అతడికి బీసీబీ మద్దతుగా నిలుస్తుంది’ అని ప్రధాని తెలిపారు. మరోవైపు ఈ కష్టకాలంలో అతడికి అండగా ఉంటామని, నిషేధం పూర్తయ్యాక షకీబల్‌ కోసం జట్టు ద్వారాలు తెరిచే ఉంటాయని బీసీబీ ప్రకటించింది.

READ SOURCE

⚡️Fastest Live Score

Never miss any exciting cricket moment

OPEN